Man died with Manja : ప్రాణం తీసిన మాంజా దారం.. బైక్ వస్తుండగా గొంతు తెగి యువకుడి మృతి
మహారాష్ట్రలో గాలిపటాలు ఎగురవేసే మాంజాతో గొంతు తెగి ఓ యువకుడు మరణించాడు
Man died with Manja: ఊరంతా సంక్రాతి పండగ జరుపుకుంటుంటే.. మరోవైపు సంక్రాంతి సరదాలు ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చాయి. గాలిపటాలు ఎగురవేసే మాంజాతో గొంతు తెగి ఓ యువకుడు మరణించాడు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పండగ వేళ కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
అజ్నిలోని ధ్యానేశ్వర్ నగర్‌కు చెంది ప్రణయ్ ప్రకాశ్(20) మంగళవారం తన తండ్రితో కలిసి పనిమీద బయటకు వెళ్లారు. పని ముగిసిన తర్వాత ఇద్దరూ వేర్వేరు బైక్‌లపై తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇద్దరూ జట్టారోడి స్క్వేర్ దాటుతున్న సమయంలో.. ప్రణయ్ మెడకు పదునైన పతంగి మాంజా దారం చుట్టుకుంది. బైక్‌పై వేగంగా వస్తున్న ప్రణయ్ గొంతును మాంజా దారం కోసేసింది. క్షణాల్లోనే బైక్‌పై నుంచి ప్రణయ్ కిందపడిపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ప్రణయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కాగా, పంతంగి మాంజా వినియోగంపై ఇప్పటికే చాలా రాష్ట్రాలు నిషేధం విధించాయి. ప్రమాదరకరమైన చైనా మాంజాను వాడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా ప్రజలు పట్టించుకోకుండా ఇలాంటి పదునైన దారాలతోనే పంతగులు ఎగురవేస్తూ.. ప్రమాదాలకు కారణమవుతున్నారు.
Read Also… Chinese manja Banned: చైనా మాంజాపై అటవీ శాఖ నిషేధం.. అమ్మినా.. కొన్నా.. ఏడేళ్ల జైలు శిక్ష..!