AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారు డోర్లు లాక్ చేసి నిప్పంటించిన దుండగులు.. బీజేపీ నేత సజీవ దహనం!

ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. సోన్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్‌గోడి గ్రామంలో ఒక ఫార్చ్యూనర్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో బీజేపీ నాయకుడు భరత్ సింగ్ గహర్వార్ అలియాస్ లల్లా సింగ్ సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారు ప్రస్తుతం అంబికాపూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు.

కారు డోర్లు లాక్ చేసి నిప్పంటించిన దుండగులు.. బీజేపీ నేత సజీవ దహనం!
Bjp Leader Burned In Car
Balaraju Goud
|

Updated on: Jun 18, 2026 | 4:35 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. సోన్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్‌గోడి గ్రామంలో ఒక ఫార్చ్యూనర్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో బీజేపీ నాయకుడు భరత్ సింగ్ గహర్వార్ అలియాస్ లల్లా సింగ్ సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారు ప్రస్తుతం అంబికాపూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, మంగళవారం (జూన్ 16) రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. భరత్ సింగ్ తన సహచరులతో కలిసి రెండు వాహనాల్లో ప్రయాణిస్తుండగా, నవగై గ్రామం సమీపంలో దుండగులు వారిని అడ్డగించారు. ముందుగా ఒక టిప్పర్ ట్రక్కుతో ఫార్చ్యూనర్ వాహనాన్ని ఢీకొట్టిన దుండగులు, ఆ తర్వాత వాహనం తలుపులు మూసివేసి లోపల ఉన్నవారు బయటకు రాకుండా చేశారు.

అనంతరం వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం. మంటల నుంచి తప్పించుకునేందుకు లోపల ఉన్నవారు కారు విండోస్ పగలగొట్టి బయటకు రావడానికి ప్రయత్నించగా, వారిపై కూడా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో భరత్ సింగ్ తీవ్రంగా కాలిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు బాధితులు 40 నుంచి 60 శాతం వరకు కాలిన గాయాలతో బయటపడ్డారు. వారిని తొలుత బైకుంఠ్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం అంబికాపూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు. ఇప్పటివరకు నలుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో మొత్తం 30 మందికి పైగా ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు, మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సుర్గుజా రేంజ్ ఐజీ స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంబికాపూర్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరిస్తూ కేసును దర్యాప్తు చేస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్యామ్ బిహారీ జైస్వాల్ పేర్కొన్నారు. బాధ్యులెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us