AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 మందితో ‘జమిలి ఎన్నికల’ కమిటీ.. ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి కోవింద్‌.. సభ్యులుగా అమిత్ షా, అధిర్ రంజన్, అజాద్..

Jamili Elections: దేశంలో ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌’ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అప్రమత్తమైన రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికలపై దృష్టి సారించాయి. ఇదిలా ఉండగానే మరోవైపు జమిలి ఎన్నికల కమిటీపై ఏర్పాటైంది. 8 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చైర్మన్‌గా ఉండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్‌ సహా పలువురు ఉన్నారు. 

8 మందితో ‘జమిలి ఎన్నికల’ కమిటీ.. ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి కోవింద్‌.. సభ్యులుగా అమిత్ షా, అధిర్ రంజన్, అజాద్..
Jamili Election Committee
శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 03, 2023 | 6:50 AM

Share

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌’ దిశగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల కమిటీపై న్యాయశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలోని విపక్ష నేత-కాంగ్రెస్ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీ ఈ జమిలి ఎన్నికల కమిటీలో సభ్యులుగా చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్‌ చంద్రకు బాధ్యతలు అప్పగించింది. కమిటీ తక్షణమే పని ప్రారంభించాలని న్యాయశాఖ ఆదేశించింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరింది.

ఇదిలా ఉండగా జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉందని అధికారులు చెప్పారు. ‘‘పార్లమెంటు సభల కాల వ్యవధికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 83, లోక్‌‌‌‌సభను రాష్ట్రపతి రద్దు చేయడానికి సంబంధించిన ఆర్టికల్‌‌‌‌ 85, రాష్ట్రాల శాసన సభల కాలవ్యవధికి సంబంధించిన ఆర్టికల్ 172, రాష్ట్రాల అసెంబ్లీల రద్దుకు సంబంధించిన ఆర్టికల్ 174, అలాగే రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించిన 356వ ఆర్టికల్ సవరణ చేయాల్సి ఉంటుంద’ని వివరించారు. ఎందుకంటే పలు కీలకమైన రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.

1967 వరకు లోక్‌‌‌‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. కానీ, ఆపై కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దుకావడం, 1970లో ఏడాది ముందే లోక్‌‌‌‌సభ రద్దు కావడంతో జమిలి ఎన్నికలను కొనసాగించడం సాధ్యం కాలేదు. 1983 నాటి ఎన్నికల కమిషన్‌‌‌‌ మరోసారి జమిలీ ఎన్నికల ప్రతిపాదనను తెచ్చినా అది ఆచరణలోకి మాత్రం రాలేదు. ఆ తర్వాత 2016లో ప్రధాని మోదీ జమిలి ఆలోచనను ప్రతిపాదించారు. 2019లో ఈ అంశంపై ప్రధాని వివిధ పార్టీలకు చెందిన నేతలతో సమావేశం ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్‌‌‌‌ సహా చాలా పార్టీలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలి ఉమ్మడి పార్లమెంటు సెషన్‌‌‌‌లోనూ అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌’ అత్యవసరమని, ఇది అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి మొగ్గుచూపడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశం చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీలన్నీ జమిలిపై దృష్టిసారించాయి. ప్రభుత్వం ఇందుకు మొగ్గుచూపినా లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా సమస్యలు అధిగమించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి