ఛీ మీరు మనుషులేనా..? ఉగ్రదాడిలో మరణించిన నేవీ ఆఫీసర్ భార్యపై దారుణమైన ట్రోలింగ్! రంగంలోకి మహిళా కమీషన్
లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ముస్లింలు, కశ్మీరీలపై ద్వేషాన్ని చూపించవద్దని చేసిన విజ్ఞప్తి తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడ్డారు. జాతీయ మహిళా కమిషన్ (NCW) ఆమెకు మద్దతుగా నిలిచి, ఆమెను లక్ష్యంగా చేసుకున్న ట్రోలింగ్‌ను ఖండించింది.

ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్‌కు జాతీయ మహిళా కమిషన్ (NCW) మద్దతుగా నిలిచింది. వ్యక్తిగత నమ్మకాలు లేదా సైద్ధాంతిక వ్యక్తీకరణల కోసం ఒక మహిళను లక్ష్యంగా చేసుకోవడం, ట్రోల్ చేయడం అన్యాయం, ఆమోదయోగ్యం కాదని కమిషన్ పేర్కొంది. కశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత.. ముస్లింలు, కశ్మీరీల పట్ల ద్వేషాన్ని చూపించవద్దని హిమాన్షి నర్వాల్ ప్రజలను కోరారు. ఈ దాడిపై “ముస్లింలు, కశ్మీరీలను ప్రజలు నిందించడం మాకు ఇష్టం లేదు” అని ఆమె గురువారం అన్నారు. ఆమె చేసిన ఈ ప్రకటన తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో ఆమెను దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమెపై ఇష్టమొచ్చిన రీతిలో అసభ్యకరమైన పదజాలంతో కామెంట్లు, పోస్టులతో కొంతమంది పైశాచికంగా ప్రవర్తించారు. దీంతో జాతీయ మహిళా కమీషన్ రంగంలోకి దిగింది. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణం తర్వాత, అతని భార్య హిమాన్షి నర్వాల్ ఆమె చేసిన ఒక ప్రకటనకు సంబంధించి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న తీరు దురదృష్టకరం. హిమాన్షి వ్యాఖ్యలు చాలా మంది భావాలతో ఏకీభవించకపోవచ్చు, కానీ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని కమిషన్ హెచ్చరించింది. ఉగ్రవాద చర్యతో దేశం బాధపడింది, కోపంగా ఉంది అని NCW పేర్కొంది.
హిమాన్షి నర్వాల్‌ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని, మీ నమ్మకాలతో వ్యక్తిగత జీవితం ఆధారంగా ట్రోల్ చేయడం తప్పు అని చెప్పింది. స్త్రీ గౌరవం చాలా విలువైందని, దేశం మొత్తం బాధలో ఉన్న సమయంలో ఇలాంటి ట్రోలింగ్ ఏంటని ప్రశ్నించింది. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని పిలుపునిచ్చింది. ఏప్రిల్ 16న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో వివాహం చేసుకున్న ఆరు రోజుల తర్వాత ఏప్రిల్ 22న (మంగళవారం) పహల్గామ్‌లో ఉగ్రవాదులు చంపిన 26 మంది పర్యాటకులలో వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. 26 ఏళ్ల వినయ్ తన భార్య హిమాన్షితో హనీమూన్‌లో ఉండగా ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు. ఏప్రిల్ 23న (బుధవారం) కర్నాల్‌లో అతని అంత్యక్రియలు జరిగాయి. 2022లో నేవీలో చేరిన తర్వాత నర్వాల్ గత ఒకటిన్నర సంవత్సరాలు కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్‌లో పనిచేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
