
ద్రావిడ సిద్ధాంతాల రూపకర్త పెరియార్ రామస్వామి నాయకర్.. ప్రతి ఎన్నికల్లో ఆయన ప్రస్తావన లేకుండా ఎన్నికలు జరగవు. తమిళనాడులో దశాబ్దాలుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ద్రవిడ మున్నెట్ర కలగం(డీఎంకే), అన్నా ద్రవిడ మున్నెట్ర కలగం(ఎడిఎంకే) ఈ రెండు పార్టీల మూలాలు పెరియార్ సిద్ధాంతాల వారసత్వంగా చెప్పుకుంటాయి. అలాగే ద్రవిడ వాదం మెండుగా ఉన్న తమిళనాడు లో దాదాపు అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీల పేర్లలో ద్రవిడ అన్న పదం లేకుండా ఉండదు. 1879 లో తమిళనాడు లోని ఈరోడ్ లో జన్మించిన పెరియార్ రామస్వామి 1919లో కాంగ్రెస్ కూటమి లో చేరి మహాత్మా గాంధీతో కలిసి సత్యాగ్రహం లో పాల్గొన్నారు. ఆతర్వాత అక్కడ బ్రహ్మాణ ఆధిపత్యం నచ్చక 1925లో బయటకు వచ్చి ద్రవిడ కలగం స్థాపించారు.
ఆతర్వాత అదే ద్రవిడ మున్నెట్ర కలగం.. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే గా రూపాంతరం చెందింది. దేవుడ్ని పూజించడం అనాగరకం.. దేవుడే లేనప్పుడు పూజలు ఎవరికి అంటూ ప్రచారం మొదలు పెట్టారు పెరియార్. కొద్దిమంది మైనారిటీ సమూహం (అగ్ర వర్ణాలు) ఎక్కువగా ఉన్న మెజారిటీ అణగారిన వర్గంపై పెత్తనం. చేస్తోందంటూ పోరాటం చేశారు పెరియార్. వివక్షకు గురవుతున్న వర్గాల్లో పెరియార్ దేవుడిగా నిలిచారు. దీంతో ఆయన మాటలే అప్పట్లో సామాన్యులకు కీలకంగా నిలిచాయి.
ఇప్పటికే పెరియార్ స్మరణ చేస్తున్న రాజకీయ పార్టీలు , ప్రభుత్వాలు వాడ వాడలా ఆయన విగ్రహాలను ప్రతిష్టించాయి. ఇప్పుడు ఆ విగ్రహాల కేంద్రంగానే వివాదం రాజుకుంటోంది. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై నిత్యం ద్రవిడ వాదాన్ని వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పెరియార్ విగ్రహాల అంశంపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గిని రాజేస్తున్నాయి. ఆలయాల ఎదురుగా పెరియార్ విగ్రహాలు ఉండడం.. ఆ విగ్రహాల వద్దనున్న శిలాఫలకంపై దేవుడ్ని పూజించడం మూర్ఖత్వం.. దేవుడే లేడు, లేని దేవుడి గురించి చెప్పడం అంతకన్నా మూర్ఖత్వం అన్న సందేశం ఉండడం పై తీవ్రంగా తప్పుపట్టిన అన్నామలై బిజెపి అధికారంలోకి రాగానే అలయాల ముందున్న పెరియార్ విగ్రహాలు తొలగిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ.. ఆలయాల ముందు ఇలాంటి స్లొగన్స్ ఏంటి, అదే ముస్లిం, క్రైస్తవ మందిరాల ముందు ఇలా రాసే దమ్ముందా వీళ్లకు అంటూ ప్రశ్నించారు. అలాగే బిజెపి అధికారంలోకి రాగానే తమిళనాడులో దేవాదాయశాఖను రద్దు చేస్తామన్నారు. ఆలయాల నిర్వహణను స్థానిక మఠాలకు, కమిటీలకు అప్పజెపుతామన్నారు. అన్నామలై వ్యాఖ్యలతో తమిళనాట రాజకీయ రచ్చ మొదలైంది. ప్రజల్లో ద్రవిడ వాదం ఎంత ఉంది అన్నది అలా ఉంచితే ఆ వాదంతో రాజకీయం చేసే పార్టీలకు మంచి అవకాశం దక్కినట్లయింది. బిజెపిపై మండిపడుతూ ద్రవిడ పార్టీలన్నీ ఆందోళనలు చేప్పడుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..