Ganga River: గంగా నదిలో కరోనా ఆనవాళ్లపై అధ్యయనం.. యూపీ, బీహార్‌లో పరిశోధనలు..
Ganga Water: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దీంతో దాదాపు నెలన్నర నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో ఇటీవల యూపీ, బీహార్ ప్రాంతాల్లో
Ganga Water: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దీంతో దాదాపు నెలన్నర నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో ఇటీవల యూపీ, బీహార్ ప్రాంతాల్లో గంగానదిలో పెద్ద ఎత్తున మృతదేహాలు కొట్టుకువచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గంగానది ఒడ్డున ఇసుకలో కూడా పెద్ద ఎత్తున శవాలు బయటపడ్డాయి. అవన్నీ కరోనా మృతులవేనన్న అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. గంగా నదిలో కరోనా మహమ్మారి ఆనవాళ్లను తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో దశలవారీగా అధ్యయనం చేపట్టనుంది. దీనిలో భాగంగా మొదటి దశలో యూపీలోని కన్నౌజ్, బీహార్‌లోని పాట్నా జిల్లాల్లోని 13 ప్రాంతాల నుంచి ఇప్పటికే నమూనాలను సేకరించినట్లు లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ డైరెక్టర్ సరోజ్ బాటిక్ సోమవారం వెల్లడించారు.
అధ్యయనం నిర్వహించే సమయంలో నీటిలో వైరస్‌ల ఆర్‌ఎన్‌ఏ ఉంటే ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని బాటిక్ తెలిపారు. ఈ పరీక్షల ద్వారా నీటిలో వైరస్ ఉనికి లభ్యమవుతుందని పేర్కొన్నారు. అయితే ఈ అధ్యయనం నది జీవ లక్షణాల పరిశీలనలో సైతం ఓ భాగమన్నారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంసీజీ) ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. నదిలో నీరు కలుషితం కాకుండా చూస్తున్నామని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఇటీవల కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ సైతం తెలిపారు. గంగానదిలో ఇటీవల కొట్టుకువచ్చిన మృతదేహాలన్నీ కరోనా మృతదేహాలని.. ప్రభుత్వంపై వివర్శలు వ్యక్తమయ్యాయి.
అయితే దేశంలోని పలు ప్రాంతాలకు గంగానదే ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. దీనిలోని నీరంతా కలుషితమైందనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. నదిలో వైరస్ ఉండే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ, అధ్యయనం చేపట్టాలనే నిర్ణయానికి వచ్చామని ఎన్‌ఎంసీజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీపీ మాధురియా పేర్కొన్నారు. సీఎస్‌ఐఆర్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, యూపీ, బీహార్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుల ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరుగుతోంది.
Also Read: