విజయదశమి నుంచి దశ తిరిగే రాశులివే..! ఒకేసారి మూడు శుభయోగాలు
దసరా పండుగ వేళ మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి. జ్యోతిష్య అంచనాల ప్రకారం విజయదశమి తర్వాత మేషం, మకరం, సింహం సహా ఆరు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లు సాగే అవకాశముంది. ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఆ రాశులేవో, ఎలాంటి మార్పులు ఉండవచ్చో తెలుసుకోండి.

దసరా పండుగ అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ విజయదశమి కొన్ని రాశుల వారికి జ్యోతిష్య పరంగా ప్రత్యేకమైనదిగా మారనుందని జ్యోతిష్య పండితులు అంచనావేస్తున్నారు. ముఖ్యంగా తులా రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలవడంతో మూడు శుభయోగాలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. ఈ గ్రహాల కలయికతో మేషం సహా ఆరు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఆ రాశులేవి? ఎలాంటి ఫలితాలు ఉండవచ్చు?
మూడు శుభయోగాలు.. ఏవంటే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు, బుధుడు, శుక్రుడు తులా రాశిలో కలవడంతో త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. ఈ గ్రహాల కలయిక నేపథ్యంలో బుధాదిత్య యోగం, శుక్రాదిత్య యోగం, లక్ష్మీనారాయణ రాజయోగాలు ఏర్పడతాయని భావిస్తున్నారు.
బుధాదిత్య యోగం: సూర్యుడు, బుధుడు కలిసినప్పుడు ఏర్పడే ఈ యోగం తెలివితేటలు, నిర్ణయ సామర్థ్యం, వృత్తిపరమైన పురోగతికి సంకేతంగా పరిగణిస్తారు.
శుక్రాదిత్య యోగం: సూర్యుడు, శుక్రుడు కలయికతో ఏర్పడే ఈ యోగం కళలు, సృజనాత్మకత, విలాసవంతమైన జీవితం వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది.
లక్ష్మీనారాయణ రాజయోగం: బుధుడు, శుక్రుడు కలిసినప్పుడు ఏర్పడే ఈ యోగాన్ని జ్యోతిష్యంలో ఆర్థిక పురోగతి, సౌఖ్యాలకు అనుకూలమైనదిగా భావిస్తారు.
1. మేష రాశి
మేష రాశి వారికి దసరా నుంచి వృత్తిపరంగా కొత్త అవకాశాలు తలుపులు తెరుచుకునే అవకాశముంది. ఉద్యోగంలో చాలాకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గుతాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. తమ ప్రతిభను నిరూపించుకునేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయి. వ్యాపారులు కొత్త ప్రణాళికలతో ముందుకు వేళ్లేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయి. గతంలో చేసిన ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లోనూ కొంత ఊరట కలిగే అవకాశముంది. అయితే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టే ముందు అన్ని వివరాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
2. మకర రాశి
మకర రాశి వారికి ఈ విజయ దశమి పండుగ సమయం కొత్త ఆశలను కలిగించే అవకాశముంది. ఉద్యోగంలో పురోగతి కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూల పరిణామాలు ఎదురవుతాయి. ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం మానసిక ధైర్యాన్ని పెంతారు. ఖర్చులను నియంత్రించుకుంటే ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడుతుంది.
3. సింహ రాశి
సింహ రాశి వారికి నిలిచిపోయిన పనుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ పనితీరుతో గుర్తింపు సాధిస్తారు. కొత్త బాధ్యతలు లేదా కీలకమైన ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశాలు పొందుతారు. వ్యాపారులకు కొత్త పరిచయాలు, ఒప్పందాలు ప్రయోజనకరంగా మారే అవకాశముంది. ఆర్థికంగా గతంలో చేసిన ప్రయత్నాలు కొంతమేరకు ఫలితాలను అందిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఆత్మవిశ్వాసంతో పాటు సంయమనం పాటించడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం అవసరం.
4. తులా రాశి
ఈ మూడు గ్రహాల కలయిక తులా రాశిలోనే ఏర్పడుతుండటంతో ఈ రాశివారికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన అంశాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. వ్యాపారులు కొత్త ఒప్పందాల కోసం ప్రయత్నించేందుకు అనుకూల సమయం ఇది. ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కృషి చేయాలి. ఆర్థికంగా కొత్త అవకాశాలు పొందుతారు. వ్యక్తిగత జీవితంలో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. అయితే శుక్రుడి వక్రగతి నేపథ్యంలో గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను మరోసారి పరిశీలించాల్సిన పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు.
5. ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి దసరా నుంచి కొత్త పనులు ప్రారంభించేందుకు ప్రోత్సాహం లభించే అవకాశముంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు చేసే ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నవారు కొత్త అవకాశాలపై సమాచారం అందుకుంటారు. వ్యాపారులు తమ కార్యకలాపాలను మెరుగుపరుచుకునేందుకు కొత్త వ్యూహాలను అమలు చేస్తారు. గతంలో రావాల్సిన డబ్బు తిరిగి చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో సమయం గడిపేందుకు వీలు కలుగుతుంది. అయితే ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునే ముందు లాభనష్టాలను అంచనా వేయడం అవసరం.
6. వృషభ రాశి
వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగుదల కోసం కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. గతంలో చేసిన కృషికి తగిన ప్రతిఫలం అందే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ పనులను సమర్థంగా పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారు కస్టమర్లను పెంచుకునేందుకు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. అయితే ఆదాయం పెరుగుతుందనే అంచనాతో అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్తపడాలి.
విజయదశమి ప్రాధాన్యత
విజయదశమి కొత్త పనులను ప్రారంభించేందుకు శుభప్రదమైన రోజుగా భావిస్తారు. ఈ సందర్భంగా దుర్గాదేవిని పూజించడం, పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, లక్ష్యాలను నిర్దేశించుకోవడం చాలామంది ఆచరిస్తారు. జ్యోతిష్య పరంగా శుభయోగాలు ఏర్పడుతున్నాయని భావించినప్పటికీ, జీవితంలో విజయం సాధించడానికి కృషి, ప్రణాళిక, సరైన నిర్ణయాలు కూడా కీలకమే.
(గమనిక: ఈ కథనంలోని రాశిఫలాలు జ్యోతిష్య నమ్మకాలు, అంచనాల ఆధారంగా అందించినవి. వీటిని నిర్ధారిత భవిష్యవాణిగా పరిగణించకూడదు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చని గుర్తుంచుకోవాలి)




