AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Party: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ లో మొదలైన పోస్ట్ మార్టమ్..అశోక్ చవాన్ నేతృత్వంలో కారణాల విశ్లేషణకు కమిటీ!

Congress Party committee: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశం జరిగిన ఒక రోజు తరువాత, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

Congress Party: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ లో మొదలైన పోస్ట్ మార్టమ్..అశోక్ చవాన్ నేతృత్వంలో కారణాల విశ్లేషణకు కమిటీ!
Congress Party Committee
KVD Varma
|

Updated on: May 12, 2021 | 3:16 PM

Share

Congress Party committee: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశం జరిగిన ఒక రోజు తరువాత, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నేతృత్వంలోని 5 మంది సభ్యుల కమిటీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తుంది. చవాన్ తో పాటు, ఈ కమిటీలో సల్మాన్ ఖుర్షీద్, మనీష్ తివారీ, విన్సెంట్ హెచ్.పాలా, జోతి మణి ఉన్నారు. ఈ కమిటీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలను సందర్శించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలను సందర్శిస్తుంది . ఈ కమిటీ పార్టీ కార్యకర్తలతో, ఈ రాష్ట్రాల అగ్ర నాయకత్వంలోని అభ్యర్థులతో సంప్రదించి నివేదికను తయారు చేసి కాంగ్రెస్ అధిష్టానానికి సమర్పిస్తుంది.

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఇక్కడ కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చరిత్రలో మొదటిసారిగా ఇక్కడ ఒక్క సీటు కూడా రాలేదు. సీపీఐ(ఎం), మౌల్వి అబ్బాస్ సిద్దిఖీ పార్టీ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) లతో పాటు ఫుర్ఫురా షరీఫ్ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేసింది. ఇక్కడ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తన కోటాకు వచ్చిన అన్ని సీట్లనూ కాంగ్రెస్ కోల్పోయింది.

అస్సాం, కేరళలలో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నమ్మకంగా ఉండేది. కానీ, ఇది సాధ్యం కాలేదు. ఇక్కడ కూడా పార్టీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. పుదుచ్చేరిలో చివరిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత, పార్టీ ఇక్కడ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే, కాంగ్రెస్ తన భాగస్వామి డిఎంకేతో కలసి పదేళ్ల తర్వాత తమిళనాడులో తిరిగి అధికారంలోకి రావడం ఒక్కటే కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో ఉపశమనం కలిగించే విషయంగా చెప్పొచ్చు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరు చాలా నిరాశపరిచింది అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఓటమి నుండి పాఠం నేర్చుకోవలసిన అవసరం ఉందని అన్నారు. విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సీడబ్ల్యుసీ సమావేశంలో, బెంగాల్ లో కాంగ్రెస్ ఇన్‌ఛార్జి జితిన్ ప్రసాద్, ఐఎస్‌ఎఫ్‌తో పొత్తు రాష్ట్రంలో పార్టీ పేలవమైన పనితీరుకు కారణమని ఆరోపించారు. అస్సాంలో ఎఐయుడిఎఫ్‌తో కాంగ్రెస్ పొత్తును కూడా ఈ సమావేశంలో పలువురు తప్పుపట్టారు.

ఈ సమావేశంలో సోనియాగాంధీ, ”నేను ఒక కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఇది ఈ ఓటమి యొక్క ప్రతి అంశాన్ని పరిశీలిస్తుంది. కేరళ, అస్సాంలో మనం ఎందుకు ఓడిపోయామో అర్థం చేసుకోవాలి. బెంగాల్‌లో మనకు ఒక్క సీటు కోడా ఎందుకు రాలేదు తెలుసుకోవాలి. ఇవి చేదు అధ్యాయాలు, కాని మనం సత్యాన్ని ఎదుర్కోకపోతే, అలాగే సరైన వాస్తవాలను విస్మరిస్తే ఎప్పటికీ సరైన దారిలో నడవలేము.” అంటూ చెప్పుకొచ్చారు. ఇక కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఆజాద్ నేతృత్వంలో కాంగ్రెస్ 13 మందితో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీనికి మాజీ ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ నాయకత్వం వహించనున్నారు. టాస్క్ ఫోర్స్‌లో ప్రియాంక గాంధీ, అంబికా సోని, జైరామ్ రమేష్, రణదీప్ సుర్జేవాలా, పవన్ ఖేడా, శ్రీనివాస్ ఉన్నారు.

Also Read: ‘కోవిడ్ కోరలు చాస్తుంటే పాజిటివిటీపై ప్రాపగాండా’ , కేంద్రంపై రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్ నిప్పులు, ఇది వంచనేనని వ్యాఖ్య

AP Cabinet sub committee: ఇవాళ ఏపీ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం.. కరోనా పరిస్థితులపై ప్రధాన చర్చ