ప్రజలు ప్రశ్నించడాన్ని మరిచిపోయారా..పాలకులు పట్టించుకోవడం మానేశారా..

అప్పుడెప్పుడో పెట్రోల్, డీజిల్ ధరలు 50 పైసలు పెరిగితే, దేశ మంతా పెద్ద ఎత్తుల ఆందోళనలు. విశేష జనాదరణ కల్గిన ఎన్టీఆర్ లాంటి నాయకుడు సైతం జాతీయ రహదారి మీద...

  • Balu
  • Publish Date - 11:26 am, Thu, 25 February 21
ప్రజలు ప్రశ్నించడాన్ని మరిచిపోయారా..పాలకులు పట్టించుకోవడం మానేశారా..
Petrol Diesel Prcie

అప్పుడెప్పుడో పెట్రోల్, డీజిల్ ధరలు 50 పైసలు పెరిగితే, దేశ మంతా పెద్ద ఎత్తుల ఆందోళనలు. విశేష జనాదరణ కల్గిన ఎన్టీఆర్ లాంటి నాయకుడు సైతం జాతీయ రహదారి మీద విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ముందు ధర్నాకు కూర్చున్నారు. వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ దిష్టి బొమ్మల దహనాలు, జాతీయ రహదారుల దిగ్భందనాలు లాంటి కార్యక్రమాలతో దేశం మొత్తం ఆందోళనలతో ఊగిపోయింది. చివరికి కేంద్రం కాస్త మెత్తపడాల్సి వచ్చింది. చాలా మందికి గుర్తుండే ఉంటుంది.. అప్పట్లో ఆయిల్ పుల్ అకౌంట్ అనే ఒక వ్యవస్ధ ఉండేది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర తగ్గినా పెరిగినా దాని ప్రభావం నేరుగా ప్రజల మీద పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ అకౌంట్ ని మెయిటెన్ చేసేది. ఆ వ్యవస్ధని యి.పి.ఎ. హయాంలోనే ఎత్తేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలకు అనుగుణంగా ఆయిల్ కంపెనీలు రేట్ల పెంచుకోవడం, తగ్గించుకోవడం చేసుకోవచ్చని కేంద్రం అవకాశం కల్పించింది. అప్పటి నుంచే మొదలైంది కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకోవడం. కానీ, కంపెనీలతోపాటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకుంటూ పోతున్న టాక్స్ ల మాటేంటి. వాటిని ప్రభుత్వాలే అదుపు చేయవచ్చు కదా?.. అంటే వాటి గురించి మాత్రం అధికారంలో ఉన్న పెద్దలు నోరు తెరవరు. 2014లో యి,పి.ఎ. హయాంలో 79రూపాయల 80 పైసలు ఉన్న పెట్రోల్ ధర పెరిగి పెరిగి ఇప్పుడు 94రూపాయల 69 పైసలకు చేరుకుంది. ఇందులో కేంద్రం విధించే పన్ను 32 రూపాయలు రాష్ట్రం విధించే పన్నులు 19 రూపాయలు, డీలర్ కమీషన్ కింద మరో మూడున్నర రూపాయలు ఉంది. బేస్ ప్రైస్ తగ్గినా పన్నుల మోత వల్ల సామాన్యుడి నడ్డి విరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. రోజుకి కొన్ని పైసల చొప్పున పెంచుకుంటూ పోయిన ఆయిల్ కంపెనీలు, వాటితో సమానంగా తమ టాక్స్ లను కూడా పెంచుకుంటూపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. సామాన్యుడి నుంచి జలగల్లా వారికి తెలియకుండానే రక్తాన్ని పీల్చడం కొనసాగిస్తూనే ఉన్నాయి.

ఇంత జరుగుతున్నా సామాన్యుడు ప్రశ్నించడమే మానేశాడు. ప్రశ్నించే ప్రజా సంఘాలు ఎప్పుడో ఉద్యమాలు ఆపేసి, బూర్జువా పార్టీలతో చెట్టపట్టాలు వేసుకుని ఎన్నికల్లో సీట్లు ఎలా పెంచుకోవాలా అన్న విషయం మీద మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రజలు తిరగబడడం, ప్రశ్నించడం ఎందుకు మానేశారు? ప్రశ్నించినా ప్రయోజం లేదనా?..లేక ప్రశ్నించే హక్కు మనం కోల్పోయామన్న నిర్ణయానికి రావడం వల్లనా? ఐదేళ్ళ కొకసారి వచ్చే ఓట్ల పండగలో లీడర్ల నుంచి డబ్బులు తీసుకుని ఓట్లు వేసే ప్రజలు, ఐదేళ్ళ పాటు ఆ నాయకుడికి మనం అమ్ముడు పోయామన్న భావనకి వచ్చేస్తున్నాడా..లేక ఐదేళ్ళ పాటు అధికారాన్ని నేను కొనుక్కున్నా కాబట్టి ఈ ఐదేళ్ళు నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని పాలకులకి కల్గిన అహంకార భావనా..అంటే ఇవన్నీ నిజాలే అనిపిస్తున్నాయి..ఇదే పరిస్ధితి కొనసాగితే రేపటి రోజున ప్రభుత్వాలు ఎన్ని అరాచకాలు చేసినా, సామాన్యుడు మనల్ని ప్రశ్నించడులే అన్న ధీమా మరింత పెరిగిపోవడం ఖాయం. కానీ, మొత్తం ఈ వ్యవహారంలో ఒక పాజిటివ్ ఎలిమెంట్ ఏంటంటే, వంద రూపాయలకు చేరువై పోయిన పెట్రోలు ధరల్ని తగ్గించమని ప్రభుత్వాన్ని నిలదీయడం కన్నా, ఆ వంద రూపాయలు ఎలా సంపాందించాలి..(అది అక్రమమైనా, సక్రమమైనా) అన్న ధోరణిలో ప్రజలు ఆలోచిస్తుండడం…దీన్ని పాజిటివ్ దృక్పధం అనుకోవాలా లేక మరేమనుకోవాలో సామాన్యుడే ఆలోచించుకోవాలి..
~ మురళీ కృష్ణ .ఎం

మరిన్ని చదవండి ఇక్కడ :

 

Fight With Cheetah video :కుటుంబం కోసం చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. వైరల్ అవుతున్న వీడియో

భాగ్యనగర వాసులను హడలెత్తించిన వీడియో.. బాలానగర్ ఫ్లైఓవర్ కుప్పకూలిందా..?:Balanagar flyover mishap viral video