Sanitizer: తమిళనాడులో దారుణం.. ప్రాణం తీసిన ఆట సరదా.. శానిటైజర్ మంటలకు బలైన బాలుడు..
Sanitizer: తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సరదా ఆట ఓ బాలుడి ప్రాణం తీసింది. శానిటైజర్ మంటలకు
Sanitizer: తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సరదా ఆట ఓ బాలుడి ప్రాణం తీసింది. శానిటైజర్ మంటలకు పసివాడు బలైపోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచ్చిలోని ఈబి రోడ్‌లోని భారతినగర్‌లో నివాసం ఉంటున్న బాలమురుగన్ చిన్న కొడుకు శ్రీరామ్. 8వ తరగతి చదువుతున్న శ్రీరామ్.. తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. ఈ ఆటలో భాగంగా తన సహచర మిత్రులకు జాక్ ఫ్రూట్ విత్తనాలను ఉడకబెట్టి ఇవ్వాలని అనుకున్నాడు. ఇందుకోసం పొయ్యి ఏర్పాటు చేసేందుకు కట్టెలు, రాళ్లను సేకరించాడు.
అలా కట్టెల పొయ్యిని ఏర్పాటు చేశాడు. మిగతా స్నేహితులు ఇతర పదార్థాలు తీసుకురాగా.. శ్రీరామ్ పొయ్యిని వెలిగించే పనిలో నిమగ్నమయ్యాడు. అయితే, చెక్కలకు మంటలు అంటుకోకపోవడంతో.. శ్రీరామ్ తన ఇంటి నుంచి శానిటైజర్ బాటిల్ తీసుకువచ్చాడు. కట్టెలపై పోసి నిప్పు పెట్టాడు. అప్పుడు చిన్నగా మంట అంటుకోవడంతో ఆ మంటను మరింత పెంచేందుకు శ్రీరామ్ ఆ శానిటైజర్‌ను నేరుగా మంటలపై స్ప్రే చేశాడు. ప్రమాదవశాత్తు ఆ మంటలు శానిటైజర్ బాటిల్‌కు అంటుకున్నాయి. దాంతో ఆ శానిటైజర్ బాటిల్ పేలింది. ఈ పేలుడు ధాటికి శ్రీరామ్‌కు మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న శ్రీరామ్‌ని గమనించిన స్థానికులు.. వెంటనే అతనిపై నీరు పోసి మంటలను ఆర్పేశారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీరామ్‌ను తిరుచ్చిలోని ఎంజిఎంజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. మంటల తీవ్రత అధికంగా ఉండటంతో.. శ్రీరామ్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలకు శానిటైజర్‌ను దూరంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, బాలుడు మృతిలో అతని కుటుంబంలో పెను విషాదం నెలకొంది. బాలుడు చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.