MUDA row: ముడా భూముల వివాదంతో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కీలక నిర్ణయం..!
ముడా భూముల వివాదం కారణంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు కర్నాటక సర్కార్ కేటాయించిన ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు .
కర్నాటకలో ముడా భూముల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం కారణంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు కర్నాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ కేటాయించిన ఐదు ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు.
రాహుల్ ఖర్గే నేతృత్వంలోని సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ప్రభుత్వం బగలూరులోని హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ హార్డ్‌వేర్ సెక్టార్‌లో ఐదుకరాల భూమిని మంజూరు చేయడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ అవినీతికి ఇది పరాకాష్ట అని బీజేపీ విమర్శించింది. సిద్ధార్థ విహార్ ట్రస్టులో మల్లికార్జున్ ఖర్గే, ఆయన అల్లుడు రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే ట్రస్టీలుగా ఉన్నారు. అయితే ఈ స్థలం కేటాయింపులో అవకతవకలు, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దినేష్ కల్లహల్లి అనే వ్యక్తి కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
అయితే కర్నాటక ప్రభుత్వం మాత్రం ఎలాంటి అక్రమాలు జరగలేదని వివరణ ఇచ్చింది. రాహుల్ ఖర్గే దరఖాస్తు ప్రకారం అర్హతలు పరీక్షించిన తరువాతే మెరిట్ ఆధారంగా భూమి కేటాయించినట్లు పేర్కొంది. గత కొంతకాలంగా కర్నాటక క రాజకీయాల్లో ముడా స్కామ్‌పై దుమారం చెలరేగుతోంది. సీఎం సిద్దరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి , ఇతర బంధువులపై కేసు నమోదయ్యింది. ఈడీ కూడా సిద్దరామయ్య కుటుంబసభ్యులపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..