Azadi Ka Amrit Mahotsav: దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగ’.. జాతీయ జెండా గౌరవాన్ని పెంచేలా కేంద్రం ప్రణాళిక..
దేశ ప్రజలు తమ ఇళ్ల వద్ద జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగ' (Har Ghar Tiranga) ప్రచారాన్ని ప్రారంభించనుంది.
Azadi Ka Amrit Mahotsav: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏడాది పాటు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా దేశ ప్రజలు తమ ఇళ్ల వద్ద జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగ’ (Har Ghar Tiranga) ప్రచారాన్ని ప్రారంభించనుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ (Independence Day 2022) ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరగుతున్నాయి.
భారత జాతీయ జెండా మొత్తం జాతికి, జాతీయ గర్వానికి చిహ్నం.. జాతీయ జెండాను గౌరవాన్ని పెంచడం కోసం ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమానికి ఆమోదం తెలిపారు. ప్రతిచోటా జాతీయ జెండాను ఎగురవేయడానికి భారతీయులను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమం జరగనుంది. త్రివర్ణ పతాకంతో వ్యక్తిగత అనుబంధం, జాతీయ భావాన్ని పెంచడంతోపాటు దేశ నిర్మాణం పట్ల మన నిబద్ధతకు ప్రతిరూపంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది. ప్రజల హృదయాలలో దేశభక్తి భావనను ప్రేరేపించడం, జాతీయ జెండా గురించి అందరిలో అవగాహనను ప్రోత్సహించడం దీని లక్ష్యం.
ప్రతిఒక్కరూ భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించడం, ఎగురవేయడం అనేది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 మార్గనిర్దేశం చేస్తోంది. ఫ్లాగ్ కోడ్ చట్టం అనేది.. జాతీయ జెండా ప్రదర్శన కోసం అనుసరించాల్సిన నియమనిబంధనలు, మార్గదర్శకాలను తెలుపుతుంది. ఇది కొన్ని ప్రాంతాల్లో, సభల్లో జాతీయ జెండా ప్రదర్శనను నియంత్రిస్తుంది. ప్రైవేట్, పబ్లిక్, ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయవచ్చు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 26 జనవరి 2002 నుండి అమలులోకి వచ్చింది.
గత ఏడాది డిసెంబర్‌లో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002ను సవరించి.. పాలిస్టర్ లేదా మెషిన్‌తో తయారు చేసిన జాతీయ జెండా ప్రదర్శనకు అనుమతించారు. ఇప్పుడు జాతీయ జెండాను హ్యాండ్‌స్పన్, చేతితో నేసిన లేదా యంత్రంతో తయారు చేసిన వాటిని ప్రదర్శించవచ్చు. పత్తి, పాలిస్టర్, ఉన్ని, పట్టు, ఖాదీతో తయారు చేసినది అయి ఉండాలి.
జాతీయ జెండా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. అది ఏ పరిమాణంలో అయినా ఉండవచ్చు. కానీ జెండా పొడవు, వెడల్పు నిష్పత్తి 3:2 ఉండాలి.
ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం.. జాతీయ జెండా ప్రదర్శన జెండా గౌరవానికి భంగం కలగకుండా ఉండాలి. సాధారణ ప్రజానీకం,ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థల సభ్యులు జాతీయ జెండాను ప్రదర్శించడంపై ఎటువంటి పరిమితి ఉండదు.
జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..