November Shubh Muhurat: 20 రోజుల్లో 18కి పైగా.. నవంబర్ నెలలో శుభ ముహూర్తాలు ఎక్కువే..!
November 2026 Shubh Muhurat: కార్తీక మాసం 2026లో శుభకార్యాలు నిర్వహించాలనుకుంటున్నారా? నవంబర్ నెలలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు సహా పలు శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఏయే తేదీల్లో ఎలాంటి శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి? డిసెంబర్‌లో కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయా? తెలుసుకోండి.

ఈ ఏడాది నవంబర్ నెలలో, అంటే నవంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసం (Karthika Masam)లో పెళ్లి, ఉపనయనం, గృహ ప్రవేశం, గృహారంభం, సీమంతం, అన్నప్రాశనం, డోలారోహణం వంటి శుభ కార్యాలకు సంబంధించి 17 రోజుల పాటు ముహూర్తాలు లభిస్తున్నాయి. కార్తీక మాసం డిసెంబర్ నెలలో కూడా కొనసాగుతున్నందువల్ల ఆ నెలలో 3వ తేదీన కూడా పెళ్లి, సీమంత ముహూర్తాలకు అవకాశం ఉంది. నవంబర్ నెలలో 20 రోజుల సమయంలో 18కి పైగా మంచి ముహూర్తాలు ఉన్నాయని పంచాంగ కర్తలు తెలియజేస్తున్నారు.
నవంబర్ 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 25, 26, 27, డిసెంబర్ 2, 3 తేదీల్లో పగటి ముహూర్తాలతో పాటు రాత్రి ముహూర్తాలకు కూడా అవకాశం ఉంది. కాగా నవంబర్ 13, 14, 16, 21, 22, 25, 27, 28, డిసెంబర్ 2, 3 తేదీల్లో నిర్ణయించిన పెళ్లి ముహూర్తాలు చాలా విశిష్టమైనవని, వీటిని దైవజ్ఞులు నిర్ణయించడం జరిగిందని పంచాంగాలు తెలియజేస్తున్నాయి. వాస్తవానికి డిసెంబర్ నెలలో కూడా కొన్ని విశిష్టమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి.
సాధారణంగా ఈ ముహూర్తాల సమయం వ్యక్తిగత జాతకాలను బట్టి, జాతకాల పొంతనలను బట్టి కూడా మారుతుంది. కచ్చితమైన ముహూర్తం వ్యక్తిగత జాతకాన్ని బట్టే కాక, ఒక్కోసారి స్థానిక పంచాంగాన్ని బట్టి కూడా మారుతుంది. అందువల్ల జ్యోతిష పండితులను సంప్రదించి ఈ ముహూర్తాల్లో మీకు అనువైన ముహూర్తాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. ఇవే ముహూర్తాలలో నిశ్చితార్థాలను కూడా నిర్ణయించడం జరుగుతుంది. వధూవరుల నక్షత్రాలు, చంద్రుడున్న రాశి, పుట్టిన సమయం వంటి అంశాల ఆధారంగా పెళ్లి ముహూర్తాలు నిర్ణయమవుతాయి.
ఈసారి గ్రహ స్థితి, ఇతరత్రా రాశిబలం కారణంగా ఈ ఏడాదంతా అనేక పెళ్లి తదితర శుభ కార్యాలకు ముహూర్తాలు ఉన్నాయని, ఈ ముహూర్త సమయాల్లో పెళ్లిళ్లు చేయడం శుభప్రదం. ఉత్తర భారతదేశంలోనే కాక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా ఈ ముహూర్తాలను అనుసరించడం జరుగుతోందని జ్యోతిష పండితులు, పంచాంగకర్తలు తెలియజేస్తున్నారు.
గృహ ప్రవేశం, గృహారంభం
నవంబర్ 10వ తేదీ మొదలుకుని కార్తీక మాసమంతా గృహ ప్రవేశానికి, భూమిపూజ, శంకు స్థాపన వంటి కార్యక్రమాలకు కూడా అనుకూలమైన ముహూర్తాలను నిర్ణయించడం జరిగింది. ఎవరి పేరున ఇల్లు రిజిస్ట్రేషన్ జరుగుతుందో వారి నక్షత్రాన్ని బట్టి గృహ ప్రవేశ ముహూర్తాన్ని నిర్ణయించవలసి ఉంటుంది. నవంబర్ 10తో మొదలయ్యే కార్తీక మాసంలో సుమారు 15 గృహ ప్రవేశ, గృహారంభ ముహూర్తాలున్నాయని పంచాంగకర్తలు తెలియజేస్తున్నారు. వ్యక్తిగత జాతకాలు, నక్షత్రాలు, రాశులను బట్టి రాత్రి ముహూర్తాలను, పగటి ముహూర్తాలను నిర్ణయించడం జరుగుతుంది. ఉదయ ముహూర్తాలను మధ్యాహ్నం 12 గంటల లోపున, రాత్రి ముహూర్తాలను రాత్రి 8 గంటల తర్వాత నిర్ణయించడం జరుగుతుంది.
మొత్తం మీద ఈ ఏడాది నవంబర్ మాసంలో పెళ్లి, గృహ ప్రవేశం, శంకుస్థాపన, నిషేకం వంటి శుభ కార్యాలకు ముహూర్తాలకు కొదవ లేదని పంచాంగకర్తలు చెబుతున్నారు. శుభగ్రహాలు అనుకూ లంగా ఉన్నందువల్ల ఈ ముహూర్తాలను దైవ ముహూర్తాలుగా కూడా వ్యవహరించడం జరుగు తోందని, ఇవి దక్షణ భారతానికే కాక, ఉత్తర భారతానికి కూడా వర్తిస్తాయని పంచాంగ కర్తలు తెలియజేస్తున్నారు.




