Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Pollution: అమ్మో.. ఊపిరి పీల్చుకోలేక తల్లడిల్లుతున్న ఢిల్లీ.. బయట అడుగుపెట్టేందుకు వణుకుతున్న ప్రజలు..

Delhi NCR Air Pollution: తీవ్ర స్థాయిలో విషపూరిత పొగమంచు.. దేశ రాజధాని ఢిల్లీ మొత్తాన్ని కమ్మేసింది. దీంతో ఊపిరి పీల్చుకోవడానికి ఢిల్లీ తల్లడిల్లిపోతోంది. దేశ రాజధాని నగరం..నరకంలా మారింది. ఢిల్లీలో వరుసగా మూడో రోజూ, వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. ఇవాళ వాయు నాణ్యత సూచీ 504కి చేరింది.

Air Pollution: అమ్మో.. ఊపిరి పీల్చుకోలేక తల్లడిల్లుతున్న ఢిల్లీ.. బయట అడుగుపెట్టేందుకు వణుకుతున్న ప్రజలు..
Delhi Ncr Air Pollution
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 04, 2023 | 7:31 PM

Delhi NCR Air Pollution: తీవ్ర స్థాయిలో విషపూరిత పొగమంచు.. దేశ రాజధాని ఢిల్లీ మొత్తాన్ని కమ్మేసింది. దీంతో ఊపిరి పీల్చుకోవడానికి ఢిల్లీ తల్లడిల్లిపోతోంది. దేశ రాజధాని నగరం..నరకంలా మారింది. ఢిల్లీలో వరుసగా మూడో రోజూ, వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉంది. ఇవాళ వాయు నాణ్యత సూచీ 504కి చేరింది. అయితే జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618కి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మితిమీరిన కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని నగరాన్ని నరకంగా మార్చేసిన వాయు కాలుష్యం.. అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్‌ కమర్షియల్‌ వాహనాలు, డీజిల్‌ ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ ప్రకటించారు. కాలుష్యం కేవలం ఢిల్లీకే పరిమితం కావడం లేదు. రాజస్తాన్‌లోని హనుమాన్‌గఢ్, భివాడీ, శ్రీగంగానగర్, హరియాణాలోని హిసార్, ఫతేబాద్, జింద్, రోహ్‌తక్, బహదూర్‌గఢ్, సోనేపట్, కురుక్షేత్ర, కర్నాల్, ఖైతాల్, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, బాఘ్‌పట్, మీరట్, నోయిడా, గ్రేటర్‌ నోయిడా తదితర ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత దిగజారింది.

ఢిల్లీలో విష వాయువుల గాఢత ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితుల కంటే 80 రెట్లు ఎక్కువగా ఉండడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం కారణంగా ఢిల్లీలో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, కంటి దురదతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో ఇలా కాలుష్య తీవ్రత పెరగడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. రెండు వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

పంట వ్యర్థాలను కాలుస్తుండటంతో..

చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ కాలుష్యానికి కారణమయ్యాయి. విషపూరిత పొగమంచు ఢిల్లీని కమ్మేయడంతో.. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు ట్రైనింగ్ సెషన్‌ను కూడా రద్దు చేసుకుందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

వాయు కాలుష్యం రికార్డు స్థాయికి చేరడంతో చాలామంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. సాధ్యమైనంత మేరకు ఇళ్లనుంచే పనిచేసేందుకు సిబ్బంది ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..