AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Crisis: డేంజర్‌ బెల్స్‌.. ఎండిపోయిన వేలాది బోర్లు.. ఒక్కో వాటర్‌ ట్యాంకర్‌ రూ.6 వేలు..

సమ్మర్‌ రాకముందే బెంగళూరుకు గొంతెండిపోతోంది. దాహం దాహం అంటూ అల్లాడుతోంది. నీటి చుక్క కోసం బెంగ పెట్టుకుంది. వేల సంఖ్యలో బోర్లు ఎండిపోవడంతో.. ఇండియన్‌ సిలికాన్‌ సిటీ భోరుమంటోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాటర్‌ రేషన్‌ విధానాన్ని అమలు చేస్తోంది కర్నాటక సర్కార్‌.

Water Crisis: డేంజర్‌ బెల్స్‌.. ఎండిపోయిన వేలాది బోర్లు.. ఒక్కో వాటర్‌ ట్యాంకర్‌ రూ.6 వేలు..
Water Crisis In Bengaluru
Shaik Madar Saheb
|

Updated on: Feb 19, 2025 | 8:35 AM

Share

ఎండా కాలం రాక ముందే బెంగళూరు తీవ్రమైన తాగు నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. వాటర్‌ ట్యాంకర్‌ రేటు రూ. 750 నుంచి 1200కి పెంచింది కర్నాటక సర్కార్‌. ఇక ప్రైవేట్‌ వాటర్‌ ట్యాంకర్‌ అయితే..రూ. 6 వేలు వసూలు చేస్తున్నారు. దూరం పెరిగితే రేటు భారం మరింత పెరిగిపోతోంది. ఇక నగరంలో తాగునీటి వాడకంపై ఆంక్షలు విధించారు. వాటిని ఉల్లంఘిస్తే పెనాల్టీ వేస్తున్నారు. ఆ తప్పును రిపీట్‌ చేస్తే…డబుల్ పెనాల్టీలతో వాయిస్తున్నారు. చుక్క నీటిని కూడా ఒడిసి పట్టుకుని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు సూచిస్తోంది కర్నాటక సర్కార్‌.

రూ. 5 వేలు జరిమానా..

వేసవి వచ్చేసరికి బెంగళూరులో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాగునీటిని పొదుపు చేసే చర్యల్లో భాగంగా బెంగళూరు జలమండలి సరికొత్త నిర్ణయం తీసుకుంది. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే రూ.5 వేలు జరిమానా వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాలను శుభ్రం చేసేందుకు, గార్డెనింగ్‌ కోసం, రోడ్లు-భవన నిర్మాణ పనులకు తాగునీటిని వినియోగించినా… సినిమా థియేటర్లు, మాల్స్‌లో ఇతర అవసరాలకు వాడినా జరిమానా తప్పదని ఉత్తర్వుల్లో హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి వాటర్‌ బోర్డ్‌ చట్టంలోని సెక్షన్‌ 109 ప్రకారం జరిమానా విధిస్తారు. పదేపదే అదే తప్పు చేస్తే మరో రూ.5 వేలు అదనంగా జరిమానా పడుతుంది అని సిటీ వాటర్‌ బోర్డు స్పష్టం చేసింది.

గత వేసవిలో తీవ్ర నీటి సంక్షోభం

ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇక మార్చి వస్తే…మూర్ఛ పోయే రేంజ్‌లో ఎండలు దంచి కొడతాయి. ఇక మే, జూన్‌ నెలల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇప్పటికే బెంగళూరులో తాగు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ఇక గత వేసవిలో బెంగళూరు మహానగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాగేందుకు సరిపడా నీరు లేక సిలికాన్‌ సిటీ వాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వేసవిని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక సర్కార్‌ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. తాగునీటిని వృథా చేస్తే భారీ జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది.

పాతాళానికి పడిపోయిన భూగర్భ జలమట్టం

ఇక మంగళవారం నాడు బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఈమధ్య కాలంలో వర్షపాతం లేకపోవడంతో భూగర్భ జలాలు ఎండిపోయినట్లు సిటీ వాటర్‌ బోర్డు తెలిపింది. రాబోయే రోజుల్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు నీటిని వృథా చేయకుండా అవసరమైన మేరకే వాడుకోవాలని సూచించింది.

గత వేసవిలో బెంగళూరు మహానగరం తీవ్రమైన తాగు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో…నగర ప్రజలు నిలువు దోపిడీకి గురయ్యారు. అప్పట్లో నగరం రోజుకు 300 నుంచి 500 మిలియన్‌ లీటర్ల మంచినీటి కొరతను ఎదుర్కొంది. ఇదే అదునుగా చూసుకుని ప్రైవేట్‌ వాటర్‌ ట్యాంకర్ల ఓనర్లు దోపిడీకి పాల్పడ్డారు. ట్యాంకు నీటికి రూ.వేలల్లో ఛార్జ్‌ చేశారు. ఇప్పుడు మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రాబోయే వేసవిలో తీవ్ర తాగు నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని బెంగళూరు వాసులు, ఇప్పట్నించే బెంగ పెట్టుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..