Shashi Tharoor: శశి థరూర్ ఆ పార్టీలో చేరనున్నారా? X పోస్ట్‌తో హింట్ ఇచ్చేసినట్టేనా..?
మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం జాతీయ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారన్న అంశంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శశి థరూర్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఓ ఫొటో రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటోతో ఆయన ఏ పార్టీలో చేరనున్నారో క్లారిటీ ఇచ్చేసినట్టేనన్న టాక్ వినిపిస్తోంది.

మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా? కాంగ్రెస్ పార్టీని వీడితే ఆయన ఏ పార్టీలో చేరుతారు..? జాతీయ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ హైకమాండ్, శశి థరూర్ మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ప్రధాని నరేంద్ర మోదీని మెచ్చుకోవడమే దీనికి కారణమన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దీనిపై ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌కు వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో..ఆయన కాంగ్రెస్‌ను వీడుతారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా ఉంది. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో థరూర్ షేర్ చేశారు. ఈ ఫొటోలో బ్రిటీష్ ట్రేడ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జొనాథన్ రెనాల్డ్స్ కూడా ఉన్నారు. ఈ పొటోతో శశి థరూర్ రాజకీయ భవితవ్యానికి సంబంధించిన ఊహాగానాలు జోరందుకున్నాయి. శశి థరూర్ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.
పార్టీలో తన పాత్ర ఏంటో స్పష్టం చేయాలని శశి థరూర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కోరారు. అయితే రాహుల్ గాంధీతో జరిగిన చర్చల్లో ఈ విషయంలో శశి థరూర్‌కి స్పష్టత రాలేదని తెలుస్తోంది. తాను పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. వద్దు అనుకుంటే తనకు ప్రత్యామ్నాయం కూడా ఉందంటూ శశి థరూర్ రెండ్రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధాని మోదీ అమెరికా పర్యటనను మెచ్చుకోవడంతో పాటు కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని కొనియాడుతూ థరూర్ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తాజా పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనన్న అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
శశి థరూర్ ట్వీట్..
Good to exchange words with Jonathan Reynolds, Britain’s Secretary of State for Business and Trade, in the company of his Indian counterpart, Commerce & Industry Minister @PiyushGoyal. The long-stalled FTA negotiations have been revived, which is most welcome pic.twitter.com/VmCxEOkzc2
— Shashi Tharoor (@ShashiTharoor) February 25, 2025
ఎంపీ శశి థరూర్ వరుసగా నాలుగు సార్లు కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యంవహిస్తున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం పట్టుబడుతూ 2002 అక్టోబర్‌లో జరిగిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేపై పోటీ చేసి ఆయన ఓడిపోయారు. గాంధీ కుటుంబం మద్దతుతో ఆ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో ఖర్గేకు 7,897 ఓట్లు దక్కగా.. శశి థరూర్ కేవలం 1,072 ఓట్లు సాధించారు.