Himachal Floods: మళ్లీ అటువంటి ఉత్పాతమే రాబోతోందా? హిమాచల్ ప్రదేశ్‌లో ఎటు చూసినా విలయం, శిధిలం!
జలగండంతో వణికిపోతోంది హిమాచలం. వరుస కుండపోత, మెరుపు వరదలు యావత్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఎటుచూసినా కొట్టుకుపోయిన రోడ్లు, ధ్వంసమైన ఊళ్లు, ఓ విషాద చిత్రంగా మారిపోయింది హిమాచల్ ప్రదేశ్. 2023లో 300 మందిని బలిగొన్న వరద భీబత్సాన్ని గుర్తు చేస్తోంది హిమాచల్‌లో ప్రస్తుత జలదృశ్యం. కుండపోత వానలు, ఆకస్మిక వరదలు, విరిగి పడుతున్న కొండ చరియలు...

జలగండంతో వణికిపోతోంది హిమాచలం. వరుస కుండపోత, మెరుపు వరదలు యావత్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఎటుచూసినా కొట్టుకుపోయిన రోడ్లు, ధ్వంసమైన ఊళ్లు, ఓ విషాద చిత్రంగా మారిపోయింది హిమాచల్ ప్రదేశ్. 2023లో 300 మందిని బలిగొన్న వరద భీబత్సాన్ని గుర్తు చేస్తోంది హిమాచల్‌లో ప్రస్తుత జలదృశ్యం. కుండపోత వానలు, ఆకస్మిక వరదలు, విరిగి పడుతున్న కొండ చరియలు… హిమాచల్ ప్రదేశ్‌ని చెల్లాచెదరు చేసింది. మూడువారాలుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో కేవలం 17 రోజుల్లో 23 సార్లు వరదలొచ్చాయి. ఇప్పటివరకూ 82 మంది మృత్యువాత పడ్డారు. 115 మంది గాయపడ్డారు. 31 మంది గల్లంతయ్యారు. ఎటుచూసినా విలయం, శిధిలం!
వాటర్ ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కడివక్కడే కూలిపోయాయి. రెండు జాతీయ రహదారులతో పాటు.. 243 రోడ్లు మూసేశారు. మండి, కంగ్రా, శిర్మౌర్ జిల్లాల్లో రెడ్ ఎలర్ట్. మరో ఏడు జిల్లాల్లో ఆరంజ్ ఎలర్ట్ జారీ ఐంది. మండి జిల్లాలో మళ్లీ క్లౌడ్‌బర్ట్స్ ఖాయమన్న వార్తలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు అక్కడివాళ్లు.
ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ కలిసి రెస్క్యూ ఆపరేషన్లు చేసినా చెప్పుకోదగ్గ ఫలితం లేదు. హిమాలయన్ జోన్స్‌లో ప్రస్తుతానికి టూరిస్టుల కదలికలు పూర్తిగా ఆగిపోయాయి. హిమాచల్ పక్కనే ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రం సైతం కుండపోత కారణంగా అతలాకుతలమైంది. నాలుగు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా చార్‌ధామ్ యాత్ర నిలిచిపోయింది.
భారీవర్షాలు, మెరుపు వరదల కారణంగా ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే 566 కోట్ల మేర నష్టం జరిగిందన్నది తాజా అంచనా. ప్రతీ కుటుంబానికి ఐదువేల చొప్పున సాయం ప్రకటించారు హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సుఖు. సంచార ఆరోగ్య శిబిరాల్ని ఏర్పాటు చేసి ఇంటింటికీ అత్యవసర వైద్యం అందిస్తున్నారు. రాకాసి వాన కొనసాగుతుందని, కుండపోత ఖాయమని వాతావరణ విభాగం హెచ్చరించడంతో భయంతో వణికిపోతోంది హిమాచలం.




