Karnataka: నిధులు లేవు కానీ.. రూ.కోట్లతో విగ్రహమా..? కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫైర్..! కారణం ఏంటంటే..

Rajiv Gandhi Statue In Bengaluru: కర్ణాటక రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. అధికారం చేపట్టిన అనతీకాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పలు విషయాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బడ్జెట్ లోటుతో సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో అటు ప్రతిపక్ష పార్టీ బీజేపీ నుంచి విమర్శలు.. ఇటు సొంత ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..

Karnataka: నిధులు లేవు కానీ.. రూ.కోట్లతో విగ్రహమా..? కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫైర్..! కారణం ఏంటంటే..
Karnataka Congress

Updated on: Aug 01, 2023 | 8:17 PM

Rajiv Gandhi Statue In Bengaluru: కర్ణాటక రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. అధికారం చేపట్టిన అనతీకాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పలు విషయాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బడ్జెట్ లోటుతో సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో అటు ప్రతిపక్ష పార్టీ బీజేపీ నుంచి విమర్శలు.. ఇటు సొంత ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నడుమ కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం ఏర్పాటుపై కర్ణాటక రాజకీయం వేడెక్కింది.బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) శుక్రవారం నగరంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని రూ.1.05 కోట్లతో నిర్మించేందుకు టెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. మాజీ ప్రధాని విగ్రహం ఇప్పటికే ఉన్నప్పటికీ.. అది కాంస్య విగ్రహం కాదు. దీంతో కాంస్య విగ్రహం ఏర్పాటుకు సిద్ధరామయ్య ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

ఎన్నికల్లో ఇచ్చిన ఐదు వాగ్దానాలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాసుల వర్షం కురిపిస్తున్న తరుణంలో.. ఈ టెండర్‌ రాజకీయంగా తెరపైకి వచ్చింది. అయితే, ఇటీవల జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు లేవు.. కానీ కాంస్యంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి 1.05 కోట్ల రూపాయలు కేటాయించడం ఏంటంటూ సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నడపడానికి నిధులు లేవని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ పేర్కొనడం కూడా రాజకీయంగా కాకరేపింది.

కాంగ్రెస్ శాసనసభ్యుల ఆరోపణలపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ.. ఎన్నికల్లో ఐదు హామీలను నెరవేర్చేందుకు రూ.40 వేల కోట్లు కేటాయించాలని, ఈ ఏడాది అభివృద్ధికి నిధులు ఇవ్వలేమని తెలిపారు. నీటిపారుదల శాఖ, పిడబ్ల్యుడి లాంటి శాఖలకు అంచనాలు చాలా ఎక్కువని.. అందుకే వేచి ఉండమని ఎమ్మెల్యేలకు చెప్పానని తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఐదు హామీలను అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.40 వేల కోట్ల భారం పడుతుందని డిప్యూటీ సీఎం వివరించారు.

ఇవి కూడా చదవండి

అభివృద్ధికి నిధులు లేవు.. కానీ.. తేజస్వీ ఫైర్..

మాజీ ప్రధాని కాంస్య విగ్రహాన్ని నిర్మించే టెండర్ ప్రకటనపై కాంగ్రెస్‌ పార్టీ పై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ట్విట్టర్‌లో స్పందిస్తూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌లో అభివృద్ధికి నిధులు లేవని, అయితే తమ రాజకీయ నాయకులను సంతోషపెట్టడానికి అన్ని నిధులు అందుబాటులో ఉన్నాయంటూ ఫైర్ అయ్యారు.

మాజీ ప్రధాని కాంస్య విగ్రహ నిర్మాణ పనులను ప్రారంభించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నప్పుడు, భువనేశ్వరి దేవత విగ్రహం పనిని ఎందుకు నిలిపివేశారంటూ ప్రశ్నించారు. “వారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నిర్మించడానికి టెండర్ వేశారు, కానీ కన్నడ గుర్తింపును సూచించే దేవత అయిన భువనేశ్వరి దేవి విగ్రహం పనిని మాత్రం నిలిపివేశారు. ఈ ప్రవర్తనను ప్రశ్నించాలని, మాజీ సీఎం బొమ్మై ప్రారంభించిన ప్రయత్నాలను పునరుద్ధరించాలని కోరుతున్నాను..” అని సూర్య కోరారు.

కాగా.. భువనేశ్వరి దేవి విగ్రహాన్ని రూ.2 కోట్లతో నిర్మిస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై గతంలో ప్రకటించారు. అయితే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటికి టెండర్లు పిలవలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటంతో కార్ణాటకలో రాజకీయం వేడెక్కింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..