బడాబాబుల ఇళ్లకు దొంగ దారుల్లో లగ్జరీ కార్లు.. గుట్టు రట్టు
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. సెలబ్రిటీలు అనుకుంటే కార్లకు కొరతేముంది. కోరుకున్న చోటినుంచి కోరుకున్న హైఎండ్ లగ్జరీ కారు రెక్కలు కట్టుకుని వాలిపోతుంది. షోరూంలో కొని ట్యాక్సులు కట్టి రోడ్లమీద షికార్లు కొడితే అది ఎన్ని కోట్ల కారు అయినా.. ఎవరూ కాదనరు. కానీ రూల్స్‌కి విరుద్ధంగా రాంగ్‌రూట్‌లో వెళ్తేనే.. ఎంత గొప్ప కారుకైనా బ్రేక్ పడుతుంది. ఆ కార్ల ఇష్యూలోనే తమిళనాడు, కేరళలో ఈడీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలపై తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైఎండ్ లగ్జరీ కార్ల అక్రమ రవాణా, అనధికారికంగా విదేశీ మారక ద్రవ్య లావాదేవీలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తోంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, మలప్పురం, కొట్టాయం, కోయంబత్తూరులలో పలుచోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
సినీ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చక్కలక్కల్ ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వాహన యజమానులు, ఆటోమొబైల్ డీలర్ల ఇళ్ళు, కార్యాలయాలతో పాటు వర్క్ షాపుల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మొత్తం 17 చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 23న కొచ్చిలోని కస్టమ్స్ కమిషనరేట్ పక్కా సమాచారంతో పలుచోట్ల దాడులు చేపట్టింది. భూటాన్ నుంచి అక్రమంగా రవాణా అయినట్లు అనుమానిస్తున్న 37 ప్రీమియం కార్లను 30కి పైగా ప్రదేశాల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సినీ ప్రముఖులు వాడుతున్న కార్లు కూడా ఉన్నాయి.
భూటాన్, నేపాల్ మార్గాలగుండా ల్యాండ్ క్రూయిజర్, డిఫెండర్, మసెరటి వంటి లగ్జరీ కార్ల అక్రమ దిగుమతితో పాటు మోసపూరిత రిజిస్ట్రేషన్ వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని ఈడీ అనుమానిస్తోంది. కోయంబత్తూర్ కేంద్రంగా పనిచేసే ఒక నెట్‌వర్క్ ఈ అక్రమాలకు పాల్పడిందని ఈడీ ప్రాథమిక విచారణలో గుర్తించింది. ఇండియన్ ఆర్మీ, అమెరికా రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖల పేరుతో నకిలీ పత్రాలు ఉపయోగించి.. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌లలో ఈ కార్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ తరువాత ఈ వాహనాలను సినీ ప్రముఖులతో సహా సంపన్నులకు మార్కెట్ విలువ కంటే తక్కువ రేట్లకు విక్రయించినట్లు అనుమానిస్తున్నారు.
ఆపరేషన్ నమ్‌ఖోర్ పేరుతో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ గతంలో దాదాపు 150–200 లగ్జరీ కార్లను గుర్తించింది. ఆ దాడుల సమయంలో దుల్కర్ సల్మాన్, అమిత్ చక్కలక్కల్ వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దుల్కర్ సల్మాన్ తన కార్లను విడుదల చేయాలని కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. వాహనాల అక్రమ రవాణాకేసును కొన్నాళ్లుగా సీరియస్‌గా తీసుకున్న ఈడీ.. భూటాన్ నుంచి దేశంలోకి ప్రీ ఓన్డ్ లగ్జరీ వాహనాలను విదేశీ మారక లావాదేవీలతో కొనుగోలు చేస్తున్నారని కనిపెట్టింది. దాంతో ఫెమా కూడా ఎంటరైంది.
దక్షిణాదిలో ప్రేక్షకాదరణ పొందిన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లగ్జరీ కారు అక్రమ రవాణా కేసులో చిక్కుకోవడం సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లో దుల్కర్ సల్మాన్ 2004 మోడల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ కూడా ఉంది. ఒక్క కేరళ రాష్ట్రంలోనే అక్రమంగా దిగుమతి చేసుకున్న 150 నుంచి 200దాకా లగ్జరీ కార్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కేవలం పన్ను ఎగవేత అంశమే కాదు.. దీని వెనుక మనీలాండరింగ్ కూడా జరిగిందని కస్టమ్స్ అనుమానిస్తోంది. స్వాధీనం చేసుకున్న వాహనాల పత్రాలను కస్టమ్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. దుల్కర్ సల్మాన్‌తో సహా వాహన యజమానులందరికీ సమన్లు జారీ చేసి, వారి స్టేట్మెంట్లు నమోదు చేయబోతున్నారు దర్యాప్తు అధికారులు.




