ఆ 38 మందికి ఉరి.. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు
2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు విధించిన ఉరిశిక్షను గుజరాత్ హైకోర్టు సమర్థించింది. మరో 11 మందికి విధించిన జీవిత ఖైదును కూడా యథాతథంగా కొనసాగిస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఉగ్రదాడిలో మరణించిన బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

భారతదేశ న్యాయ చరిత్రలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 2008లో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ఉరిశిక్ష విధించింది. 2022లో ప్రత్యేక ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షలను ఉన్నత హైకోర్టు సమర్థించింది. ఒకే కేసులో ఇంత పెద్ద సంఖ్యలో నిందితులకు ఉరిశిక్ష ఖరారు కావడం భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఇది మొదటిసారి. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లను, అలాగే మరణశిక్షల ఖరారు పిటిషన్లను గుజరాత్ హైకోర్టు సమగ్రంగా విశ్లేషించింది. డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు, నిందితుల కాల్ డేటా రికార్డులను పరిశీలించిన తర్వాత.. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్ధమైనదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దోషులకు శిక్షల ఖరారుతో పాటు, ఉగ్రదాడిలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాల పట్ల న్యాయస్థానం మానవీయ కోణంలో స్పందించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి కూడా తగిన ఆర్థిక సహాయం అందించాలని పేర్కొంది.
కేసు నేపథ్యం
2008 జూలై 26వ తేదీన అహ్మదాబాద్ నగరం కేవలం 70 నిమిషాల వ్యవధిలో 21 వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ భీకర ఉగ్రదాడిలో 56 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రజలు రద్దీగా ఉండే మార్కెట్లు, బస్సు స్టాండ్లు, చివరకు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న సివిల్ ఆసుపత్రి ప్రాంగణాన్ని కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ఇండియన్ ముజాహిదీన్ (IM), నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (SIMI) సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. 2002 గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగానే ఈ దాడులు ప్లాన్ చేసినట్లు నిరూపితమైంది. ఈ కేసులో గుజరాత్ పోలీసులు, ప్రత్యేక విచారణ బృందాలు (SIT) దేశవ్యాప్తంగా విస్తరించిన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదించాయి.
2022లోనే ప్రత్యేక కోర్టు తీర్పు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ, 1,100 మందికి పైగా సాక్షుల విచారించిన అనంతరం ప్రత్యేక సిబిఐ కోర్టు 49 మందిని దోషులుగా తేల్చింది. అందులో 38 మందికి ఉరిశిక్ష మరో 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. తాజాగా హైకోర్టు సైతం హైకోర్టు తీర్పును సమర్ధించడంతో దోషులకు మరోసారి ఉరిశిక్ష ఖరారైంది. హైకోర్టు తీర్పు అమలు అవుతుందా లేక దోషులు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆశ్రయిస్తారా..? ఈ కేసులో ఇంకా ఏం జరగబోతుంది.. అనేది వేచిచూడాల్సిందే..
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
