AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీకి విమానంలో వెళ్తున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే..!

ఢిల్లీకి ఏదైనా పని ఉండి వెళ్తున్నారా? వీసా ఇంటర్వ్యూకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే. ఢిల్లీకి రాకపోకలు సాగించే విమాన సర్వీసులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులే స్వయంగా ప్రకటించారు. ఇదేదో ఒకట్రెండు రోజుల సమస్య కాదు. ఏకంగా 4 నెలల పాటు ఈ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

ఢిల్లీకి విమానంలో వెళ్తున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే..!
Delhi Airport
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Apr 11, 2025 | 2:21 PM

Share

ఢిల్లీకి ఏదైనా పని ఉండి వెళ్తున్నారా? వీసా ఇంటర్వ్యూకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే. ఢిల్లీకి రాకపోకలు సాగించే విమాన సర్వీసులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులే స్వయంగా ప్రకటించారు. ఇదేదో ఒకట్రెండు రోజుల సమస్య కాదు. ఏకంగా 4 నెలల పాటు ఈ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఆ విమానాశ్రయంలో ప్రధాన రన్‌వే మూసివేయడమే ఈ ఆలస్యానికి కారణం. ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీ ఒకటి. ఇక్కడ నిమిష నిమిషానికి విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవుతుంటాయి. అలాంటి రద్దీ విమానాశ్రయంలో ప్రధాన రన్ వే మూసేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఢిల్లీ విమానాశ్రయంలో రన్‌వే అప్‌గ్రేడ్

దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వే 10/28ను CAT-III స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని విమానాశ్రయ అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ పనులు ఏప్రిల్ 8న ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జులై 31 వరకు జరగనున్నాయి. అంటే.. దాదాపు 4 నెలల పాటు ఈ పనులు జరుగుతాయి. ఈ పనులు జరిగినంత కాలం పాటు రన్‌వే ను మూసివేయక తప్పదు. అందుకే విమానాల రాకపోకలు ప్రభావితమై, ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇంతకీ CAT-III స్థాయి అంటే ఏంటి అన్న ప్రశ్న తలెత్తవచ్చు. CAT-III సాంకేతికత అనేది తక్కువ దృశ్యమానత (visibility) ఉన్నప్పుడు, ముఖ్యంగా దట్టమైన పొగమంచు లేదా తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి, టేకాఫ్ చేయడానికి సహాయపడుతుంది.

రన్ వే అప్‌గ్రేడ్ పనులు పూర్తయితే, శీతాకాలంలో పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యమవడం లేదా దారిమళ్లించడం వంటి సమస్యలు తలెత్తవు. సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు సమస్య తీవ్రంగా ఉంటుంది. కనీసం ఎదురుగా నిలుచున్న మనిషి సైతం కనిపించనంత దట్టమైన పొగమంచు సందర్భాలు అనేకం. ఈ పరిస్థితుల్లో విమానాలను టేకాఫ్ చేయాలన్నా.. ల్యాండింగ్ చేయాలన్నా సాధ్యపడదు. ఒకవేళ CAT-III స్థాయికి ‘రన్‌వే’ను ఆధునీకరిస్తే.. ఎంతటి దట్టమైన పొగమంచులోనైనా విమానాలను సురక్షితంగా ల్యాండింగ్ చేయడం సాధ్యపడుతుంది. ఇందులో భాగమైన ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ విమానాల ల్యాండింగ్‌కు దోహదపడుతుంది. ఇప్పటికే ఢిల్లీ విమానాశ్రయంలో కొన్ని రన్‌వేలను ఈ స్థాయికి ఆధునీకరించినప్పటికీ.. ప్రధాన రన్‌వేను అప్‌గ్రేడ్ చేయలేదు. దీన్ని అప్‌గ్రేడ్ చేస్తే.. ఢిల్లీకి అన్ని కాలాల్లోనూ విమానాల రాకపోకలకు ఎలాంటి విఘాతం ఉండదని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.

అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఈ పనుల వల్ల విమాన షెడ్యూళ్లలో మార్పులు లేదా ఆలస్యాలు తప్పవని ఇండిగో వంటి విమానయాన సంస్థలు ప్రయాణీకులకు సూచించాయి. “ప్రయాణీకులు తమ విమాన స్థితిని ముందుగా తనిఖీ చేసి, షెడ్యూల్‌ను ధృవీకరించుకున్న తర్వాతే విమానాశ్రయానికి బయలుదేరాలి” అని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అప్‌గ్రేడ్ పనులు ఢిల్లీ విమానాశ్రయ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు, ప్రయాణీకులకు సురక్షితమైన, సమర్థవంతమైన సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) అధికారులు పేర్కొన్నారు. కొద్ది నెలల పాటు ప్రయాణీకులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొనవచ్చని, విమానయాన సంస్థలు దీన్ని నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని వారు స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..