వెజ్ బదులు నాన్-వెజ్.. ప్రాణం తీసిన బిర్యానీ.. అసలు ఏం జరిగిందంటే..?
రాంచీలో దారుణం జరిగింది. వెజిటేరియన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు పొరపాటున నాన్-వెజ్ బిర్యానీ వచ్చింది. దీంతో కోపంతో హోటల్‌కు తిరిగి వచ్చిన అభిషేక్, యజమాని విజయ్ కుమార్ నాగ్‌తో గొడవపడి, తుపాకీతో కాల్చి చంపాడు. నిందితుడు అభిషేక్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా.. అతను వారిపై కాల్పులు జరిపడం కలకలం రేపింది.

చిన్న గొడవలకే కొంతమంది విపరీత నిర్ణయాల తీసుకుంటున్నారు. అవతలివారిని చంపేవరకు వదలడం లేదు. పక్కింటి కుర్రాడు నవ్వాడని ఓ వ్యక్తిని ఇటీవలే యువకుడిని దారుణంగా చంపేశాడు. మరో చోట రూ.2వేల విషయంలో హత్య జరిగింది. ఈ క్రమంలో జార్ఖండ్‌లోని రాంచీలో ఒక దారుణం జరిగింది. తాను ఆర్డర్ చేసిన వెజిటేరియన్ బిర్యానీకి బదులు, పొరపాటున నాన్-వెజిటేరియన్ బిర్యానీ వచ్చిందని కోపంతో ఒక కస్టమర్ రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపాడు. విజయ్ కుమార్ నాగ్ అనే వ్యక్తి చౌపాటి రెస్టారెంట్ నడపుతున్నాడు. ఈ రెస్టారెంట్‌లో అభిషేక్ సింగ్ అనే కస్టమర్ వెజ్ బిర్యానీ పార్శిల్ తీసుకుని వెళ్లాడు. ఇంటికి వెళ్లాక చూసి రెస్టారెంట్ నిర్వాహకులు చేసిన పనికి ఫైర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తనకు నాన్-వెజ్ బిర్యానీ ఇచ్చారని అభిషేక్ మరికొంతమందితో కలిసి రెస్టారెంట్ వచ్చి యజమానితో గొడవపడ్డాడు. ఈ గొడవ పెద్దదై వారిలో ఒకరు తుపాకీతో విజయ్ కుమార్ నాగ్‌ను కాల్చి చంపారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన చనిపోయారు.
నిందితుడి అరెస్ట్.. స్థానికుల నిరసన
ఈ హత్య తర్వాత రాంచీ ఎస్ఎస్పీ రాకేష్ రంజన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడు అభిషేక్ సింగ్‌ను కాంకే పోలీస్ స్టేషన్ పరిధిలోని సుకూరుహుతు ఐటీబీపీ క్యాంపు సమీపంలో గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేయడానికి వెళ్లగా, అతను పోలీసులపై కాల్పులు జరిపినట్లు సమాచారం. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా, అభిషేక్ సింగ్ కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటన తర్వాత స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంకే-పిథోరియా రహదారిని దిగ్బంధించారు. మిగితా నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయగా, త్వరలో పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. హత్య వెనుక బిర్యానీ వివాదం కాకుండా భూ వివాదం వంటి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




