Lok Sabha Polls 2024: బీజేపీ సరికొత్త వ్యూహం.. లోక్‌సభ ఎన్నికల బరిలో నిర్మలా సీతారామన్, జైశంకర్..!

రానున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి నెలలో ప్రకటించనుంది. వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 100 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ నెల 29న (గురువారం) విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Lok Sabha Polls 2024: బీజేపీ సరికొత్త వ్యూహం.. లోక్‌సభ ఎన్నికల బరిలో నిర్మలా సీతారామన్, జైశంకర్..!
Jaishankar, Nirmala Sitharaman
Follow us
Janardhan Veluru

|

Updated on: Feb 27, 2024 | 1:21 PM

రానున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి నెలలో ప్రకటించనుంది. వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 100 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ నెల 29న (గురువారం) విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర పేర్లు ఉండే అవకాశముంది. తొలి జాబితాలో ఇంకా ఎవరెవరికి చోటు దక్కనుందన్న అంశం బీజేపీ వర్గాల్లోనూ ఆసక్తిరేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ కూడా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే వారు ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారు? ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారు? అనే అంశాలపై మాత్రం ఆ పార్టీ నేతలు నోరుమొదపడం లేదు.

వీరిద్దరూ ప్రధాని మోదీ కేబినెట్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన మంత్రులు. ప్రస్తుతం వారిద్దరూ పెద్దల సభలో సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి, జైశంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యంవహిస్తున్నారు. వీరిద్దరూ సుదీర్ఘకాలంగా రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యంవహిస్తున్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఈ ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో వీరిద్దరినీ పోటీ చేయించాలని పార్టీ యోచిస్తున్నట్లు మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అయితే మీడియాలో కథనాలు వస్తున్నట్లు వారు కర్ణాటక నుంచి పోటీ చేస్తారా..? ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేస్తారా..? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. వారిద్దరిలో ఒకరు బెంగుళూరులోని ఏదైనా ఓ సీటు నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోనందున వారు బెంగుళూరు నుంచి పోటీ చేస్తారని తాను ధృవీకరించలేదని ప్రహ్లాద్ జోషి స్పష్టంచేశారు.

నిర్మలా సీతారామన్ 2008లో బీజేపీలో చేరారు. 2014 వరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. మోదీ తొలిసారి ప్రధాని అయినప్పుడు ఆయన కేబినెట్‌లో నిర్మలా సీతారామన్ సహాయ మంత్రిగా ఉన్నారు. 2014లో ఆమె ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017 నుంచి 2019 వరకు దేశ రక్షణ శాఖ మంత్రిగా ఆమె సేవలందించారు.

ఎస్ జైశంకర్ దౌత్యవేత్త నేపథ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో ఆయన విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. 2019లో ఆయన ప్రధాని మోదీ కేబినెట్‌లో విదేశాంగ మంత్రిగా చేరారు. ఆ తర్వాత రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సోషల్ మీడియాలో జైశంకర్‌కు మంచి క్రేజ్ ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాతో భారత్ సంబంధాలను కొనసాగించడాన్ని సమర్థించుకుంటూ ఆయన చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ వేదికలపై భారత విదేశాంగ విధానాన్ని సమర్థించుకుంటూ జైశంకర్ దేశ గళాన్ని వినిపిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి