హత్య తర్వాతే అసలు నేరం! శవం మాయం చేస్తే.. సాక్ష్యం మాయం అవుతుందా? కేసులను ఎలా చేధిస్తున్నారు!
హత్య చేశాడు. అక్కడితో నేరం ముగిసిందనుకున్నాడు. కానీ.. అసలు నేరం అక్కడి నుంచే మొదలైంది. హత్య చేసిన తర్వాత నిందితుడి మొదటి ఆలోచన ఏంటి? శవాన్ని ఎక్కడ దాచాలి? ఎలా మాయం చేయాలి? సాక్ష్యాలు ఎలా చెరిపేయాలి? పోలీసులను ఎలా తప్పుదోవ పట్టించాలి? ఇదే హత్య తర్వాత నేరస్థులు ఆలోచించే విధానం.. మీర శవం మాయం చేసినంత మాత్రానా సాక్ష్యం మాయం అవుతుందా? వాళ్ల ఆలోచన కర్టేనా..?

కాల్చేయడం. నదిలో పడేయడం. పాతిపెట్టడం. ముక్కలు చేయడం. ప్రమాదంగా చిత్రీకరించడం.ఆత్మహత్యగా నమ్మించడం. చివరకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి తానే బాధితుడిలా నటించడం. ఇలా వంద ప్రయత్నాలు చేసి శవాన్ని మాయం చేయొచ్చు.. కానీ నిజాన్ని కాదు. ఇటీవల వెలుగులోకి వస్తున్న ఘటనలు ఇదే చెబుతున్నాయి. 2026లో గుజరాత్‌లో ఓ వ్యక్తిని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని పెట్రోల్‌తో కాల్చి, ఎముకలు, అవశేషాలను నదిలో పడేసిశారు.. అయితే మృతదేహం లేకపోయినా దర్యాప్తు మాత్రం ఆగలేదు.. ఎట్టకేలకు కేసును ఛేదించారు పోలీసులు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.
రీసెంట్‌గా హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోనూ కాలిపోయిన మృతదేహం కలకలం రేపింది. మృతుడిని మరోచోట చంపేసి, గుర్తుపట్టకుండా చేసేందుకే శవాన్ని తగలబెట్టినట్లు పోలీసులు అనుమానించారు.
లక్నోలో భార్యను హత్య చేసిన తర్వాత నిందితుడు మిస్సింగ్ కేసు పెట్టి.. ఆమె ఎవరితోనో వెళ్లిపోయిందని నమ్మించేందుకు యత్నించాడు. చివరకు మృతదేహం గోమతి నదిలో లభించడంతో అసలు కథ బయటపడింది.
ఇదే తరహాలో గోరఖ్‌పూర్‌లో చేతులు, కాళ్లు కట్టేసి ఓ వ్యక్తి మృతదేహాన్ని సంచిలో పెట్టి నది ఒడ్డున పడేశారు. గుర్తింపు ఆలస్యం కావాలన్నదే నిందితుల ఉద్దేశమని పోలీసులు అనుమానించారు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది.
అంటే.. శవం కనిపించకపోతే కేసు ఉండదా? శవం కాలిపోతే ఆధారాలు కాలిపోతాయా? నదిలో పడేస్తే నిజం కొట్టుకుపోతుందా?
ఫోరెన్సిక్ ముందు నేరగాడి ఎత్తులు చిత్తు!
శరీరం కాలిపోయినా ఎముకలు మిగులుతాయి. నీటిలో పడేసినా DNA ఆధారాలు దొరికే అవకాశం ఉంటుంది. గుర్తు తెలియని శవమైనా దంతాలు, ఎముకలు, DNA, వేలిముద్రలు, టాటూలు, దుస్తులు, వ్యక్తిగత వస్తువులు గుర్తింపునకు ఉపయోగపడతాయి. గుజరాత్‌లో నదిలో లభించిన కుళ్లిపోయిన మృతదేహాన్ని DNA పరీక్ష ద్వారా గుర్తించిన ఘటన కూడా దీనికి ఉదాహరణ.
పోస్టుమార్టంలో తలకు, ముఖానికి గాయాలు ఉన్నట్లు తేలడంతో హత్య కోణం వెలుగులోకి వచ్చింది. అంటే నిందితుడు ఎంత ప్లాన్ చేసినా.. శవం మాట్లాడుతుంది. ఆధారాలు మాట్లాడతాయి. ఫోరెన్సిక్ మాట్లాడుతుంది.
దేశంలో హత్యల లెక్క ఎంత?
NCRB 2023 గణాంకాల ప్రకారం దేశంలో 27,721 హత్య కేసులు నమోదయ్యాయి. హత్యలకు ప్రధాన కారణాల్లో వివాదాలు ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2023లో 922 హత్య కేసులు నమోదయ్యాయి. 2024లో ఆ సంఖ్య 898కి తగ్గింది. అయితే అక్రమ సంబంధాలు, లైంగిక అసూయకు సంబంధించిన హత్యలు మాత్రం APలో 2023లో 156 నుంచి 2024లో 195కి పెరిగాయి. 2024లో ఈ కేటగిరీలో దేశంలోనే AP మొదటి స్థానంలో నిలిచిందని NCRB ఆధారిత నివేదికలు చెబుతున్నాయి. తెలంగాణలో 2024లో ఇలాంటి హత్యలు 98 నమోదయ్యాయి.
ఇక్కడ మరో పెద్ద ప్రశ్న ఉంది. ఎన్ని హత్యలు జరిగాయి అన్నదే కాదు. ఎన్ని హత్యలను ప్రమాదాలు, ఆత్మహత్యలు, మిస్సింగ్ కేసులుగా మార్చే ప్రయత్నం జరిగింది? దీనిపై ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సమగ్ర గణాంకం అందుబాటులో లేదు.
ఆధారాల వేట
నిందితుడు శవాన్ని కాల్చాడా? ఎక్కడికి తీసుకెళ్లాడు? ఏ వాహనంలో తరలించాడు? ఎవరికి ఫోన్ చేశాడు? ఫోన్ లొకేషన్ ఎక్కడ ఉంది? CCTVలో ఏం కనిపించింది? శవం దొరికిన చోట రక్తపు మరకలు ఉన్నాయా? కారు, బైక్‌లో ఏమైనా ఆధారాలున్నాయా? ఇలా ఒక్కో ఆధారాన్ని కలిపితే.. నేరగాడు దాచిన కథ బయటపడుతుంది. అందుకే హత్య తర్వాత ఆధారాలే కీలకం అవుతాయి.
BNSలో Section 238 కింద నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయడం లేదా నిందితుడిని కాపాడేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం. మరణశిక్షకు గురయ్యే నేరానికి సంబంధించిన ఆధారాలను మాయం చేస్తే గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు, జరిమానా ఉండొచ్చు. అంటే.. హత్య చేసినవాడే కాదు.. హత్యను దాచేందుకు సహకరించినవాడూ చట్టం నుంచి తప్పించుకోలేడు.
చట్టంలో లోపం ఎక్కడ?
హత్యను దాచేందుకు శవాన్ని మాయం చేసిన కేసుల్లో ప్రధాన నేరం నిరూపించడానికి ముందు నుంచే ఆధారాలు కావాలి. శవం దొరకకపోయినా హత్యను నిరూపించడం అసాధ్యం కాదు.. కానీ దర్యాప్తు మరింత కష్టమవుతుంది. అందుకే ప్రతి అనుమానాస్పద మిస్సింగ్ కేసును కేవలం “మిస్సింగ్”గా చూడకుండా.. రిస్క్-బేస్డ్ ఇన్వెస్టిగేషన్ అవసరం.
ఫోన్ అకస్మాత్తుగా ఆఫ్ అవ్వడం, బ్యాంక్ లావాదేవీలు ఆగిపోవడం, CCTVలో చివరి కదలిక, వాహనం అసాధారణంగా ప్రయాణించడం, కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లలో తేడాలు వంటి అంశాలు కనిపిస్తే వెంటనే క్రైమ్ సీన్, సైబర్, ఫోరెన్సిక్ టీమ్‌లను రంగంలోకి దించాలి.
హత్యలు తగ్గాలంటే ఏం చేయాలి?
హత్య జరిగిన తర్వాత నిందితుడిని పట్టుకోవడం కంటే హత్య జరగకముందే ప్రమాద సంకేతాలను గుర్తించడం ముఖ్యం. కుటుంబ గొడవలు, ఆస్తి వివాదాలు, ప్రేమ, అక్రమ సంబంధాలు, పాత కక్షలు, బెదిరింపులు, అదృశ్యమైన వ్యక్తులపై ఫిర్యాదులపై పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి జిల్లాలో Missing–Murder Link Cell ఏర్పాటు చేయాలి. అనుమానాస్పద మిస్సింగ్ కేసులను హత్య కేసులతో క్రాస్-చెక్ చేయాలి. ప్రతి అనుమానాస్పద మృతదేహానికి DNA ప్రొఫైలింగ్, డిజిటల్ ఫోటో రికార్డు, దంత/ఎముక వివరాలు నమోదు చేసే వ్యవస్థ ఉండాలి.
చివరి మాట..
హత్య చేసినవాడు శవాన్ని కాల్చొచ్చు. నదిలో పడేయొచ్చు. గుర్తులు చెరిపేయొచ్చు. ఆత్మహత్యగా చిత్రీకరించొచ్చు. కానీ..ఒక నేరాన్ని దాచేందుకు మరో నేరం చేస్తే.. ఆధారాలు మరింత పెరుగుతాయి. అందుకే ఇప్పుడు ప్రశ్న “హత్య ఎవరు చేశారు?” అన్నదొక్కటే కాదు. “హత్య తర్వాత ఆధారాలను ఎవరు మాయం చేశారు? అదే అసలు క్రైమ్ స్టోరీ. శవాన్ని మాయం చేయడం సాధ్యమే కావచ్చు. కానీ ఫోరెన్సిక్ కళ్ల నుంచి నిజాన్ని దాచడం అంత తేలిక కాదు.
కొండవీటి శివనాగరాజు
టీవీ9, డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్.
