AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ప్రాంతాల్లో పహారా కాస్తున్న భారత సైనికులకు తొలిసారి అందుబాటులోకి 4G, 5G సేవలు!

భారత సైన్యం సరిహద్దుల్లోని అత్యంత ఎత్తైన ప్రాంతాలలో మోహరించిన సైనికులకు 4జి, 5జి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. గల్వాన్, సియాచిన్ వంటి ప్రాంతాల్లోని సైనికులు తమ కుటుంబాలతో సులభంగా సంబంధం కలిగి ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది మనోధైర్యాన్ని పెంచుతుంది మరియు డిజిటల్ అంతరాన్ని తగ్గిస్తుంది.

ఆ ప్రాంతాల్లో పహారా కాస్తున్న భారత సైనికులకు తొలిసారి అందుబాటులోకి 4G, 5G సేవలు!
5g Siachen Glacier
SN Pasha
|

Updated on: Apr 20, 2025 | 10:56 AM

Share

చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో అత్యంత ఎత్తైన ప్రాంతాలలో దేశానికి రక్షణగా నిలుస్తున్న భారత సైనికులకు తొలిసారి 4G, 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. గల్వాన్, సియాచిన్ గ్లేసియర్‌తో సహా ప్రపంచంలోని అత్యంత దుర్భరమైన భూభాగాల్లో మోహరించిన సైనికులు ఇప్పుడు తమ కుటుంబాలతో నిత్యం టచ్‌లో ఉండేందుకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. 18 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో కట్-ఆఫ్ పోస్టులలో పనిచేస్తున్న సైనికులకు ఈ సేవలు మనోధైర్యాన్ని పెంచుతాయని సైనిక అధికారులు అంటున్నారు. దౌలత్ బేగ్ ఓల్డీ (DBO), గాల్వన్, డెమ్‌చోక్, చుమార్, బటాలిక్, ద్రాస్, సియాచిన్ హిమానీనదం వంటి భూభాగాలలో మోహరించిన దళాలకు ఇప్పుడు 4G, 5G కనెక్టివిటీ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

తూర్పు లడఖ్, పశ్చిమ లడఖ్, సియాచిన్ హిమానీనదంలోని ముందు స్థానాలతో సహా లడఖ్‌లోని మారుమూల ఎత్తైన ప్రాంతాలలో డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, మారుమూల కమ్యూనిటీలకు సాధికారత కల్పించడంలో ఇది ఒక పరివర్తనాత్మక ముందడుగు అని భారత సైన్యం అభివర్ణించింది. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ గ్లేసియర్‌పై 5G మొబైల్ టవర్‌ను విజయవంతంగా ఏర్పాటు చేయడం ఒక చారిత్రాత్మక మైలురాయి అని జమ్మూకు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ PRO లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బార్త్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదంతా భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవతో సాధ్యం అయింది. భారత సైన్యపు బలమైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (TSP) ఈ సేవలు అందిస్తున్నాయి.

ఈ సినర్జీని సాధ్యం చేయడంలో ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ప్రముఖ పాత్ర పోషించిందని, ఫలితంగా ఆర్మీ మౌలిక సదుపాయాలపై బహుళ మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. వీటిలో లడఖ్, కార్గిల్ జిల్లాల్లోనే నాలుగు కీలక టవర్లు ఉన్నాయి. ‘ఫస్ట్ విలేజెస్’ (సరిహద్దుల వెంబడి ఉన్నవి) ను జాతీయ డిజిటల్ నెట్‌వర్క్‌లో అనుసంధానించడం ద్వారా, ఈ ప్రయత్నం డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంచడం, సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించడం, వైద్య సహాయం, అత్యవసర సేవలను మెరుగుపరచడం, విద్యా ప్రాప్తిని ప్రారంభించడం, స్థానిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం, సరిహద్దు గ్రామాల నుండి వలసలను నిరోధించడంలో కీలక పాత్ర పోషించనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..