Edible Oil Prices: ఉక్రెయిన్- రష్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో గత కొన్ని రోజులుగా దేశంలో వంట నూనెల ధరలు మండుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇండోనేషియా లాంటి కొన్ని దేశాలు పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించడంతో వంటనూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే కొండెక్కిన వంట నూనెల ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కొన్ని రకాల వంట నూనెల ధరలపై పన్నుల్ని తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం క్రూడ్ పామాయిల్ దిగుమతులపై 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైందని వినికిడి.
కాగా భారతదేశం తన వంట నూనెల అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా సంభవిస్తోన్న కొన్ని పరిస్థితుల కారణంగా దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. వీటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలను తగ్గించింది. అయితే వీటివల్ల పెద్దగా ప్రయోజనం ఒనగూరలేదు. ఇంతలోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు మొదలయ్యాయి. మరోవైపు ఇండోనేషియా కూడా పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో ఒక్కసారిగా వంటనూనెల ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపించాయి. ఈక్రమంలోనే అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ తగ్గించడం ద్వారా వంట నూనెల ధరల్ని కాస్త తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. కొన్ని వస్తువులపై సాధారణంగా ఉండే పన్నుల కన్నా సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ సెస్‌ను వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఇప్పుడీ సెస్‌నే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అయితే సెస్ తగ్గింపుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, వ్యవసాయ, ఆహార మంత్రిత్వ శాఖలు ఎలాంటి ప్రకటనలు వెలువరించలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: