Himalayas: హిమాలయాల్లో కరిగిపోతున్న మంచు.. అలా జరిగితే భారీ నష్టం సంభవిస్తుందని నిపుణుల హెచ్చరిక..
హిమాలయాల్లోని(Himalayas) హిమనీనదాలు(Rivers) అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి. 'లిటిల్ ఐస్ ఏజ్'(little ice age) కంటే 10 రెట్లు వేగంగా కరిగిపోతున్నాయని నేచర్ జర్నల్ తన రిపోర్టులో వెల్లడించింది...
హిమాలయాల్లోని(Himalayas) హిమనీనదాలు(Rivers) అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి. ‘లిటిల్ ఐస్ ఏజ్'(little ice age) కంటే 10 రెట్లు వేగంగా కరిగిపోతున్నాయని నేచర్ జర్నల్ తన రిపోర్టులో వెల్లడించింది. దీని వల్ల సముద్ర మట్టాలు పెరగడంతోపాటు తాగేనీరు తగ్గిపోతోందని చెప్పింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. దీనీ ఎత్తు 8,848.86 మీటర్లు. ఈ మంచు కొండ కూడా వేగంగా కరిగిపోతోందని తన రిపోర్టులో పేర్కొంది. ఉత్తరాఖండ్‌లో మంచు కొండ చరియలు విరిగిపడి వరదలు ముంచెత్తి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా ఈ నివేదిక విడులైంది.
మౌంట్ ఎవరెస్ట్పై ఉన్న సౌత్ కల్నల్ గ్లేసియర్ అత్యంత వేగంగా కరిగిపోతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. సముద్రమట్టానికి 26,000 అడుగుల ఎత్తులో ఎవరెస్ట్ శిఖరాగ్రానికి కేవలం కిలోమీటర్ దిగువన ఈ సౌత్ కల్నల్ గ్లేసియర్ ఉంది. అయితే మంచు వేగంగా కరిగిపోవడానికి మానవ తప్పిదాలే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, మానవ తాకిడి పెరగడం, పేరుకుపోతున్న వ్యర్థాల వల్లే మంచు వేగంగా కరిగిపోతోందన్నారు. ఈ మంచు ఏర్పడేందుకు పట్టిన సమయం కన్నా 80రేట్లు వేగంగా కరిగిపోతోందని యూనివర్సిటీ ఆఫ్ మెయిన్ రీసెర్చర్లు తెలిపారు. ఎవరెస్ట్ పర్వత శ్రేణుల్లో గత 2వేల ఏళ్లలో ఏర్పడిన మంచు కేవలం 25ఏళ్లలోనే కరిగిపోయిందని చెబుతున్న శాస్త్రవేత్తలు టూరిస్ట్ స్పాట్గా మారిన ఎవరెస్ట్‌పై దాదాపు 12వేల కిలోల మానవ వ్యర్థాలు పోగై ఉన్నాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే…
బ్రిటన్‌లోని లీడ్స్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం.. 400 ఏళ్ల కిందటి పరిస్థితితో పోల్చితే గత కొన్ని దశాబ్దాల్లో హిమనీనదాలు 10 రెట్లు వేగంగా కరిగిపోయాయని తెలుస్తుంది. 2000 సంవత్సరం తర్వాత ఇది మరింత వేగంగా సాగుతోందని పరిశోధకులు తెలిపారు. నేపాల్ నుంచి భూటాన్ వరకూ విస్తరించి ఉన్న తూర్పు ప్రాంతాలవైపు మంచు కరుగుదల మరింత వేగంగా ఉందన్నారు. ఈ హిమనీనదాలు ఇప్పటి వరకూ తమ వాస్తవ పరిణామంలో 40 శాతం వరకూ కోల్పోయాయని పేర్కొన్నారు. వాటి విస్తీర్ణం 28,000 చ.కి.మీ నుంచీ 19,600 చ.కి.మీ కు తగ్గిందని వెల్లడించారు. హిమాలయాల్లో ఇప్పటివరకూ 390 నుంచి 580 చ.కి.మీ వరకూ మంచు కరిగిపోయినట్లు గుర్తించారు. దీనివల్ల సముద్ర మట్టం 0.03 నుంచీ 0.05 అంగుళాలకు పెరిగిందన్నారు.
ఐఐటీ ఇండోర్ పరిశోధన(2021)
హిమాలయన్ కరాకోరం ప్రాంతంలోని నదులపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఇండోర్ బృందం నిర్వహించిన పరిశోధనలో భయంకర నిజాలను బయటపడ్డాయి. వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో హిమానీనదాలు, మంచు కరిగిపోయి సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదులలో నీటి పరిమాణం, ప్రవాహం అధికంగా పెరిగి, ఆకస్మిక వరదలు ఏర్పడతాయని బృందం పేర్కొంది. హిమానీనదాలు, మంచు కరిగిపోవడంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు ఒక బిలియన్‌కు పైగా ప్రజలను ప్రభావితం చేస్తుందని, హిమాలయాల్లో అదే తీరుగా మంచు కరిగితే గంగా, సింధు లాంటి జీవనదులు పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉందన్నారు.
రెట్టింపు
ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల హిమాలయా పర్వతాల్లో హిమానీనదాలు కరిగిపోయే వేగం రెట్టింపైనట్లు 2019లో నిర్వహించిన ఒక అధ్యయనం చెబుతోంది. 21వ శతాబ్ది ఆరంభం నుంచి మరింత వేగంగా మంచు కరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్‌తో పాటు చైనా, నేపాల్, భూటాన్‌లకు సంబంధించిన 40 ఏళ్ల కాలం నాటి ఉపగ్రహ ఛాయాచిత్రాలను వారు విశ్లేషించారు. 2000 కి.మీ. పొడవున విస్తరించిన 650 మంచు చరియల చిత్రాలను వీరు క్షుణ్నంగా పరిశీలించారు.1975-2000 సంవత్సరాల మధ్య కరిగిన మంచు కంటే ఆ తర్వాత కరుగుతున్న పరిమాణం రెట్టింపు మేర ఉంది. భూగోళం వేడెక్కుతుండడంతో హిమాలయ ప్రాంతంలో మంచుకొండలు ఏటా 0.25 మీటర్ల మేర మంచును కోల్పోతున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఇది ఏటా 0.5 మీటర్లకు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 1975-2000 మధ్య కాలంతో పోలిస్తే 2000-2016 మధ్య సగటు ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ సెల్సియస్ మేర పెరిగినట్లు తెలుస్తుంది.
ఎందుకు కరుగుతున్నాయి…?
హిమాలయాలు.. పర్యావరణపరంగా చాలా సున్నితమైనవి. వాతావరణ మార్పులు, మానవ చర్యలు, పెరుగుతున్న భూతాపం వల్ల అక్కడ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దాదాపు 2 డిగ్రీల ఫారెన్‌హైట్ మేర పెరిగాయని, ఖాట్మాండులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్‌మెంట్ (ఐసీఐఎంవోడీ) అధ్యయనంలో తేలింది. వాతావరణ మార్పుల వల్ల కొన్ని దశాబ్దాలుగా రుతుపవనాలు బలహీనమవ్వడం కూడా ఒక కారణం తేల్చింది. దీంతో హిమానీనదాలపై మంచు పేరుకుపోవడం తగ్గిపోతోంది. శిలాజ ఇంధనాలు, వంటచెరకు వాడకం ద్వారా ఆసియా దేశాలు భారీ పరిమాణంలో ఆకాశంలోకి పొగ, మసి వదిలిపెడుతున్నాయని, దానిలో సింహభాగం మంచు ఉపరితలాలపై పడి.. సౌరశక్తిని శోషించుకుని, కరుగుదలకు కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి 50 శాతం మేర హిమానీనదాలు తరిగిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు
నష్టం ఏమిటి….?
అఫ్గానిస్థాన్ నుంచి మయన్మార్ వరకూ ఎనిమిది దేశాల్లో.. 3500 కిలోమీటర్ల మేర హిందుకుష్ హిమాలయాలు విస్తరించాయి. ధ్రువ ప్రాంతాలకు వెలుపల ప్రపంచంలోనే అత్యంత భారీగా మంచినీటి నిల్వలు హిమ రూపంలో ఇక్కడే ఉన్నాయి. హిమానీనదాలు 200 కోట్ల మందికి ప్రాణాధారం. తాగునీరు, సాగునీరు, విద్యుత్ అవసరాలను ఇవి తీరుస్తున్నాయి. దిగువ ప్రాంతాల్లోని కోట్ల మందికి ఇవి ప్రాణాధారంగా ఉన్నాయి. ఇక్కడి హిమానీ నదాలు.. గంగా, మెకాంగ్, యాంగ్జీ, బ్రహ్మపుత్ర సహా ఆసియాలోని పది అతిపెద్ద నదులకు నీటిని అందిస్తున్నాయి. ఇక్కడ 30వేల చదరపు మైళ్లకుపైగా హిమానీనద మంచు నిక్షిప్తమై ఉంది. హిమాలయాల్లోని హిందూకుష్ ప్రాంతంలో 50 వేలకు పైగా హిమానీనదాలు ఉన్నాయి. వాటిలో 30 హిమనీనదాలను మాత్రం నిశితంగా పరిశీలిస్తున్నారు. మన దేశంలోఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్‌లో దాదాపు 200కుపైగా ప్రధాన హిమానీ నదాలు ఉన్నాయి. ఎవరెస్ట్ శిఖరంపై మంచు ఇదే వేగంతో కరిగిపోతే పెను ప్రమాదం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గ్లేసియర్లు కరిగిపోవడం వల్ల హిమాలయ పాదాల వద్ద వందల సంఖ్యలో సరస్సులు ఏర్పడ్డాయి. మంచు ఇదే వేగంతో కరిగినట్లైతే ఆ సరస్సులు నిండిపోయి వరదలు తప్పవని అంటున్నారు. ప్రపంచంలోని 10 అతి ముఖ్యమైన నదులకు హిమాలయాలే ఆధారం, హిమాలయ మంచు కరిగిపోతే తొలుత వరదలు, తర్వాత కోట్లాది మందికి నీటి కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హిమానీనదాలు, మంచు ఫలకాలు నీటిని నిల్వ చేసే ట్యాంకుల్లాంటివి. దశాబ్దాలు, శతాబ్దాల కాలంలో సీజన్లవారీగా అవి మెల్లగా కరుగుతూ నీటిని నదుల్లోకి క్రమంగా వదులుతాయి. వాతావరణ మార్పులతో ఈ కరుగుదల వేగంగా సాగడం వల్ల సరస్సుల్లో, నదుల్లో నీరు ఎక్కువగా చేరుతోంది. మంచు అధికంగా కరగడం వల్ల హిమానీనదాలపై సరస్సులు ఎక్కువగా ఏర్పడతాయి. 1977 నుంచి నేపాల్ హిమాలయ ప్రాంతంలో గ్లేషియల్ సరస్సులు రెట్టింపు కావడం ఇందుకు నిదర్శనం. మంచు కరుగుదల విపరీతంగా ఉన్నప్పుడు ఈ సరస్సుల్లో నీటి మట్టం చాలా వేగంగా పెరిగిపోతుంటుంది. గట్టులా పనిచేసే పర్వతాకృతి వద్ద కూడా మంచు కరిగి, ఆ ప్రాంతం వదులుగా మారుతుంది. దీంతో ఆ గట్టులోని రాతిపెళ్లలను బద్దలుకొట్టుకుంటూ నీరు.. దిగువ ప్రాంతాలకు ఉరకలెత్తుతుంది. సరిగ్గా ఏడాది క్రితం 2021 ఫిబ్రవరి 6న ఉత్తరాఖండ్‌లో ఇదే జరిగింది.
ఉత్తరాఖండ్ అనుభవం
ఉత్తరాఖండ్‌లో సంభవించిన జల ప్రళయం వందలాదిమంది ప్రాణాల్ని బలితీసుకుంది. చమోలి జిల్లాలో ధౌలిగంగ నదిలో నీటి మట్టం హఠాత్తుగా పెరిగి వరద ప్రవాహం పోటెత్తింది. ఆ ప్రభావానికి రైనీ తపోవన్ దగ్గరున్న రుషిగంగ డ్యామ్ తెగిపోయింది. పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ కొట్టుకుపోవడంతో భారీగా వరద పోటెత్తి రైనీ గ్రామం దాదాపు జలసమాధి అయిపోయింది. నది తీరంలో ఉన్న ఇళ్లన్నీ ఈ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 170 మంది సిబ్బంది గల్లంతయ్యారు. నదుల్లో వరద నీటి ఉద్ధృతి కంటే హిమానీనదం ముక్కలైనప్పుడు ఉద్ధృతి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది.
హిమనీనదాలు కరిగినప్పుడు లేదా పలచబడినప్పుడు చాలా గ్లేసియర్స్ ప్రమాదకరంగా మారుతాయని, వాలుగా ఉండే పర్వతాల గోడలకు అంటుకుని ఉండే అవి ఎప్పుడైనా కూలిపోవచ్చని గతంలో వెల్లడైంది. 2016లో టిబెట్‌లోని అరూ పర్వతంపై ఒక గ్లేసియర్ హఠాత్తుగా కూలిపోయింది. దానివల్ల భారీగా మంచుచరియలు పడ్డాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మందితోపాటు వందలాది పశువులు చనిపోయాయి. తర్వాత కొన్ని నెలలకే అదే పర్వతంపై మరో గ్లేసియర్ హఠాత్తుగా కూలిపోయింది. 2012లో పాక్ పాలిత కశ్మీర్‌లోని సియాచిన్ గ్లేసియర్ దగ్గర జరిగిన ఒక ప్రమాదంలో దాదాపు 140 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్ సైనికులే ఉన్నారు. అమెరికా జియాలాజికల్ సర్వే శాటిలైట్ చిత్రాల ఆధారంగా చైనా సైన్స్ అకాడమీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో అందులో 2009 నుంచి 2018 మధ్య మొత్తం 127 కొండచరియలు పడినట్లు గుర్తించారు
చేయాల్సింది ఏమిటి…?
గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించాలి. ఇదే ప్రధాన పరిష్కార మార్గంగా చెబుతున్నారు. పవన, సౌర, సముద్ర తరంగాలు వంటి పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను శోషించుకునేందుకు అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి. 2005 నాటి స్థాయితో పోలిస్తే గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 35 శాతం మేర తగ్గించుకుంటామని భారత్ ఇప్పటికే హామీ ఇచ్చింది. దీన్ని సాధించేందుకు మెరుగ్గా చర్యలు చేపట్టాలి. హిమాలయ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంలో సంప్రదాయ కలప, రాతి కట్టడాలకు బదులు రీఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీటును ఉపయోగించాలి. అదే రీతిలో హిమాలయ ప్రాంతంలో సంభవించే విపత్తులను పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేయడానికి ఒక హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్న నిపుణులు. ఎంచుకున్న హిమానీనదాలపై పూర్తిగా ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను, పరిశీలన నెట్‌వర్క్‌లను విస్తరించడం ద్వారా హిమానీనదాలపై మెరుగైన పర్యవేక్షణను చేయాలని ఐఐటీ ఇండోర్ బృందం ప్రతిపాదించింది.
“ప్రస్తుతం ఉన్న గ్లేసియర్లపై కచ్చితంగా మరింత అధ్యయనాలను జరపాలి. హిమాలయాల్లో సరిహద్దులను పంచుకుంటున్న ప్రధాన దేశాల మధ్య సఖ్యత లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. సరిహద్దులు దాటి గ్లేసియర్ల గురించి ఈ దేశాలు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే గ్లేసియర్లు కరగడం వల్ల వచ్చే ప్రమాదాలపై మనం విస్తృత నిఘా పెట్టగలుగుతాం. ఆ ప్రమాదాలను ఎదుర్కోడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోగలం” అని నిపుణులు చెబతున్నారు.
Read Also..UP Assembly Elections 2022: యూపీ ఓటర్లు ఎవరి వైపు..? టీవీ9 భారత్‌వర్ష్ ఒపీనియన్ పోల్ ఏం చెబుతోంది?