ISRO Projects: 2025లో ఇస్రో చేపట్టనున్న మేజర్ ప్రాజెక్ట్స్ ఇవే.. భారీ ప్రయోగాలకు ప్రణాళికలు సిద్ధం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2024లో కీలక ప్రయోగాలను చేపట్టగా నూతన సంవత్సరానికి భారీ టార్గెట్‌నే ఎంచుకుంది. చంద్రయాన్‌తో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసిన ఇస్రో శాస్త్ర వేత్తలు 2024లో కీలక ప్రయోగాలు చేపట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది భారీ ప్రయోగాలు వరకు చేపట్టింది.
రానున్న 2025 ఏడాదికి సంబంధించి ఇస్రో చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలు ఇప్పటికే కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో అధికారికంగా ప్రకటించారు. తాజగా ఇస్రో చైర్మన్ సోమనాధ్ కూడా చెప్పుకొచ్చారు. తాజా ప్రకటనతో అందరి చూపు ఇస్రో వైపు చూసేలా చేసింది. 2025లో ఇస్రో చేపట్టనున్న పది ప్రయోగాలపై ఇస్రో శాస్త్ర వేత్తల నుంచి కూడా ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. ఇస్రో చేపట్టనున్న పది ప్రయోగాల్లో నాలుగు PSLV కాగా, మరో నాలుగు GSLV, GSLV మార్క్ 3 మూడు ప్రయోగాలు చేపట్టనుంది. అయితే అందులో ఆమెరికాకు చెందిన నాసా వారి NISAR ప్రయోగంను నాసా ఇస్రో కలిసి సంయుక్తంగా మిషన్ చేపట్టనున్నారు. 2023లో చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 మిషన్ల విజయాల తర్వాత 2024లో స్వదేశీ రాకెట్లతో 10 ప్రయోగాలతో సహా 16 ప్రధాన అంతరిక్ష ప్రయోగాలను ఇస్రో చేపట్టింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పార్లమెంట్‌లో ఇస్రో కొత్త ప్రాజెక్టుల వివరాలు తెలిపారు. LVM3 ద్వారా కమర్షియల్ లాంచ్ చేపట్టనుంది. ఈ ప్రయోగంతో పాటు PSLV ప్రయోగాల ద్వారా 60కి పైగా విదేశాలకు చెందిన ఉపగ్రహాలను స్పేస్‌లోకి పంపనుంది ఇస్రో.. అలాగే SSLV డెవలప్మెంట్ లాంచ్ కూడా విజయవంతంగా జరిపింది. SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇస్రో సొంతంగా రూపొందించిన చిన్న తరహా రాకెట్.. అది అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో జరిపే అవకాశం ఉన్న వాహక నౌక.. కమర్షియల్‌గా మరిన్ని ప్రయోగాలకు ఇది దోహదం చేస్తుంది. ఇప్పటికే రెండు టెస్ట్ లాంచ్‌లు చేపట్టగా మరింత సాంకేతికతో మరోసారి 2024లో SSLV డెవలప్మెంట్ లాంచ్ జరిపింది. ఇవి అంతిమంగా తక్కువ-భూ కక్ష్య ఉపగ్రహ ప్రయోగాల కోసం ప్రైవేట్ సెక్టార్ ద్వారా ఈ తరహా రాకెట్ ప్రయోగాలను జరపాలని ఇస్రో యోచిస్తోంది.
గగన్‌యాన్ ప్రాజెక్ట్ కింద రెండు మానవరహిత మిషన్లు మానవ-రేటెడ్ లాంచ్ వెహికల్‌ను ప్రయోగించనుంది. 2025లో పూర్తి స్థాయి ప్రయోగం జరగనుంది. వ్యోమగాములు ప్రయాణించే క్రూ మాడ్యూల్ భద్రత కోసం ప్రయోగాత్మక ప్రయోగాలను 2025లో పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2025 ఏడాదిలో భారత్ మానవ రహిత అంతరిక్ష ప్రయోగానికి ఇది కీలకంగా మారనుంది. గగన్‌యాన్ మిషన్‌కి సంబంధించి వ్యోమగాములు శిక్షణ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. 2025లో జరిగే ప్రయోగం కోసం అన్ని విధాలా సిద్ధం చేశారు. గగన్‌యాన్ క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను వివిధ అబార్ట్ పరిస్థితులలో ఉపయోగించేందుకు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అలాగే వాతావరణ అధ్యయనం కోసం శాటిలైట్, నావిగేషన్ శాటిలైట్ అలాగే నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించనున్నారు.
ఏది ఏమైనా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుస రాకెట్ ప్రయోగ విజయాలతో ముందుకు దూసుకు వెళుతూ యావత్ ప్రపంచ దేశాలు సైతం ఇస్రోవైపు చూసేలా ఇస్రో వరుస రాకెట్ ప్రయోగాలు చేపట్టి ఎన్నో విజయాలు చేజిక్కించుకుంటుంది. ఈ నేపథ్యంలోనే 2024 సంవత్సరంలో ఇస్రో దాదాపుగా 10 రాకెట్ ప్రయోగాలను చేపట్టి దాదాపు అన్ని ప్రయోగాలు విజయం కైవసం చేసుకుంది. అందులో భాగంగానే 2024 జనవరి మొదటి రోజున పీఎస్ఎల్వీ c58 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టి విజయం సాధించి దీని ద్వారా ఎక్స్పో సాటిలైట్‌ను అంతరిక్షంలో ప్రవేశపెట్టి 2024వ సంవత్సరానికి విజయం సాధించి బోనీ కొట్టింది. ఆ తదుపరి ఫిబ్రవరి 17న జీఎస్ఎల్వీ ఎఫ్ 14, ఆగస్టు 16న ఎస్‌ఎస్‌ఎల్‌వీడీ త్రీ, అదేవిధంగా నవంబర్ 19న జీ సాటు N2, డిసెంబర్ 5న పీఎస్ఎల్వీ సీ 59 రాకెట్ ప్రయోగం ద్వారా ప్రోబాత్రి ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఈ ఏడాది డిసెంబర్ 30వ తారీఖున PSLV C60 రాకెట్ ప్రయోగం ద్వారా స్పెడాక్స్ అనే జంట ఉపగ్రహాలను సరికొత్త తరహా ఆర్బిట్లోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నహాలు చేస్తున్నారు. అదేవిధంగా 2025 సంవత్సరంలో కూడా ఇస్రో మరెన్నో కీలకమైన రాకెట్ ప్రయోగాలను చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే గగనయాన్ 1, 2, 3, 4 మానవ సహిత ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో అహర్నిశలు శ్రమిస్తూ ఉంది. ఆ తదుపరి 2025లోనే మరో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ 15, పీఎస్ఎల్వీ సీ 61, జీఎస్ఎల్‌వీసీ ..16, 63 ,జిఎస్ఎల్వీఎఫ్ 17 లాంటి భారీ రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ప్రణాళికను తయారుచేసి ఈ తరహా రాకెట్ ప్రయోగాలు చేసి 2024 సంవత్సరంలో ఎన్ని విజయాలు సాదించారో దానికి రెట్టింపుగా 2025 సంవత్సరంలో కూడా వరుస రాకెట్ ప్రయోగాలు చేపట్టి వరుస విజయాలను కైవసం చేసేందుకు ఇస్రో ఒక ప్రణాళికను సిద్ధం చేసి ముందుకు వెళుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి