Encounter: వరుస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతోన్న దండకారణ్యం.. 10 మంది మావోయిస్టుల హతం
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 10 మంది మావోయిస్టుల హతమయ్యారు. అయితే.. కంచుకోట లాంటి ఛత్తీస్‌గఢ్ అడువుల్లో భారీ ఎన్‌కౌంటర్లు.. మావోయిస్టుల ఉనికికే సవాల్ విసురుతున్నాయి.
వరుస ఎన్‌కౌంటర్లతో ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగుతోంది. దండకారణ్యం దద్దరిల్లుతోంది.. పచ్చని అటవీప్రాంతం ఎరుపెక్కుతోంది.. తాజాగా.. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. యాంటీ నక్సలైట్ ఆపరేషన్లో భాగంగా భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవులను భద్రతా బలగాలు జల్లెడ పట్టాయి. సుక్మా జిల్లా బండార్ పదర్ కొండల్లో ఒక దగ్గర మావోయిస్టులు నక్కి ఉన్నట్లు గుర్తించి వారిని చుట్టుముట్టారు. అయితే.. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. దాంతో.. 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలం నుంచి ఏకే 47, ఇన్సాస్, ఎస్‌ఎల్ఆర్‌లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆటోమెటిక్ ఆయుధాలతో పాటు విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు లభ్యమయ్యాయి.
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఏడాది కాలంగా భీకర పోరు జరుగుతోంది. ఫలితంగా వందలాది మంది మావోయిస్టులు హతమవుతున్నారు. వారం రోజుల క్రితం కూడా అబుజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఏప్రిల్ 2వ తేదీన బీజాపూర్ జిల్లా పొర్చెలి అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 9మంది మావోయిస్టులు మృతిచెందారు.
మొత్తంగా.. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యాన్ని నలువైపుల నుంచి పోలీసులు జల్లెడ పడుతుండడంతో సరిహద్దు రాష్ట్రాలు కూడా అలెర్ట్‌గా ఉంటుండడంతో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగులుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..