గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అక్కడ పాగా వేయాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కరెన్సీ నోట్లపై దేవతల బోమ్మలు ముద్రించాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటో స్థానంలో.. హిందూ దేవతలైన లక్ష్మీదేవి, గణపతి చిత్రాలను ముద్రించాలని కేజ్రీవాల్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. మహాత్మాగాంధీ చిత్రాన్ని కొనసాగిస్తూనే.. నోటుకు మరోవైపు దేవతల చిత్రాలను ముద్రించాలంటూ వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. దేవతల చిత్రాలు కరెన్సీ నోట్లపై ముద్రిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందంటూ బీజేపీని విమర్శించారు. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి భారీగా పతనం అవుతున్న నేపథ్యంలో బీజేపీని విమర్శించేందుకు కేజ్రీవాల్ ఈ అస్త్రాన్ని ఉపయోగించారు.
అసలు కేజ్రీవాల్ ఏమన్నారంటే.. ‘‘నేను చెప్పినట్లు మన దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మనం చాలా కృషి చేయాలి దానితో పాటు, మనకు దేవుళ్ళు, దేవతల నుంచి కూడా ఆశీస్సులు అవసరం. కరెన్సీ నోట్లపై, ఒక వైపు గణేష్ జీ, లక్ష్మి జీ, మరొక వైపు గాంధీజీ ఫోటో ఉంటే దేశం మొత్తం ఆశీర్వాదం పొందుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇండోనేషియాను కూడా ఉదాహరణ గా పేర్కొన్నారు. ఇక్కడ లార్డ్ గణేష్ చిత్రం కొన్ని కరెన్సీలలో భాగమంటూ తెలిపారు.
అయితే, కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. కేజ్రీవాల్, తన ప్రభుత్వ లోపాలు, ఆమ్ ఆద్మీ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అనే ఆలోచనలను ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇదొక రాజకీయ నాటకం అంటూ మండిపడింది. అయితే.. ఈ వ్యాఖ్యల అనంతరం కరెన్సీ నోట్లపై ఏ బొమ్మ ఉండాలన్న విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రామమందిరంపై అభ్యంతరం వ్యక్తం చేసిన వారు కొత్త ముసుగు వేసుకుని వచ్చారంటూ బీజేపీ నేత మనోజ్ తివ్రీ విమర్శించారు.
బీజేపీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ మహాత్మా గాంధీని పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు.
ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే.. మహాత్మా గాంధీ, లక్ష్మీదేవి, గణపతి చిత్రాలు కాదు.. మా ప్రాంత వీరుడి బొమ్మ అయితే కరెన్సీ నోట్లపై మంచిగా ఉంటుందని పేర్కొనడం.. ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు మహారాష్ట్రకంకవ్లీ ఎమ్మెల్యే మిస్టర్ రాణే ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రూ.200 కరెన్సీ నోటుపై మహాత్మాగాంధీ స్థానంలో మరాఠా ఐకాన్ ఛత్రపతి శివాజీ ఫొటోతో మార్ఫింగ్ చేసిన నోటును ట్విట్టర్‌లో షేర్ చేశారు. భారతీయ కరెన్సీ నోటు రూపాన్ని మార్చాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన సూచనపై స్పందించిన బీజేపీ నాయకుడు నితీష్ రాణే.. ఈ ఫొటో అయితే పర్ఫెక్ట్ అంటూ.. ఛత్రపతి శివాజీ ఫొటోతో ఉన్న నోటును షేర్ చేశారు.
కన్‌కావ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే షేర్ చేసిన పోస్ట్..
Ye perfect hai ! ? pic.twitter.com/GH6EMkYeSN
— nitesh rane (@NiteshNRane) October 26, 2022
అయితే.. కరెన్సీ నోట్ల గురించి దేశంలో తరచూ చర్చ జరుగుతూ వస్తోంది. కరెన్సీ నోట్లపై మహాత్ముని స్థానంలో భగత్ సింగ్, నేతాజీ, పలువురు రాజకీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల ఫొటోలతో నోట్లను ముద్రించాలని పలువురు డిమాండ్ చేసేవారు. అయితే.. కరెన్సీ నోట్లపై గాంధీతోపాటు ఇతర ప్రముఖుల చిత్రాలను ముద్రించాలన్న కొందరి ప్రతిపాదనపై 2010లోనే ఆర్బీఐ నిపుణుల కమిటీని సైతం వేసింది.
స్వాతంత్య్ర సమరయోధులు, భారతరత్న అవార్డు గ్రహీతలు, ప్రముఖ క్రీడాకారులు, ఎంపిక చేసిన మేధావుల చిత్రాలతో కరెన్సీ నోట్లను ముద్రించాలన్న ప్రతిపాదనలపై ఈ కమిటీ.. పూర్తి వివరాలు సేకరించి అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి పూర్తి నివేదికను ఇచ్చింది. కమిటీ సూచనల మేరకు భారత్‌కు గాంధీకంటే గొప్ప ప్రతినిధి, విలువగల వ్యక్తి ఎవరూ లేరని.. కరెన్సీ నోట్లపై ఆయన ఒక్కరి చిత్రమే ఉంటుందని యూపీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వివరాలను 2019లో ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) సమాచారం కింద ఆర్బీఐ వెల్లడించింది.
భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు ఆంగ్లేయులు కరెన్సీ నోట్లపై కింగ్ జార్జ్ చిత్రాలను ముద్రించేవారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. 1950 జనవరి 26న గణతంత్ర రాజ్యంగా మారింది. అప్పటి నుంచి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నోట్లను ముద్రిస్తోంది. ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. 1949లో భారత ప్రభుత్వం మొదటిసారి రూపాయి నోటు డిజైన్‌ను రూపొందించింది. బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ చిత్రానికి బదులు మహాత్మా గాంధీ బొమ్మతో డిజైన్‌ను రూపొందించిన.. దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో గాంధీ బొమ్మకు బదులు అశోక స్తంభం ముద్రించారు.
దాని ప్రకారమే ముద్రించేవారు కానీ.. రంగులు మార్పు చేసేవారు. అన్ని నోట్లకు వెనుక వైపు పడవల బొమ్మ ఉండేది. 1954లో రూ. 1000, రూ.2000, రూ.10,000 నోట్లను తీసుకొచ్చి.. తిరిగి 1978లో రద్దు చేశారు. మళ్లీ కరెన్సీ నోట్ల డిజైన్లలో మార్పులు తీసుకొచ్చి.. రూ. 2, రూ. 5 నోట్లపై జింకలు, సింహాల బొమ్మలను ముద్రించారు. ఆ తర్వాత పలు బొమ్మలను కూడా ముద్రిస్తూ వచ్చారు.
మహాత్మా గాంధీ శత జయంతి సందర్భంగా 1969లో తొలిసారి కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మను ముద్రించారు. సేవాగ్రామ్ ఆశ్రమం ముందు మహాత్మా గాంధీ కూర్చొని ఉన్న చిత్రాన్ని వెనుకవైపు అచ్చు వేశారు. 1975 నుంచి రూ.100 నోట్లపై పలు చిత్రాలను కూడా ముద్రించారు.
అయితే.. అప్పటివరకు ఉన్న బొమ్మల స్థానంలో 1996 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలతో మహాత్మా గాంధీ ఫొటోతో ఉన్న సిరీస్ నోట్ల ముద్రణను ఆర్‌బీఐ చేపట్టింది. అంధులు కూడా గుర్తుపట్టేలా నోట్లను డిజైన్‌ను మార్చారు. 2000 అక్టోబర్ 9 నుంచి వెయ్యి నోట్లు ముద్రించడం మొదలు పెట్టారు. అయితే.. 2016లో నరేంద్ర మోడీ.. పెద్ద నోట్లను (రూ.500, రూ.1000) రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానంలో కొత్త 500, 2000 నోటును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నోట్లపై కూడా బాపూజీ బొమ్మనే కొనసాగించారు.
కేజ్రీవాల్ చేసింది బీజేపీని విమర్శించేందుకైనా.. ప్రాంతాల వారిగా కరెన్సీ నోట్లపై బొమ్మల డిమాండ్ వస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు.. మహారాష్ట్ర.. ఆ తర్వాత మరే ఏ రాష్ట్రం నుంచి డిమాండ్ వస్తుందోనని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..