Azadi ka Amrit Mahotsav: బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన అల్లూరి.. దేశం కోసం 27 ఏళ్లకే ప్రాణ త్యాగం చేసిన మన్యం వీరుడు
గిరిజనులకు జరుగుతునం అన్యాయానికి వ్యతిరేకంగా బ్రిటిష్ పాలకులపై పోరాడిన ధీరుడు అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ వారిపై యుద్ధం చేసి.. వారి గుండెల్లో నిద్రపోయిన కేవలం 27 ఏళ్లకే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన విప్లవీరుడు.
Azadi ka Amrit Mahotsav: బ్రిటీష్ పాలనలో గిరిజనులపై జరుగుతున్న దౌర్జన్యాలు, అన్యాయాలను చూసిన ఓ వ్యక్తి హృదయం రగిలిపోయింది. బ్రిటిష్ పాలకులతో పోరాటం చేసి వాళ్ళ గుండెల్లో నిద్రపోయాడు. బ్రిటీష్ పాలకులపై అతిపెద్ద గిరిజన పోరాటమైన రాంపా తిరుగుబాటును ప్రకటించాడు. విల్లు, బాణాలు ఎక్కుపెట్టి.. విప్లవకారుడిగా మారి బ్రిటీష్‌వారి మూలాలను కదిలించాడు. అతనే గిరిజనుల పాలిట దేవుడు.. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు. రాంపా తిరుగుబాటు సమయంలో అనేక బ్రిటీష్ పరిపాలన సంస్థలు, పోలీసు స్టేషన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడి చేసి.. వారి ఆయుధాలను దోచుకుని వారిపైనే తిరుబాటు చేసిన ధీరుడు. ఈ అల్లూరి సీతారామ రాజు విశిష్టతను పాక్షిక పాత్ర ద్వారా ఇటీవల విడుదలైన RRR చిత్రంలో పొందుపరిచాడు చిత్ర దర్శకుడు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపించి మెప్పించాడు. ఈ సినిమా కథ కల్పితమే కానీ పాత్ర .. అతని పేరు నిజమైన సీతారాం రాజు నుండి ప్రేరణ పొందింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకుందాం..
18 ఏళ్లకే సన్యాసం:
సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు స్వగ్రామం. అయితే అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4న విజయనగరం దగ్గర పాండ్రంగి గ్రామంలో తన తాతగారైన మందలపాటి శ్రీరామరాజు ఇంట (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, బ్రిటిష్ రాజ్ కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీ) జన్మించారు. అతని తండ్రి పేరు వెంకట రామరాజు, తల్లి పేరు సూర్యనారాయణమ్మ. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో గోదావరి జిల్లా నర్సాపూర్‌లోని మేనమామ రామకృష్ణంరాజు వద్ద పెరిగారు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక, అల్లూరి తన సోదరి , సోదరుడితో కలిసి విశాఖపట్నం వెళ్లారు. అయితే సీతారామరాజు గ్రాడ్యుయేషన్ నాల్గవ సంవత్సరంలో అకస్మాత్తుగా వదిలి సన్యాసం స్వీకరించారు.
గిరిజనుల అణచివేతకు వ్యతిరేకంగా గళం అల్లూరి సీతారామరాజు సన్యాసిగా మారిన అనంతరం విశాఖపట్నం, గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లోని అడవుల్లోని గిరిజనులపై జరుగుతున్న అకృత్యాలను కళ్లారా చూశారు. నిజానికి.. బ్రిటిష్ పాలకుల కాలంలో.. మద్రాసు అటవీ చట్టం 1882లో ఆమోదించబడింది. ఈ చట్టంలో గిరిజనులు సంప్రదాయ పోడు వ్యవసాయం చేయరాదని, కాంట్రాక్టర్లు ఈ గిరిజనులను కూలీలుగా పెట్టుకోవాలని, నిరాకరించిన వారి దగ్గర నుంచి కౌలు వసూలు చేయాలనీ.. కౌలు చెల్లించని వారికి శిక్షలు వంటివి పొందుపరిచాడు. ఈ అకృత్యాలను, గిరిజనులపై జరుగుతున్నా దౌర్జన్యాలను అల్లూరి చూశారు. బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
అల్లూరి సీతారామ 1920లో నిరసన పద్ధతిని మొదలు పెట్టాడు. మన్యం వాసుల కష్టాలను కడతేర్చడం కోసం.. తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. గిరిజనులకు అటవీ సంపదపై ఉన్న హక్కులను వివరించి.. ధైర్యాన్ని పెంపొందించాడు. అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. దీంతో బ్రిటిష్ పాలకులకు సమాంతరంగా అల్లూరి సీతారామరాజు వివాదాల పరిష్కారం కోసం కోర్టుని నడిపేవాడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది వివాద పరిష్కారాలకు వచ్చేవారు. దీంతో చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు అల్లూరి నాయకుడయ్యాడు
రంపా తిరుగుబాటు ప్రకటించారు 1922లో ఆయుధాలు చేపట్టి రంపా తిరుగుబాటును ప్రకటించాడు అల్లూరి. గోదావరి జిల్లాలతో పాటు చుట్టుపక్కల గిరిజనులను సంఘటితం చేసి, అనేక పోలీసు పోస్టులపై దాడి చేశాడు.. అక్కడ ఉన్న ఆయుధ సామాగ్రిని ఎత్తుకుని వెళ్ళిపోయేవారు. బ్రిటీష్ రాజ్ పోలీసు స్టేషన్లపై దాడి చేసి అనేక మంది బ్రిటిష్ అధికారులను చంపాడు. అప్పటి వరకు గిరిజనులు ఆంగ్లేయులతో విల్లు బాణాలతో పోరాడేవారు.. అయితే ఈ రంపా తిరుగుబాటు సమయంలో పోలీస్ స్టేషన్ల నుంచి మందుగుండు సామాగ్రి, తుపాకులు దోచుకెళ్లి వాటి సాయంతో గిరిజనులతో కలిసి బ్రిటిష్వారిపై పోరాటం ప్రారంభించారు. ఆదివాసీలు, ఇతర గ్రామస్తులు ఆయనకు పూర్తి మద్దతు ఇచ్చారు.
‘మన్యం వీరుడు గా బిరుదు అల్లూరి సీతారామ రాజు రంపా తిరుగుబాటు సమయంలో గెరిల్లా యుద్ధ వ్యూహాన్ని అనుసరించారు. ఆ సమయంలో గిరిజనులు అతనికి మన్యం వీరుడు అనే బిరుదును ఇచ్చారు. వరుసగా రెండేళ్లు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. రాంపా తిరుగుబాటును అణిచివేసేందుకు బ్రిటీష్ వారు అనేక ప్రయత్నాలు చేసినా అవి విజయవంతం కాలేదు. గిరిజనుల మద్దతు కారణంగా, అతను బ్రిటిష్ వారి నుండి తప్పించుకుంటూ.. వారిపై తీవ్ర పోరాటం చేశారు.
27 ఏళ్ల వయసులోనే వీరమరణం: అల్లూరి సీతారామ రాజు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా విల్లు, బాణంతో బ్రిటిష్ వారితో పోరాడారు. 1924 సంవత్సరంలో రూధర్ ఫర్డ్ ఆధ్వర్యంలో మేజర్ గుడాల్ చింతపల్లె అడవుల్లో సీతారామ రాజుని పట్టుకున్నారు. కొరుయూరు గ్రామంలో చెట్టుకు కట్టేసి . రాజుని కాల్చి చంపాడు. మే 8 న రాజు దేహాన్ని ఫోటో తీయించి తరవాత దహనం చేసారు. ఈ విప్లవ వీరుడు కేవలం 27 ఏళ్ల వయసులో దేశం కోసం తన ప్రాణత్యాగం చేశారని చరిత్రకారుల అభిప్రాయం.
అల్లూరి సీతారామరాజు జయంతి ప్రతి సంవత్సరం జూలై 4న ఆంధ్ర ప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు జయంతిని పండుగగా జరుపుకుంటారు. ఆయన స్మారకం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణదేవిపేట గ్రామంలో ఉంది. 1986లో, భారత ప్రభుత్వం స్వాతంత్య్ర పోరాటానికి ఆయన చేసిన ధైర్యసాహసాలకు గౌరవసూచకంగా పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 9 అక్టోబర్ 2017న పార్లమెంటు ప్రాంగణంలో సీతారామరాజు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..