Singareni: అంతా నిబంధనల ప్రకారమే.. తెలంగాణ సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై కేంద్ర సర్కార్ కీలక ప్రకటన
తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సమీపంలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాకులను వేలంపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. బొగ్గు గనుల ప్రవేటీకరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం సమర్థించారు.
Singareni coal block allocation: తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సమీపంలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాకులను వేలంపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. బొగ్గు గనుల ప్రవేటీకరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం సమర్థించారు. ఇది పాలసీ ప్రకారమే జరుగుతోందని అన్నారు. SCCL అనేది 51:49 ఈక్విటీ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా యాజమాన్యంలోని ప్రభుత్వ బొగ్గు గనుల సంస్థ. జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ సభ్యుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)తో కలిసి నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. దీనిపై మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు.
తెలంగాణ పరిధిలోని సత్తుపల్లి, కొత్తగూడెం, శ్రావణపల్లి, కళ్యాణ్‌ఖనిలోని నాలుగు బ్లాక్‌లను వేలం వేయాలని నిర్ణయించింది కేంద్రం. తెలంగాణలోని బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. మూడు రోజుల పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. అయినా ముందుకే వెళ్తామని స్పష్టం చేసింది కేంద్రం. వేలం ప్రక్రియ మొదలైందని పార్లమెంట్ వేదికగా వెల్లడించారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి. నిబంధనల ప్రకారమే వేలం ఉంటుందని స్పష్టం చేశారాయన. “ఇప్పుడు వేలం పాలన మొదలైంది. రాష్ట్రాలకు కేటాయింపుల కోసం కూడా.. దరఖాస్తులను ఆహ్వానించే నోటీసు పూర్తయింది. ఏకపక్షంగా మేం చేయడం లేదు” అని జోషి అన్నారు.
లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు ప్రహ్లాద్‌జోషి. సింగరేణి కాలరీస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా కేంద్రానికి వాటాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకుల వేలంపై ఇటీవల ప్రకటన విడుదల చేసింది కేంద్రం. ఈ వేలం ప్రకటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణాకు ఈ ప్రకటన షాక్ ఇచ్చింది. బొగ్గు బ్లాకుల వేలంలో ఇప్పటికే సింగరేణిలో బొగ్గు లభ్యతపై అన్వేషణ సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం బ్లాక్ 3, ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్ 3, మంచిర్యాల జిల్లా కళ్యాణఖని బ్లాక్ 6, శ్రావణ పల్లిలోని ఓ బ్లాక్‌ను వేలం వేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఇష్యూ తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపింది.
ప్రస్తుతం 50,000 మంది SCCL కార్మికులు సమ్మెలో ఉన్నారని, దీనివల్ల రోజుకు 120 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను కంపెనీ తీరుస్తుందని ఉత్తమ్ తెలిపారు. దురదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రాయోజిత సమ్మె అని బొగ్గు శాఖ మంత్రి ఆరోపించారు. సభ్యుడు చేసిన ప్రకటన వాస్తవం కాదని, ఇది వాస్తవానికి దూరంగా ఉందని జోషి ఖండించారు.
Read Also… Nagarjuna : వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటామన్న కింగ్ నాగార్జున..