Power Cut to Police Station: మాస్క్ ధరించలేదని ఫైన్ వేసిన పోలీస్.. గంటలోపే ఊహించని షాక్ ఇచ్చిన విద్యుత్ ఉద్యోగులు..
Corona Effect: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
Corona Effect: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. మరోవైపు ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. 2020 నాటి పరిస్థితులు పునరావృతం కారాదని అధికారులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా ప్రజలను సైతం అప్రమత్తం చేస్తున్నారు. మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశిస్తున్నారు. ప్రజల సూచనలను తప్పక పాటించాల్సిందే అని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు.. కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించని వారిపై ఫైన్‌లు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ నోయిడాలో అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే.. విద్యుత్ శాఖ ఉద్యోగులు ఊహించని షాక్ ఇచ్చారు. మాకే ఫైన్ వేస్తారా? అంటూ రెచ్చిపోయారు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
నోయిడాలోని రబుపుర పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. మాస్క్ ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఆ సమయంలో కొందరు విద్యుత్ శాఖ ఉద్యోగులు అటుగా వచ్చారు. వారికి మాస్క్ లేకపోవడంతో పోలీసులు వారికి ఫైన్ విధించారు. ఈ చర్యను తీవ్రంగా భావించిన విద్యుత్ అధికారులు.. తమకే ఫైన్ వేస్తారా? అంటూ ఊగిపోయారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. తమకు ఫైన్ విధించిన పోలీస్ అధికారులకు సంబంధించిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. ఆ స్టేషన్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా అయ్యే వైర్‌ను కట్ చేశారు. ఫేస్ మాస్క్ ఉన్నప్పటికీ పోలీసులు కావాలనే తమకు ఫైన్ విధించారని విద్యుత్ ఉద్యోగులు ఆరోపించారు. రబుపుర పోలీస్ స్టేషన్ లక్ష రూపాయల విద్యుత్ బిల్లు బకాయి ఉందని, అందుకే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నామని విద్యుత్ అధికారులు ప్రకటించారు. వీరి చర్యతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గంటల తరబడి అక్కడ రభస చోటు చేసుకోగా.. చివరికి ఉన్నతాధికారులు కల్పించుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
Also read:
Myanmar Violence: మయన్మార్‌లో ఆగని మారణహోమం.. 24 గంటల్లో వందమందికిపైగా హతం!