మళ్ళీ ఆందోళనా పథం ! మా సహనాన్ని పరీక్షించకండి, చర్చలు ప్రారంభించి మా డిమాండ్లు పరిష్కరించండి, కేంద్రానికి రైతు సంఘాల డిమాండ్
తమ సహనాన్ని పరీక్షించవద్దని, మళ్ళీ చర్చలు ప్రారంభించి తమ డిమాండ్లు తీర్చాలని రైతులు తిరిగి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ..
తమ సహనాన్ని పరీక్షించవద్దని, మళ్ళీ చర్చలు ప్రారంభించి తమ డిమాండ్లు తీర్చాలని రైతులు తిరిగి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ..పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీ రాష్ట్రాల నుంచి అన్నదాతలు ఇంకా ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, తిక్రి, ఘజియాబాద్ బోర్డర్లలో నిరసన కొనసాగిస్తున్నారని తెలిపింది. వీరు ఆందోళన మొదలు పెట్టి ఆరు నెలలు గడిచిపోయాయని, ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదని ఈ సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. వివాదాస్పదమైన మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారంటీ ఇవ్వాలని తాము కోరుతున్నామని, దీనిపై ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుందో అర్థం కావడంలేదని ఈ సంఘం నేతలు పేర్కొన్నారు. నాటి నుంచి నేటివరకు తమ ఆందోళన సందర్భంగా సుమారు 470 మందికి పైగా అన్నదాతలు మరణించారని, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. అనేకమంది ఉపాధి కోల్పోగా, తమ విద్యా సంబంధ కార్యక్రమాలకు కూడా వేలమంది దూరమయ్యారని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తుంది. అన్నదాతల న్యాయబధ్దమైన డిమాండ్లను పరిష్కరించడం లేదని వారు దుయ్యబట్టారు.
రైతు సంఘాలకు, కేంద్రానికి మధ్య లోగడ 11 దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ విఫలమయ్యాయి., రెండు పక్షాలూ తమ ధోరణిని వీడకపోవడంతో సమస్య ఎక్కడికక్కడే పరిష్కారం కాకుండా ఉంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది.
మరిన్ని ఇక్కడ చూడండి:Viral Video: ఆ రైల్వే స్టేషన్ కు అసలు పేరే లేదు.. ఎందుకో, ఎక్కడో తెలుసా..?? ( వీడియో )