AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొసగాళ్లకే మొసగాళ్లు..! మీ మొబైల్‌కు వచ్చే స్కామ్ కాల్ వెనుక ఎవరున్నారో తెలుసా..?

మీ మొబైల్‌కు వచ్చే ప్రతి స్కామ్‌ కాల్‌ వెనుక ఒక్క వ్యక్తే ఉండరు.. కాల్‌ సెంటర్‌ నుంచి నకిలీ సిమ్‌లు, బ్యాంకు ఖాతాలు, మనీ మ్యూల్‌ నెట్‌వర్క్‌ వరకు పెద్ద సైబర్‌ నేర వ్యవస్థ పనిచేస్తుంటుంది. డిజిటల్‌ అరెస్ట్‌, KYC, బ్యాంక్‌, పెట్టుబడి మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి? మోసం జరిగితే వెంటనే ఏం చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.

మొసగాళ్లకే మొసగాళ్లు..! మీ మొబైల్‌కు వచ్చే స్కామ్ కాల్ వెనుక ఎవరున్నారో తెలుసా..?
Cyber Scam Calls
Siva Nagaraju
| Edited By: |

Updated on: Aug 16, 2026 | 10:43 AM

Share

సైబర్ మోసగాడు మీ బ్యాంక్ ఖాతాను ముందుగా హ్యాక్ చేయడు. మీ ఆలోచించే సమయాన్ని హ్యాక్ చేస్తాడు. మీ KYC నిలిచిపోయింది. మీ పేరుతో పార్సెల్‌లో డ్రగ్స్ దొరికాయి. మీ బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి. మీపై కేసు నమోదైందని వచ్చే ఫోన్ కాల్ ఇప్పుడు చాలామందికి తెలుసు. అవతలి వ్యక్తి పోలీస్, బ్యాంక్ అధికారి, CBI, ED, RBI లేదా టెలికాం అధికారి పేరుతో మాట్లాడతాడు. మాటల్లో అధికార ధోరణి, వెనుక భయం. చివరికి బాధితుడి ఖాతా నుంచి లక్షలు, కోట్ల రూపాయలు మాయమవుతాయి. అసలు విషయం ఏమిటంటే, ఈ ఫోన్ కాల్ వెనుక ఒక్క వ్యక్తి ఉండకపోవచ్చు. కాల్ సెంటర్‌లో మాట్లాడేవాడు ఒకరు. నకిలీ సిమ్ అందించేవాడు మరొకరు. బ్యాంకు ఖాతాలు సమకూర్చేవాడు ఇంకొకరు, డబ్బును ఇతర ఖాతాలకు తరలించేవాడు. ఇలా సైబర్ మోసం ఒక వ్యవస్థీకృత నేర నెట్‌వర్క్‌గా మారింది.

లెక్కలు ఏం చెబుతున్నాయి…

భారతదేశంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. I4C, National Cyber Crime Reporting Portal గణాంకాల ప్రకారం 2021 నుంచి 2025 వరకు 65.89 లక్షలకు పైగా ఆర్థిక సైబర్ మోసాల ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రజలకు వచ్చిన నష్టం రూ.55,000 కోట్లకు పైగా ఉంది. 2021లో నమోదైన ఫిర్యాదులు 2.62 లక్షలు కాగా, 2025 నాటికి అవి 24 లక్షలకు పైగా పెరిగాయి. అంటే ఐదేళ్లలో సైబర్ ఆర్థిక మోసాల ఫిర్యాదులు దాదాపు తొమ్మిది రెట్లు పెరిగాయి.

ఈ గణాంకాలు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. సైబర్ నేరం ఇక కంప్యూటర్ తెలిసిన కొద్దిమంది చేసే నేరం కాదు. మొబైల్ ఉన్న ప్రతి వ్యక్తి ఇప్పుడు లక్ష్యంగానే ఉన్నారనేది నిజం.

మోసగాళ్ల మొదటి ఆయుధం టెక్నాలజీ కాదు.. ఎదుటి వారి మనస్తత్వం. ముందుగా బాధితుడి నమ్మకాన్ని సంపాదిస్తారు. ఆ తర్వాత భయం లేదా అత్యాశను కలిగిస్తారు. ఇప్పుడే డబ్బు పంపాలి. ఐదు నిమిషాల్లో verification పూర్తి చేయాలి. లేకపోతే అరెస్టు చేస్తామని చెప్పి మీకు ఆలోచించే సమయం ఇవ్వరు. మనిషి ప్రశాంతంగా ఆలోచించే సమయాన్ని కోల్పోయిన క్షణమే మోసగాడికి అవకాశం ఉంటోంది.

డిజిటల్ అరెస్ట్…

ఇటీవలి కాలంలో అత్యంత భయంకరమైన మోసంగా మారింది డిజిటల్ అరెస్ట్. పోలీస్ యూనిఫామ్, నకిలీ ID కార్డులు, వీడియో కాల్, నకిలీ FIRలు చూపిస్తూ బాధితుడిని గంటల తరబడి భయపెడతారు. మీ పేరుతో మనీలాండరింగ్ జరిగిందని.. మీ బ్యాంకు ఖాతా ఉగ్రవాద నిధులకు ఉపయోగించారని.. చివరకు విచారణ పూర్తయ్యే వరకు డబ్బును ఒక సురక్షిత ఖాతాలో ఉంచాలని చెబుతారు. బాధితుడు తనే డబ్బును మోసగాళ్ల ఖాతాకు బదిలీ చేస్తాడు. కానీ ఒక విషయం ప్రజలు గుర్తుంచుకోవాలి. భారత చట్టాల్లో “Digital Arrest” అనే విధానం లేదు.

మరోవైపు పెట్టుబడి మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. WhatsApp, Telegram గ్రూపుల్లో నకిలీ స్టాక్ మార్కెట్ నిపుణులు, నకిలీ యాప్‌లు, భారీ లాభాల స్క్రీన్‌షాట్లు చూపిస్తారు. మొదట చిన్న మొత్తానికి లాభం చూపించి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిస్తారు. చివరికి డబ్బు తీసుకోవాలంటే ట్యాక్స్, పెనాల్టీ, విత్‌డ్రా ఫీజు అని మరింత డబ్బు అడుగుతారు.

అలాగే బ్యాంకు KYC, కస్టమర్ కేర్, ఉద్యోగం, లోన్, కొరియర్, విద్యుత్ బిల్లు, UPI రిఫండ్ పేర్లతో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఒకే పద్ధతి మాత్రం అన్నింటిలో కనిపిస్తుంది. ముందుగా నమ్మకం, తర్వాత భయం లేదా ఆశ, చివరికి డబ్బు బదిలీ అవుతోంది.

మనీ మ్యూల్ నెట్‌ వర్క్‌..

డబ్బు మోసగాడి చేతికి వెళ్లిన తర్వాత మరో పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తుంది.దీన్నే మనీ మ్యూల్ నెట్‌వర్క్ అంటారు. ఇతరుల పేర్లతో తెరిచిన లేదా అద్దెకు తీసుకున్న బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వస్తుంది. అక్కడి నుంచి మరో ఖాతాకు, అక్కడి నుంచి ఇంకొక ఖాతాకు తరలిస్తారు. ఇలా అనేక పొరలు దాటిన తర్వాత అసలు నేరస్థుడిని గుర్తించడం పోలీసులకు కష్టమవుతుంది. కొన్ని కేసుల్లో వేలాది బ్యాంకు ఖాతాలు ఒకే మోసపు నెట్‌వర్క్‌కు అనుసంధానమయ్యాయని దర్యాప్తులో బయటపడింది.

అయితే పోలీసులు, కేంద్ర సంస్థలు కూడా ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. I4C యొక్క CFCFRMS వ్యవస్థ ద్వారా ఆర్థిక మోసం జరిగిన వెంటనే బ్యాంకులు, చెల్లింపు సంస్థలు, పోలీసులు సమన్వయంతో స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. 2026 జూన్ నాటికి ఈ వ్యవస్థ ద్వారా రూ. 11,158 కోట్లకు పైగా మోసపూరిత నిధులను కాపాడామని కేంద్రం చెప్పింది. అయితే ఇది మొత్తం బాధితులకు తిరిగి ఇచ్చిన డబ్బు కాదు. మోసగాళ్లకు పూర్తిగా వెళ్లకముందే నిలిపివేసిన లేదా రక్షించిన మొత్తాన్ని కూడా ఇందులో కలుపుతారు.

ఏం చేయాలి…

అలాగే I4C యొక్క Suspect Registry ద్వారా అనుమానాస్పద మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఇతర గుర్తింపులను బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పంచుకుంటున్నారు. 2026 నాటికి లక్షలాది అనుమానాస్పద మ్యూల్ అకౌంట్స్‌ను గుర్తించామని కేంద్రం తెలిపింది. మరోవైపు టెలికాం శాఖ Sanchar Saathi–Chakshu ద్వారా అనుమానాస్పద కాల్స్, SMSలను రిపోర్ట్ చేసే అవకాశం కల్పించింది. నకిలీ పత్రాలతో తీసుకున్న సిమ్‌లను గుర్తించి పెద్ద సంఖ్యలో మొబైల్ కనెక్షన్లను కూడా డిస్‌కనెక్ట్ చేస్తున్నారు.

అయితే పోలీసుల చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధం కన్నా ప్రజల చేతిలో ఉన్న చిన్న జాగ్రత్తే ఎక్కువ ప్రభావం చూపుతుంది. OTP, UPI PIN, ATM PIN, CVV, పాస్‌వర్డ్ ఎవరితోనూ చెప్పకూడదు. డబ్బు పొందడానికి UPI PIN అవసరం ఉండదు. తెలియని వ్యక్తి పంపిన APK లేదా రిమోట్ యాక్సెస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయకూడదు. తెలియని QR కోడ్ స్కాన్ చేయకూడదు. Googleలో కనిపించిన customer-care నంబర్‌ను నమ్మకుండా సంబంధిత సంస్థ అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఉన్న నంబర్‌కే కాల్ చేయాలి.

ముఖ్యంగా, ఇప్పుడే చేయాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే అక్కడే ఆగాలి. నిజమైన బ్యాంకు అధికారి, నిజమైన పోలీసు అధికారి, నిజమైన ప్రభుత్వ సంస్థ మీపై ఒత్తిడి తెచ్చి ఫోన్‌లోనే డబ్బు బదిలీ చేయమని అడిగే వీలుండదని గుర్తించాలి.

చెప్పకపోతే ఎలా…

మోసం జరిగిన తర్వాత చాలామంది సిగ్గుతో ఎవరితోనూ చెప్పకుండా ఆలస్యం చేస్తారు. అదే పెద్ద ప్రమాదం. డబ్బు పోయిందని తెలిసిన వెంటనే 1930కు ఫోన్ చేయాలి. అలాగే National Cyber Crime Reporting Portalలో ఫిర్యాదు చేయాలి. బ్యాంకు లావాదేవీ వివరాలు, transaction ID, ఫోన్ నంబర్లు, మెసేజ్‌లు, screenshots వంటి ఆధారాలను భద్రపరచాలి. మొదటి కొన్ని నిమిషాలు, గంటల్లో చర్య తీసుకుంటే డబ్బును నిలిపివేసే అవకాశం ఎక్కువగా ఉంటోంది.

సైబర్ మోసాల కథలో మనం ఎక్కువగా టెక్నాలజీ గురించి మాట్లాడుతాం. కానీ అసలు బలహీనత టెక్నాలజీలో కాదు. మనిషి తొందరలో ఉంది. మోసగాడికి మన OTP కంటే ముందుగా కావాల్సింది మన భయం. మన PIN కంటే ముందుగా కావాల్సింది మన నమ్మకం. మన బ్యాంకు ఖాతా కంటే ముందుగా కావాల్సింది మన ఆలోచించే సమయం.

అందుకే సైబర్ మోసాల నుంచి రక్షణకు మొదటి పాస్‌వర్డ్ ఏంటంటే ఒక్క నిమిషం ఆగు అనే ఆలోచన. మోసగాడు మీ డబ్బును దొంగిలించే ముందు, మీకు ఆలోచించే సమయం లేకుండా చేస్తాడు. ఆ ఒక్క నిమిషాన్ని మీరు కాపాడుకుంటే మీ జీవిత పొదుపు కూడా కాపాడినట్లు అవుతోంది.

చివరిగా.. స్కామ్ కాల్ వస్తే భయపడకండి. అనుమానం వస్తే కాల్ కట్ చేయండి. డబ్బు పోతే ఆలస్యం చేయవద్దు..1930కి వెంటనే కాల్ చేయాలి..

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us