Amit Shah: ప్రతిభ, సేవతోనే పురస్కారాలు వరిస్తున్నాయి.. స్వర్ణభారత్‌ ట్రస్ట్ వార్షికోత్సవంలో హోంమంత్రి అమిత్ షా

ప్రతిభ, సేవతోనే ఇప్పుడు పద్మ పురస్కారాలు వరిస్తున్నాయి. అతి సామాన్య గిరిజనులు పద్మశ్రీ పొందడం చూస్తున్నాం. కాళ్లకు చెప్పులు లేని సామాన్యులు రాష్ట్రపతి భవన్‌కు వస్తున్నారు’’ అని అమిత్‌షా అన్నారు

Amit Shah: ప్రతిభ, సేవతోనే పురస్కారాలు వరిస్తున్నాయి..  స్వర్ణభారత్‌ ట్రస్ట్ వార్షికోత్సవంలో హోంమంత్రి అమిత్ షా
Amit Shah Venkaiah
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 14, 2021 | 2:34 PM

Amit Shah AP tour: ప్రతిభ ఉంటే పురస్కారం నడుచుకుంటూ వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. గతంలో సిఫార్సుల మేరకే పద్మ పురస్కారాలు దక్కేవి. ప్రతిభ, సేవతోనే ఇప్పుడు పద్మ పురస్కారాలు వరిస్తున్నాయి. అతి సామాన్య గిరిజనులు పద్మశ్రీ పొందడం చూస్తున్నాం. కాళ్లకు చెప్పులు లేని సామాన్యులు రాష్ట్రపతి భవన్‌కు వస్తున్నారు’’ అని అమిత్‌షా అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టు 20వ వార్షికోత్సవానికి వెంకయ్యనాయుడితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ఎన్నో ఉన్నతస్థాయి పదవులు అనుభవించిన వెంకయ్య మాతృభూమి పట్ల ప్రేమను మరువలేదని కొనియాడారు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థుల కోసమే ఆలోచించేవారు. వెంకయ్య స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడాలన్న నా అభిలాష నెరవేరిందన్నారు.

భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాలా కృషి చేశారన్న అమిత్‌ షా.. కేంద్ర మంత్రి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనేక కీలక పదవులకు వన్నె తెచ్చారన్నారు. ‘‘ 370 రద్దు బిల్లు ఆమోదంలో వెంకయ్యనాయుడు కీలకపాత్ర పోషించారు. స్వర్ణభారత్‌ ట్రస్టు.. వెంకయ్యనాయుడి గొప్ప ఆలోచన. రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని ఆయన పరితపిస్తుంటారు. ప్రజా సేవకే అంకితమైన సేవలను మరిచిపోలేనివని అమిత్ షా తెలిపారు.

అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యమో.. సేవాలయానికి వెళ్తే అంతే పుణ్యమన్నారు. సేవే అసలైన మతమని ప్రగాఢంగా నమ్ముతానని చెప్పారు. స్వర్ణభారత్‌ ట్రస్టు ద్వారా తెలుగు భాష రక్షణ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. గ్రామీణ మహిళలకు ఒకేషనల్‌ కోర్సుల కోసం కొత్త భవనం అందుబాటులోకి తెచ్చామని, దివ్యాంగుల్లోని ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

అన్నదాతలైన రైతులపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. గ్రామీణ యువతే దేశానికి ఆశాకిరణాలు. యువతకు శిక్షణ ఇచ్చి సొంతకాళ్లపై నిలబడేలా చేయాలి. వారికి తగినంత ప్రోత్సాహమిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. మహిళలు ఇంకా చాలా అంశాల్లో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించాలన్నదే నా ఆకాంక్ష. మాతృభాష, మాతృభూమిని మర్చిపోవద్దు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి. సొంత ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అని వెంకయ్య అన్నారు.

Read Also…  580 సంవత్సరాల తర్వాత కనిపించే సుదీర్ఘమైన చంద్రగ్రహణం.. ఎప్పుడు.. ఎక్కడ కనిపిస్తుందో తెలుసుకోండి..