Arvind Kejriwal: ఇదంతా రాజకీయ తొండి.. సిసోడియాను జైలుకు పంపడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫైర్..

ఇదంతా రాజకీయ తొండి అంటున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. తన సన్నిహితుడు సిసోడియాను జైలుకు పంపడంపై మండిపోతున్నారు. మీకో న్యాయం, మాకో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఏమిటి ఆయన వాదన?

Arvind Kejriwal: ఇదంతా రాజకీయ తొండి.. సిసోడియాను జైలుకు పంపడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫైర్..
Arvind Kejriwal
Follow us

|

Updated on: Mar 07, 2023 | 9:42 PM

కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్పను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. కర్నాటక సోప్స్‌ అండ్ డిటర్జెంట్స్ సంస్థకు చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షప్ప ఆఫీస్‌లో, ఆయన కుమారుడే కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుండా అడ్డంగా దొరికిపోతే.. ఆ ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్‌ చేయలేదన్నది కేజ్రీవాల్‌ సంధిస్తున్న ప్రశ్న. ఆయనకో రూల్. తమ పార్టీ నాయకులు మనీష్ సిసోడియా విషయంలో మరో రూలా అని నిలదీస్తున్నారు. సిసోడియా ఇంట్లో జరిగిన తనిఖీల్లో ఏమీ దొరకలేదని గుర్తుచేశారు కేజ్రీవాల్. అయినప్పటికీ విచారణ పేరుతో పిలిచి అరెస్ట్ చేసి జైలుకు పంపించారని విమర్శించారు.

ప్రధానిని ఉద్దేశించిన ఓ నోట్‌ రాసిన ఢిల్లీ ముఖ్యమంత్రి.. అవినీతిని అంతం చేస్తాం.. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అనే మాటల్ని దయచేసి చెప్పకండి.. ఈ ఉదాహరణలు చూసిన తర్వాత అవి మీకు సెట్‌ అవ్వవంటూ సెటైర్లు వేశారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న సమయంలో 40 లక్షలు లంచం తీసుకుంటూ విరూపాక్షప్ప ఆఫీస్‌లో ఆయన కుమారుడు ప్రశాంత్ దొరకడం బీజేపీని ఇరకాటంలోకి నెట్టేసింది. అవినీతి కేసులో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకపోగా.. ఆయన్ను బీజేపీ నెత్తిన పెట్టుకుంటోంది.

ముందస్తు బెయిల్‌ మాత్రమే కాదు.. భవిష్యత్‌లో ఆయనకు పద్మభూషణ్‌ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కర్నాటక గడ్డపై సెటైర్లు వేశారు. సాధువు లాంటి సిసోడియాను అరెస్ట్ చేయించినందుకు ప్రధానమంత్రి మోదీకి శాపం తగులుతుందని, అంతకంత అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం