Delhi: దేశ రాజధానిలో తారాస్థాయికి వాయు కాలుష్యం.. స్కూళ్లన్నీ క్లోజ్
ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. దేశంలోనే అత్యధికంగా... ఢిల్లీలోని జహంగిర్‌పురి ప్రాంతంలో AQI వెయ్యి దాటింది. ఢిల్లీ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ దగ్గర 819 ఉంది. ద్వారక సెక్టార్ 10 దగ్గర 761గా నమోదైంది. అశోక్ విహార్ ఫేజ్ 1 దగ్గర 770కి పెరిగింది. ఓవరాల్ ఢిల్లీలో 706గా నమోదైంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.
వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ CAQM తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లేటెస్టుగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఢిల్లీ-NCR పరిధిలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ GRAP-4’ కింద మరిన్ని నిబంధనలను అమలు చేస్తామంది. ఈరోజు ఉదయం 8గంటల నుంచి ఈ నిబంధనలు అమలు చేస్తారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఢిల్లీలోని పాఠశాలల్లో కేవలం ఆన్‌లైన్ తరగతులే నిర్వహించనున్నట్లు సీఎం ఆతిశీ ప్రకటించారు.
GRAP స్టేజ్-4లో ఎలాంటి నిబంధనలు విధిస్తున్నారంటే..
- ఢిల్లీలోకి నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా మిగిలిన ట్రక్కుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నారు. LNG, CNG, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులకు మాత్రమే అనుమతి.
- ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వెహికల్స్ ప్రవేశంపై నిషేధం విధిస్తున్నారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్నప్పటికీ బీఎస్-4 అంతకన్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశంపై నిషేధిస్తున్నారు.
- అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశాలు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్‌లు, పైపులైన్‌లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆదేశించింది ప్రభుత్వం.
- ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించగా.. ఇప్పుడు 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఆతిశీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. GRAP-4 ఆంక్షల ప్రకారం 11-12 తరగతులు మినహా మిగతా విద్యార్థులందరికీ వ్యక్తిగత తరగతులు నిలిపివేయనున్నట్లు తెలిపారు. దీంతో స్కూళ్లన్నీ తాత్కాలికంగా మూతపడనున్నాయి.
- ఎన్‌సీఆర్ ప్రాంతంలో కార్యాలయాలన్నీ 50శాతం సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సిఫారసు చేసింది CAQM. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని సూచించింది.
- రాష్ట్ర ప్రభుత్వాలు కళాశాలలను మూసివేయడంతో పాటు సరి-బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలంది ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్.