COVID-19: కరోనాతో ఇద్దరు మృతి..! పెరుగుతున్న కేసులు.. కొత్త వేరియంట్లతో జర జాగ్రత్త..!
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. అంతేకాకుండా కొత్త రూపంలో పంజా విసురుతోంది.. NB 1.8.1, LF.7.. ఈ రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. అయితే.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి.

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. అంతేకాకుండా కొత్త రూపంలో పంజా విసురుతోంది.. NB 1.8.1, LF.7.. ఈ రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. అయితే.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది.. కేరళలో ఏకంగా 273 కరోనా కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23.. కర్నాటకలో 36 యాక్టివ్ కేసులున్నాయి. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో ఇప్పటికే 4 కేసులు నమోదు కాగా.. నోయిడాలో తొలి కరోనా కేసు నమోదైంది..
అయితే.. కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర థానేలో కొవిడ్‌తో 21 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. బెంగళూరులో కరోనాతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు.
భారతదేశంలో మే 25, 2025 నాటికి 275 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. ఈ కేసుల్లో ఎక్కువ భాగం తేలికపాటివి.. ఆందోళన అక్కర్లేదని ఆరోగ్య అధికారులు తెలిపారు. మొత్తం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కొవిడ్ కేసులు వెలుగుచూశాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇవి ఎక్కువగా పట్టణాల్లోనే నమోదు అవుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.. కేరళలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవ్వడంతో.. ఆస్పత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది ప్రభుత్వం.. మహారాష్ట్రలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కేవలం ముంబైలోనే ఈ నెలలో 95 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.. ఢిల్లీలో కరోనా కేసులు పెరగడంతో ఆస్పత్రులకు పలు సూచనలు జారీ చేశారు.
ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాలను కరోనా కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరింది.. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా సోకింది. బాధితుడు జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్నాడు. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. గాంధీ ఆస్పత్రిలో 25 పడకల వార్డు సిద్ధం చేసింది. ఇక ఏపీ విషయానికి వస్తే విశాఖలో 2 కరోనా కేసులు, కడపలో రెండు కేసులు నమోదయ్యాయి. అలెర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. విశాఖ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. అన్ని సౌకర్యాలతో ఆస్పత్రులను సిద్ధం చేసుకోవాల కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. అయితే.. భయపడాల్సిన పనిలేదని.. ఇవి తేలికపాటి లక్షణాలేనని ఆరోగ్య శాఖ పేర్కొంది.. అయితే.. మాస్కు ధరించడంతోపాటు జాగ్రత్తలు పాటించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
JN.1 వేరియంట్ అన్ని లక్షణాలు మునుపటిలాగే ఉన్నాయని.. దగ్గు, జలుబు, తలనొప్పి, తేలికపాటి జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




