kaushal kishore: కూలీ వాడికైనా మీ కూతురును ఇవ్వండి కానీ అలాంటి వారికి మాత్రం వద్దు.. ఎమోషనల్ అయిన కేంద్ర మంత్రి.
మద్యానికి బానిసై జీవితాలను కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. మద్యం మత్తుకి చిత్తై తమ ఆరోగ్యాలను పాడు చేసుకోవడమే కాకుండా తమపై ఆధారపడి ఉన్న వారి జీవితాలను నాశనం చేస్తుంటారు కొందరు. ఇలాంటి వాళ్లకు ఎట్టి...

మద్యానికి బానిసై జీవితాలను కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. మద్యం మత్తుకి చిత్తై తమ ఆరోగ్యాలను పాడు చేసుకోవడమే కాకుండా తమపై ఆధారపడి ఉన్న వారి జీవితాలను నాశనం చేస్తుంటారు కొందరు. ఇలాంటి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేయకండి అని చెబుతున్నారు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో డీ అడిక్షన్‌పై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మద్యానికి బానిసైన అధికారి కంటే ఓ రిక్షా కార్మికుడు, లేదా కూలీ.. పెళ్లికొడుకుగా మంచి ఎంపిక అని వ్యాఖ్యానించారు. మద్యానికి బానిసై తన కుమారుడు చనిపోయిన చేదు సంఘటనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ.. ‘నేను ఒక ఎంపీగా, నా భార్య ఓ ఎమ్మెల్యేగా ఉండి కూడా మద్యానికి బానిసైన నా కొడుకును కాపాడుకోలేకపోయాం. నా కుమారుడిని డీ- అడిక్షన్ కేంద్రంలో చేర్చాం. అనంతరం మద్యం అలవాటును మానేశాడని భావించి ఆరు నెలలకే పెళ్లి చేశాం. అయితే మళ్లీ తాగడం మొదలు పెట్టాడు. దీంతో రెండేళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు అతని కుమారుడి వయసు కేవలం రెండేళ్లే. దీంతో అతి భార్య ఏకాకిగా మిగిలి పోయింది. కానీ మీరు మీ కుమార్తెలు, అక్కాచెల్లెళ్లను ఇటువంటి పరిస్థితి నుంచి కాపాడండి’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ప్రతీ ఏటా 20 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. 80 శాతం క్యాన్సర్ మరణాలకు.. పొగాకు, సిగరెట్లు, బీడీల అలవాటే కారణమని తెలిపారు. మద్యానికి, పొగాకు బానిసలుగా మారిన వారిని ఆదుకునేలా డీ-అడిక్షన్ కార్యక్రమాలను నిర్వహించాలని. ఇందులో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లో దీనిపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.



మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




