Child Care: మీ పిల్లలు ఎత్తు, బరువు పెరగాలనుకుంటున్నారా?.. అయితే వీటిని క్రమం తప్పకుండా తినిపించండి..
పిల్లలను ఆరోగ్యంగా ఉంచడానికి తల్లిదండ్రులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. వారు శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు మంచి పోషకాహారం అందిస్తుంటారు.

పిల్లలను ఆరోగ్యంగా ఉంచడానికి తల్లిదండ్రులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. వారు శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు మంచి పోషకాహారం అందిస్తుంటారు. అయితే ఒక్కోసారి పిల్లలకు ఎంత మంచి ఆహారం తినిపించినప్పటికీ వారి ఎదుగుదలలో పెరుగుదల కనిపించదు. బరువు కూడా పెరగరు. కొందరు పిల్లలు మరీ బక్కచిక్కిపోయి కనిపిస్తుంటారు. ఇందుకు ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడమే. ముఖ్యంగా కరోనా కాలంలో ఆన్ లైన్ తరగతుల కారణంగా పిల్లలు ఇంటి నుంచి బయటకు రావడం బాగా తగ్గిపోయింది. అందుకే పిల్లలకు పోషకాహారం అందిస్తున్నా ఎత్తు, బరువు పెరగలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు తరచూ పిల్లలకు తినిపిస్తే అందులోని పోషకాలు పిల్లల ఎత్తు, బరువును పెంచుడంలో బాగా తోడ్పడుతాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
అరటిపండ్లు..
పిల్లలను ఆరోగ్యంగా ఉంచడంలో అరటిపండును మించింది లేదు. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. అరటిపండులోని గుణాల గురించి చెప్పాలంటే.. ఇందులో పొటాషియం, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, బి6 పుష్కలంగా లభిస్తాయి. ఎత్తు, బరువు తక్కువగా ఉన్న పిల్లలకు రోజూ ఒక అరటిపండు తినిపించండి. పిల్లలు అరటి పండ్లను నేరుగా తీసుకోవడానికి మారాం చేస్తుంటే బనానా షేక్ తయారుచేసి ఇవ్వొచ్చు. బనానా షేక్‌లో బరువును పెంచే గుణాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
నెయ్యి
నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు 6 నెలల వయసు దాటిన తర్వాత నెయ్యిని తినిపించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అన్నం, కిచిడీ, గంజిలో కొంచెం నెయ్యి కలిపి పిల్లలకు తినిపిస్తే మంచి ఫలితముంటుంది. రుచిగా ఉంటుంది కాబట్టి పిల్లలు మరీ మరీ దీనిని తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అదేవిధంగా రాగులను నెయ్యితో కలిపి కూడా ఇవ్వవచ్చు. కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న రాగులు పిల్లల ఎదుగుదలలో బాగా తోడ్పడతాయి.
గుడ్డు
గుడ్డులో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల కండరాలను బాగు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక పిల్లలు ఆమ్లెట్‌ను ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గుడ్డుతో పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే ఆమ్లెట్‌కు బదులుగా ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వడం ఉత్తమం. ముఖ్యంగా అందులో పచ్చసోనను పిల్లలకు బాగా తినిపించాలి.
బెల్లంతో చేసిన ఉండలు
ఈ దేశీ వంటకం చాలా తక్కువ మందికి తెలుసు. కానీ పిల్లల ఎత్తు, బరువు పెంచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. ఇవి తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. పిల్లలకి రోజూ తినడానికి సరైన మొత్తంలో బెల్లం ఉండలు ఇవ్వండి. అలాగే పిల్లలకు కొద్ది కొద్దిగా శారీరక శ్రమను పరిచయం చేయించండి. వారి పనులు వారే చేసుకునేలా చేయండి. ఇన్‌డోర్ గేమ్స్ కు బదులు అవుట్ డోర్ గేమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వండి.
Also Read:TTD: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. మార్చి 10న విదేశీ నాణేల ఈ-వేలం… వినియోగించుకోండి
IND vs SL: రోహిత్ శర్మ ఖాతాలో చేరనున్న భారీ రికార్డు.. మరో 12 సిక్సులు కొడితే..!




