Encounter: మళ్లీ దద్దరిల్లిన దండకారణ్యం.. 12 మంది మావోయిస్టులు మృతి..

ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో ఈ భీకర కాల్పులు జరిగాయి.

Encounter: మళ్లీ దద్దరిల్లిన దండకారణ్యం.. 12 మంది మావోయిస్టులు మృతి..
Abujhmad Encounter
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 12, 2024 | 1:19 PM

అడవిలో ఒక్కసారిగా అలజడి.. దండకారణ్యం దద్దరిల్లుతోంది.. తుపాకుల మోతలతో రక్తమోడుతోంది. పచ్చని అటవీప్రాంతం ఎరుపెక్కుతోంది..ఇలా ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతం వరుస ఎన్‌కౌంటర్లతో రక్తసిక్తమవుతోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఏడాది కాలంగా భీకర పోరు జరుగుతోంది. ఈ భీకరపోరులో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. తాజాగా.. ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.

అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య గురువారం ఉదయం ఈ భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.. తెల్లవారుజాము 3 గంటల నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని.. డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు ఇందులో పాల్గొన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

యాంటీ నక్సలైట్ ఆపరేషన్లో భాగంగా అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.. గతనెల లోనూ భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యాయి. ఈ ఏడాదిలో మార్చి నుంచి ఇప్పటివరకు దాదాపు ఏడు భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. 200 మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

అక్టోబర్ నెలలో భారీ ఎన్‌కౌంటర్..

చత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ- నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్‌మాఢ్ అటవీప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఏకంగా 38మంది మావోయిస్టులు హతమవడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా రికార్డ్‌లకెక్కింది.

ఇటీవల జరిగిన ములుగు ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. ఇలా వరుస ఎన్‌కౌంటర్లతో అటవీ ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..