Priyanka Gandhi: ఏఐసీసీలో మార్పులు చేర్పులకు కసరత్తు..! ప్రియాంకకు కీలక పదవి..?
వరుస ఓటములతో కాంగ్రెస్ శ్రేణులు ఢీలాపడుతున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్కస్థానంలోనూ గెలవలేకపోయింది. ఢిల్లీలో హ్యాట్రిక్ జీరో స్థానాలతో ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో మరికొన్ని మాసాల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు మంచుకొస్తున్నాయి. 2026లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీలో కీలక మార్పులు చేర్పులకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఆత్మపరిశీలన మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఏఐసీసీ నాయకత్వంలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి నాయకత్వ మార్పులను ప్రకటించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కసరత్తు చేస్తున్నారు. మార్పుల్లో భాగంగా వాయనాడ్ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.. పూర్వవైభవం దిశగా దూసుకెళ్తున్నామని భావించింది. కానీ ఆ విజయానికి ఇండి కూటమిలో 30కి పైగా పార్టీల బలం తోడైందని గ్రహించలేకపోయింది. ఆ వెంటనే జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన జమ్ము-కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విజయం సాధించగా.. ఒంటరిగా పోటీ చేసిన హర్యానాలో చతికిలపడింది. మహారాష్ట్రలో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసినప్పటికీ ప్రత్యర్థి కూటమిని ఎదుర్కోలేకపోయింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఒంటరి పోరుతో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2015 నుంచి ఢిల్లీలో జరిగిన వరుస మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతాయే తెరవలేకపోయింది.
నిలకడగా పేలవమైన ప్రదర్శన చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు అవసరమని అగ్రనేతలు భావిస్తున్నారు. మరికొన్ని మాసాల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది(2026) అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు ఏఐసీసీలో కీలక మార్పులు, చేర్పుల అత్యవసరం కావడంతో ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మధ్య అనేక రౌండ్ల సమావేశాలు జరిగాయి. కొన్ని సమావేశాల్లో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు.
వేణుగోపాల్ బాధ్యతల వికేంద్రీకరణ
కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో “ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC)” అధ్యక్షుడి తర్వాత అత్యంత శక్తివంతమైన పదవి ఏదైనా ఉందంటే అది సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పదవే. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ ఆ బాధ్యతలు నెరవేర్చుతున్నారు. అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC)కి కూడా చైర్మన్‌గా ఉన్నారు. ఈ రెండింటిలో ఒక బాధ్యతను మరొకరికి అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. అయితే, కేరళ కాంగ్రెస్ ఎన్నికల బాధ్యతలు చేపట్టే వరకు ఆయన తన పదవిలో కొనసాగవచ్చని తెలిసింది.

Congress Party
తెలంగాణ ఇంఛార్జ్ మార్పు..?
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవుల్లోకి మరో నలుగురు లేదా ఐదుగురిని కొత్తగా తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఇప్పటికే ప్రధాన కార్యదర్శులుగా ఉన్నవారిలో కొందరిని తొలగించే అవకాశం కూడా లేకపోలేదు. వారి పనితీరు ఆధారంగా ఈ మార్పులు, చేర్పులు ఉంటాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు వివిధ రాష్ట్రాలకు ఇంచార్జులుగా వ్యవహరిస్తుంటారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణతో పాటు బిహార్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, అస్సాం రాష్ట్రాల ఇంచార్జుల మార్పులు కూడా ఉంటాయని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే మరో 8 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను కూడా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. అధ్యక్ష మార్పు జరిగే రాష్ట్రాల్లో ఒడిశా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు తదితర రాష్ట్రాలున్నాయి. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌ను అస్సాంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించనున్నట్టు తెలిసింది. కర్ణాటకలో కూడా డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. వీటిలో పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని మరొకరికి అప్పగించవచ్చు. జార్ఖండ్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్‌ను ఆయన సొంత రాష్ట్రం జమ్మూ కాశ్మీర్‌కు పంపించే అవకాశాలున్నాయి.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా గిడుగు రుద్రరాజు?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షుడిగా వైఎస్ షర్మిల కంటే ముందు పనిచేసిన గిడుగు రుద్రరాజును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా తీసుకునే అవకాశం ఉంది. ఆయన ఇది వరకు ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా రాష్ట్ర కో-ఇంచార్జి బాధ్యతల్ని నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగంలో ఉన్న రుద్రరాజును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా తీసుకుని ఏదో ఒక రాష్ట్ర బాధ్యతల్ని అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రియాంక గాంధీ వాద్రాకు కీలక పదవి?
అలాగే వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. గతంలో ఉత్తర్ ప్రదేశ్ ఇంచార్జిగా వ్యవహరించిన ఆమెకు ప్రస్తుతం ఏ బాధ్యతలూ లేవు. ఈ పరిస్థితుల్లో ప్రియాంకకు మార్పులు, చేర్పుల్లో భాగంగా కీలక బాధ్యతలు అప్పగిస్తారని విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏదైనా ఒక రాష్ట్ర ఇంచార్జిగా లేదా ఎన్నికల నిర్వహణ / ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్టు పార్టీ నేతలు ఊహిస్తున్నారు.
అటు పార్టీ హైకమాండ్‌కు సన్నిహితులుగా భావిస్తున్న బీకే హరిప్రసాద్, సచిన్ రావు, మీనాక్షి నటరాజన్, బీవీ శ్రీనివాస్, పర్గత్ సింగ్, అజయ్ కుమార్ లల్లు, హరీష్ చౌదరి, జిగ్నేష్ మేవాని, కృష్ణ అలవారు, మహ్మద్ జావేద్, అభిషేక్ దత్, ప్రకాష్ జోషి, గణేష్ గొడియాల్ వంటి అనేక మంది నాయకులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది. అలాగే రణదీప్ సింగ్ సుర్జేవాలా, భూపేశ్ భగేల్, టీఎస్ సింగ్ దేవ్, భన్వర్ జితేంద్ర సింగ్ లేదా అశోక్ గెహ్లాట్ కూడా పార్టీలో కొత్త బాధ్యతలు అప్పగించవచ్చని చర్చ జరుగుతోంది. ఏఐసీసీ కమ్యూనికేషన్స్ విభాగం సెక్రటరీ జనరల్ జైరామ్ రమేష్ స్థానంలో మరొకరిని నియమించాలని కూడా పార్టీ భావిస్తోంది. అయితే సీనియారిటీ పరంగా ఆయనకు మరో ప్రత్యామ్నాయాన్ని హైకమాండ్ ఇప్పటి వరకు గుర్తించలేకపోయింది. దీంతో మరికొన్నాళ్లు ఆయన్ను ఈ బాధ్యతల్లో కొనసాగించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.