హీట్ పెంచిన కన్నడ పాలిటిక్స్.. సిద్దు సీటు ఖాళీ చేస్తారా? సీఎం సీటులో DK కూర్చుంటారా?
కర్నాటకం మరో మలుపు తిరిగింది. కుర్చీలాట సీన్.. బెంగళూరు దాటి ఢిల్లీకి చేరింది. సిద్దు సీటు ఖాళీ చేస్తారా? సీఎం సీటులో DK కూర్చుంటారా? పవర్ షేరింగ్ ఫార్ములా అప్లయ్ అవుతుందా? లేక పవర్ కోసం ఫైటింగ్ తప్పదా? కర్నాటకం పొలిటికల్ మూవీలో, ఓవర్ టు ఢిల్లీ సీన్ కాక రేపుతోంది. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో కర్నాటక తాజా రాజకీయం, ఢిల్లీ పెద్దల ముందుకు చేరడం ఉత్కంఠ రేపుతోంది.

కాంగ్రెస్‌లో కర్నాటకం ముదిరి పాకాన పడింది. ముఖ్యమంత్రి సీటు కోసం మొదలైన ఫైట్.. కాంగ్రెస్‌ను కుదిపేస్తోంది. దీంతో సీను బెంగళూరు దాటి ఢిల్లీకి చేరింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులైన పలువురు ఎమ్మెల్యేలు చలో ఢిల్లీ అంటూ దేశ రాజధానికి చేరుకున్నారు. డీకేని సీఎం చేయాలని, కాంగ్రెస్ హైకమాండ్‌కు అర్జీ సమర్పించనున్నారు. కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, డీకే వర్గం ఇలా ఢిల్లీ బాట పట్టడం, కర్నాటక రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. సీఎం మార్పునకు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం రెండున్నరేళ్లు గడిచిన నేపథ్యంలో డీకేకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పజెప్పాలని కోరనున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తమ డిమాండ్‌ను తెలియజేయనున్నట్లు సమాచారం. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కూడా కలుస్తారని తెలుస్తోంది.
అంతకు ముందు డీకే శివకుమార్ సోదరుడు సురేశ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన మాట నిలబెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. బహుశా ఆయన అధికార విభజనకు సంబంధించే మాట్లాడి ఉండొచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సిద్దరామయ్య రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలోనే ఈ రచ్చ రాజుకుంది.
అయితే ఇదే టైమ్‌లో మంత్రివర్గంలో మార్పులుచేర్పుల పావులు కదుపుతున్నారు సీఎం సిద్దరామయ్య. మంత్రివర్గం విస్తరణ వ్యూహం ద్వారా డీకే వర్గానికి చెక్ పెట్టాలని సిద్దు ఎత్తులు వేస్తుంటే..ఢిల్లీ బాట పట్టడం ద్వారా డీకే వర్గం, సిద్దుకు కౌంటర్ చెక్ పెట్టేలా పైఎత్తు వేసింది. ఈ ఇద్దరు నేతల ఎత్తులుజిత్తులతో కర్నాటకం ముదిరి పాకాన పడింది. తన వ్యూహాల ఫెవికాల్‌తో సీఎం సీటుకు గట్టిగా అతుక్కుపోవాలని సిద్దరామయ్య ట్రై చేస్తుంటే, ఆయన్ని ఆ సీటు నుంచి లాగి, దానిలో డీకేని కూర్చోపెట్టాలని ప్రత్యర్థి వర్గం ఎత్తులు వేస్తోంది.
మరోవైపు త్వరలో పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు డీకే శివకుమార్. పీసీసీ పదవి కోసం సిద్దరామయ్య వర్గీయులు డిమాండ్ చేస్తున్న వేళ డీకే ప్రకటన, ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో త్వరలో సిద్దరామయ్య స్థానంలో… సీఎం పగ్గాలు డీకే చేపడతారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ విషయంలో సిద్దరామయ్య వాదన మాత్రం మరోలా ఉంది. ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని.. పూర్తి కాలం పాలన కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు సిద్దరామయ్య , డీకే శివకుమార్ కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి, హైకమాండ్‌తో చర్చలు జరిపారు. డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇవ్వాలని సిద్దరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ నచ్చచెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో కర్నాటక తాజా రాజకీయం, ఢిల్లీ పెద్దల ముందుకు చేరడం ఉత్కంఠ రేపుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
