నీట్, జేఈఈ పరీక్షలపై గళమెత్తనున్న కాంగ్రెస్, రేపు దేశవ్యాప్త నిరసనలు
ఈ కరోనా తరుణంలో విద్యార్థులకు నీట్, జేఈఈ పరీక్షలనునిర్వహించడం సముచితం కాదని కాంగ్రెస్ ప్రకటించింది. వీటిని నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని...

ఈ కరోనా తరుణంలో విద్యార్థులకు నీట్, జేఈఈ పరీక్షలనునిర్వహించడం సముచితం కాదని కాంగ్రెస్ ప్రకటించింది. వీటిని నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు, జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎదుట ధర్నాలు, ప్రదర్శనలు జరుగుతాయని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రం యోచన అర్థరహితమైనదని, నియంతృత్వ వైఖరితో కూడినదని ఆయన ఆరోపించారు. కోవిడ్ ఇంకా తగ్గుముఖం పట్టని ఈ తరుణంలోనూ, అస్సాం, బీహార్ వంటి రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న ఈ సమయంలోను ఈ పరీక్షల నిర్వహణ వల్ల లక్షలాది విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన అన్నారు. మరోవైపు వీటిని వాయిదా వేయాలంటూ తాము సుప్రీంకోర్టుకెక్కుతామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. పలువురు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆమెతో ఏకీభవించారు.
అయితే నీట్, జేఈఈ పరీక్షలను నిర్వహించాలని అనేకమంది విద్యార్థుల నుంచి, తలిదండ్రుల నుంచి కూడా తమకు అభ్యర్థనలు అందాయని కేంద్రం చెబుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా విద్యార్థులు తమ్ అడ్మిట్ కార్డులను మా వెబ్ పోర్టల్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని కోరుతోంది.



