AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Horse Ride: గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే.. నెట్టింట్లో తెగ వైరల్ అయిన ఫోటోలు, వీడియోలు..

MLA Horse Ride: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ గుర్రంపై జార్ఖండ్ అసెంబ్లీకి వెళ్లారు.

MLA Horse Ride: గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే.. నెట్టింట్లో తెగ వైరల్ అయిన ఫోటోలు, వీడియోలు..
Shiva Prajapati
|

Updated on: Mar 09, 2021 | 3:35 PM

Share

MLA Horse Ride: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ గుర్రంపై జార్ఖండ్ అసెంబ్లీకి వెళ్లారు. రాంచీలోని అసెంబ్లీకి గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్లిన ఆమెను చూసి జనాలు షాక్ అయ్యారు. ఆమె వెంట పలువురు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న మీడియా సైతం ఆమెను చుట్టుముట్టింది. గుర్రం ఎక్కడిది? ఈ స్వారీ ఏంటి? అని ప్రశ్నించగా అసలు విషయం చెప్పుకొచ్చారు అంబా ప్రసాద్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, కల్నల్ రవి రాథోడ్ తనకు ఈ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారని ఆమె తెలిపారు.

‘నేను ఢిల్లీలో యూపీఎస్సీ కోసం సన్నద్ధమవుతున్న సమయంలో గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. ఆ సమయంలో కల్నల్ రవి రాథోడ్ తెలుసు. నేను ఎమ్మెల్యేను అయ్యానని తెలుసుకున్న రాథోడ్ గారు.. నాకు గుర్రాన్ని బహుమతిగా ఇస్తానని చెప్పారు. ఆమేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆయన నాకు గుర్రాన్ని బహుమతిగా ఇవ్వడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అర్జున అవార్డు గ్రహీత అయిన కల్నల్ రాథోడ్ భారత సైన్యంలోని 61వ అశ్వికదళ రెజిమెంట్ కమాండెంట్‌గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయన ప్రస్తుతం ఇండియన్ పోలో అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు. ఇండియన్ పోలో అసోసియేషన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. జార్ఖండ్‌లో గుర్రపు స్వారీని, పోలోను ప్రోత్సహిస్తాను’ అని అంబా ప్రసాద్ చెప్పుకొచ్చారు.

ఇక అంబా ప్రసాద్‌కు బహుమతిగా ఇచ్చిన గుర్రం రాజా జాతికి చెందినదిగా చెబుతున్నారు. ఈ జాతి గుర్రాలను మహారాజా ప్రతాప్ సింగ్ వంటి రాజులు ఉపయోగించేవారని అంటున్నారు. కాగా, ‘ఈ గుర్రంపై అసెంబ్లీకి స్వారీ చేయను. కానీ, గుర్రపు స్వారీ పట్ల నాకు మక్కువ ఉన్నందున తప్పనిసరిగా ఉదయాన్నే దీనిపై స్వారీ చేస్తాను. అలాగే గుర్రపు స్వారీ చేసేందుకు యువతను ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. రాష్ట్రంలో దీనికి సంబంధించి మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరచాలని అనుకుంటున్నాను’ అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. కాగా, ఎమ్మెల్యే అంబా ప్రసాద్ గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

అంబా ప్రసాద్ జార్ఖండ్‌లోని బార్కాగాన్‌ నియోజకర్గం నుంచి కాంగ్రెస్ శాసన సభ్యురాలుగా ఉన్నారు. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన వారిలో అంబా ప్రసాద్ కూడా ఒకరు. 2019లో జార్ఖండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబా ప్రసాద్ బార్కాగాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంబా ప్రసాద్ తండ్రి యేగేంద్ర ప్రసాద్ సావో. 2009లో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2013లో హేమంత్ సోరేన్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, 2014 సంవత్సరంలో అతనికి, మావోయిస్టులకు మధ్య సంబంధాలు ఉన్నాయని తేలడంతో యోగేంద్ర ప్రసాద్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే అతనిపై కేసులు నమోదు చేసి జైల్లో వేశారు.

దాంతో ప్రసాద్ అసెంబ్లీ పోల్ రేస్ నుంచి వైదొలిగాడు. అతని భార్య నిర్మల్ దేవిని బార్కాగాన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. ఆమె 2014లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే, విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ స్థాపన కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా ఆమె ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఆ ఘటనలో ఆమెను జైలుకు పంపారు. దంపతలిద్దరూ జైల్లో ఉండటంతో వారి కుమార్తె అంబా ప్రసాద్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అంబా ప్రసాద్.. తన సమీప ప్రత్యర్థి, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ అభ్యర్థి రోషన్‌లాల్ చౌదరిని 31 వేల ఓట్ల తేడాతో ఓడించింది. ఇక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె కోసం విస్తృతంగా ప్రచారం చేశారు.

ANI Tweet:

Also read:

Drugs Seized : లక్ష ద్వీప్ : భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. ఆరుగురు శ్రీలంక దేశీయుల అరెస్ట్.. డ్రగ్స్‌ విలువ ఎంతో తెలుసా..?

Sanjay Leela Bhansali : బాలీవుడ్‌లో మళ్ళీ కరోనా కలకలం.. సంజయ్ లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్, హోం క్వారంటైన్‌లో అలియా భట్