కిట్టి పార్టీలతో పైసా డబుల్..! ఏకంగా రూ.30కోట్లు కొట్టేసిన బెంగళూరు సవిత..
ఈజీ మనీ కోసం కొంతమంది రకరకాల మోసాలకు పాల్పడుతుంటారు. డబ్బు సంపాదించడమే టార్గెట్‌గా వారు పనిచేస్తారు. గతంలో ఐశ్వర గౌడ అనే మహిళ డీకే శివకుమార్ తెలుసంటూ పలువురి నుంచి కోట్లలో వసూల్ చేసింది. ఈ ఘటన మరవక ముందే అంతకుమించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్లు ఉంటారు. ఇది మూవీ డైలాగ్ మాత్రమే కాదు నిజంగానూ ఎన్నోసార్లు రుజువైంది. మోసానికి కాదేది అనర్హం అన్నట్లుగా ప్రస్తుత రోజులు నడుస్తున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా చాలా మంది రాజకీయ నాయకులు తెలుసంటూ గతంలో ఐశ్వర్య గౌడ అనే మహిళ కోట్ల రూపాయలు మోసం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా జనాల్లో పెద్దగా మార్పు రాదన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అటువంటిదే మరో ఘటన జరిగింది. అది కూడా కర్ణాటకలోనే జరగడం గమనార్హం. తనకు అనేక మంది రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ సవిత అనే మహిళ డబ్బున్న మహిళలతో ఫ్రెండ్ షిప్ చేసేది. కిట్టి పార్టీలతో వారిందరినీ పిలిచేది. ఈ క్రమంలోనే తాను చెప్పినట్లు పెట్టుబడులు పెడితే కోట్ల లాభం వస్తుందని తన చుట్టూ ఉన్నవారిని నమ్మించింది. చివరకు అసలు విషయం తెలిసి ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కుసుమ అనే మహిళకు ఎన్నో ఏళ్లుగా సవితతో స్నేహం ఉంది. 2020 నుంచి ఇద్దరు మహిళల మధ్య డబ్బు మార్పిడి జరుగుతోంది. 2023లో సవిత కుసుమకు ఫోన్ చేసి తన భర్త పనిచేస్తున్న దుబాయ్‌లో బంగారం ధరలు తక్కువగా ఉన్నాయంటూ ఒక ఆఫర్ ఇచ్చింది. రెండేళ్లపాటు బంగారంలో పెట్టుబడి పెడితే.. నాలుగు రెట్లు ఎక్కువ డబ్బు పొందొచ్చని నమ్మించింది. దీంతో కుసుమ రూ.24లక్షల పెట్టుబడి పెట్టింది. 2024 ఉదయ టీవీ ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని.. చెప్పడంతో మరో 10లక్షలు పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత సవిత.. కుసమకు అప్పుడప్పుడు కొంత డబ్బు ఇచ్చింది. అయితే గత నెలలో తన 95లక్షలు ఇవ్వాలని కుసుమ డిమాండ్ చేయగా.. ఇచ్చేది లేదని సవిత తేల్చి చెప్పింది. నీలాగే చాలా మంది డబ్బులు పెట్టారని.. వారెవ్వరికి ఇవ్వనని తెలిపింది.
చివరకు మోసపోయానని గ్రహించిన కుసుమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సవితతో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు. సవిత గతంలోనూ ఇటువంటి నేరాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. దాదాపు 20 మంది దగ్గర రూ.30కోట్లు వసూల్ చేసినట్లు గుర్తించారు. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




