AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HIGH COURT OF BOMBAY: ఆరేళ్ల శిక్ష తర్వాత నిర్దోషులుగా తేల్చిన కోర్టు.. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబాకు భారీ ఊరట..

సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని కూడా ఈ కేసులో న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. మరేదైనా కేసులో వీరు నిందితులుగా ఉంటే మినహా.. వాళ్లందర్నీ తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టులతో..

HIGH COURT OF BOMBAY: ఆరేళ్ల శిక్ష తర్వాత నిర్దోషులుగా తేల్చిన కోర్టు.. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబాకు భారీ ఊరట..
Prof G.N.Saibaba (File Photo)
Amarnadh Daneti
|

Updated on: Oct 14, 2022 | 12:48 PM

Share

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబాను గతంలో సెషన్స్‌ కోర్టు దోషిగా తేలుస్తూ జీవితఖైదు విధించగా, ఆయనను ఆ కేసులో నిర్దోషిగా తేలుస్తూ బాంబే (నాగపూర్ బెంచ్) హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో నాగ్‌పుర్‌ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ఆచార్యులు జి.ఎన్‌. సాయిబాబాకు భారీ ఊరట లభించింది. సాయిబాబ నిర్దోషి అని.. వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది బాంబే హైకోర్ట్‌ (నాగపూర్ బెంచ్). సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని కూడా ఈ కేసులో న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. మరేదైనా కేసులో వీరు నిందితులుగా ఉంటే మినహా.. వాళ్లందర్నీ తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 2014 మే నెలలో సాయిబాబా, ఓ జర్నలిస్టు, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్ యు) విద్యార్థి సహా మరికొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 2017 మార్చిలో సెషన్స్‌ కోర్టు వీరికి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి వీరు నాగ్‌పుర్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. జీవితఖైదును సవాల్‌ చేస్తూ సాయిబాబా సహా మిగతా దోషులు బాంబే హైకోర్టులో అప్పీల్‌ చేసుకున్నారు.

ఈ అప్పీళ్లపై హైకోర్టు నాగ్‌పుర్‌ బెంచ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. వీరందరినీ నిర్దోషులుగా తేల్చుతూ కీలక తీర్పు వెలువరించింది. 2014లో సాయిబాబా అరెస్టు నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ ఆయనను సస్పెండ్‌ చేసింది. గతేడాది ఆయనను పూర్తిగా విధుల నుంచి తొలగించింది. మరి ఇప్పుడు సాయిబాబా నిర్దోషిగా తేలిన నేపథ్యంలో మళ్లీ ఆయన్ను విధుల్లోకి తీసుకుంటారా లేదా అన్నది తెలియల్సి ఉంది.

మావోయిస్టులతో సంబంధాలున్నాయని, కొంతమందితో కలిసి కుట్రలకు ప్లాన్ చేశారనే అభియోగాలతో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను పోలీసులు అరెస్టు చేయగా అప్పట్లో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జైలులో ఉన్న సమయంలో సాయిబాబ ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడినట్లువ వార్తలు వచ్చాయి. అయితే సాయిబాబుకు మావోయిస్టులతో కలిసి ఎటువంటి కుట్రలకు పాల్పడలేదని వామపక్ష పార్టీలు, వామ పక్ష అనుబంధ ప్రజాసంఘాలు చెబుతూ వచ్చాయి. అయినా సాయిబాబ కుట్రలకు పాల్పడ్డారనేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసులు చెబుతూ వచ్చారు. ఆ సాక్ష్యాదారాలను విశ్వసించిన సెషన్స్ కోర్టు సాయిబాబను దోషిగా తేల్చింది. అయితే బాంబే హైకోర్టు (నాగపూర్ బెంచ్) మాత్రం ఈ కేసులో సాయిబాబ నిర్దోషి అని పేర్కొంది. మరి ఈ కేసులో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది. సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్తుందా లేదా అనే దానిపై స్పష్టత రావల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..