నా బ్యాగులో బాంబ్ ఉంది.. జై శ్రీరామ్, అల్లాహు అక్బర్ అంటూ విమానంలో ప్రయాణికుడి హల్చల్!
వారణాసి నుండి బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక కెనడియన్ ప్రయాణీకుడు తన బ్యాగులో బాంబు ఉందని బెదిరించడంతో విమానం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రన్‌వేలో నిలిచిపోయింది. అధికారులు విమానాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. బాంబు కనిపించకపోవడంతో ప్రయాణీకుడిని అరెస్టు చేశారు.

విమానంలో ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబ్ ఉందంటూ అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఇప్పటికే కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం బాధ, కోపం, భయంతో ఉంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలో చోటు చేసుకున్న ఈ ఘటన మరింత కలకలం రేపింది. బాంబు భయం కారణంగా విమానం అర్థరాత్రి నుండి తెల్లవారుజాము వరకు నిలిచిపోయింది. ఈ సమయంలో రన్‌వేను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న కెనడియన్ పౌరుడు యోహనాథన్ నిషికాంత్ తన బ్యాగులో బాంబ్ ఉందని బెదిరించాడు. దీంతో ఒక్కసారిగా అధికారులు అలెర్ట్ అయ్యారు.
మూడు గంటల పాటు దర్యాప్తు చేసిన తర్వాత, ఆ సమాచారం వదంతి అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. యోహనాథన్ నిషికాంత్‌ను ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు అదుపులోకి తీసుకొని ఫుల్పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఫుల్పూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు కెనడియన్ పౌరుడు యోహనాథన్ నిషికాంత్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. అసలేం జరిగిందంటే.. శనివారం రాత్రి ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం 6E-499 రాత్రి 10:24 గంటలకు బయలుదేరాల్సి ఉంది, అంటే షెడ్యూల్ చేసిన సమయం కంటే కొంచెం ఆలస్యంగా. ఇంతలో, కెనడియన్ పౌరుడు జోనాథన్ తన సీటును వదిలి వచ్చి ముందు వరుసలో కూర్చున్నాడు. సిబ్బంది అతన్ని తన సీటుకు తిరిగి వెళ్ళమని అడిగినప్పుడు, అతను కోపంగా ఉండి నా బ్యాగులో బాంబు ఉందని అరిచాడు.
అంతే కాదు.. ‘అల్లా హు అక్బర్’, ‘జై శ్రీరామ్’ ‘హర్ హర్ మహాదేవ్’ అని గట్టిగా నినాదాలు చేశాడు. అతను అలా అరుస్తుంటే.. విమానంలో భయానక వాతావరణం నెలకొంది. దీని తరువాత, పైలట్ వెంటనే విమానాన్ని రన్‌వే నుండి వెనక్కి తిప్పాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం గురించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చాడు. విమానాన్ని తిరిగి ఆప్రాన్ వద్దకు తీసుకువచ్చి, విమానాన్ని ఖాళీ చేయించారు. దీని తరువాత, భద్రతా సిబ్బంది మొత్తం విమానంతో సహా మొత్తం విమానాశ్రయంలో సోదాలు నిర్వహించారు. కెనడియన్ పౌరుడుని అదుపులోకి తీసుకున్నారు. బాంబు దొరక్కపోవడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




