Ashwini Vaishnaw: ఈ-స్పోర్ట్స్‌కు ప్రోత్సాహం.. గేమింగ్ కంపెనీలతో ఐటీ మంత్రితో కీలక చర్చ
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు ప్రజల డబ్బును సురక్షితంగా ఉంచేందుకు, నిబంధనలు పాటిస్తూ అభివృద్ధి చెందేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ-గేమింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ-స్పోర్ట్స్ (eSports), సోషల్ గేమ్స్‌ను ప్రోత్సహించే మార్గాలపై చర్చ జరిగింది.

దేశంలో వేగంగా పెరుగుతున్న ఆన్‌లైన్ గేమింగ్ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ గేమింగ్ రంగాన్ని నియంత్రణలో ఉంచుతూ, ప్రజలకు నష్టాలు కలగకుండా చూసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం ఆన్‌లైన్ గేమింగ్ రంగ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ-స్పోర్ట్స్ (ఇంటర్నెట్ ద్వారా ఆడే పోటీ గేమ్స్), మరియు స్నేహితులతో ఆడే సామాజిక గేమ్స్ (సోషల్ గేమ్స్) అభివృద్ధి గురించి ముఖ్యంగా చర్చించారు.
ఇటీవల ఆన్‌లైన్ గేమ్స్ విపరీతంగా పాపులర్ అవుతున్నాయి. కొందరు వీటిలో డబ్బు పెట్టి ఆడుతూ నష్టపోతున్నారు. ఇతర మోసాలు కూడా జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ రంగాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ముందడుగు వేసింది. ఈ సమావేశంలో మూడు ప్రధాన విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఆన్‌లైన్ గేమింగ్‌ను ఎలా సురక్షితంగా ఉంచాలి?, డబ్బు పెట్టి ఆడే వినియోగదారుల డబ్బు ఎలా కాపాడాలి?, గేమింగ్ కంపెనీలు భారతదేశ చట్టాలను ఎలా పాటిస్తున్నాయో సమీక్షించాలి…? అనే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ రంగం అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం. కానీ అదే సమయంలో ప్రజలకు నష్టం రాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులు పెట్టిన డబ్బు ఎలాంటి మోసాలకు గురికాకుండా ఉండేలా గేమింగ్ కంపెనీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త చట్టాలకు అనుగుణంగా మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. చట్టాలను గౌరవిస్తూ, నిబంధనలు పాటిస్తూ, ప్రజల డబ్బును కాపాడుతూ వ్యవహరించడమే ఈ రంగానికి భవిష్యత్తులో బలమని అధికారులు భావిస్తున్నారు.
ఆన్‌లైన్ గేమింగ్ రంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు ఉపాధిని, ఆదాయాన్ని కలిగిస్తోంది. కాబట్టి దీనిని సరైన మార్గంలో తీసుకెళ్లడం ద్వారా యువతకు మంచి అవకాశాలు అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆటలు ఆడడమే కాదు, వాటిని రూపొందించే టెక్నాలజీ రంగంలో కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




